సుప్రీంకోర్టు జడ్జిల సంఖ్య 38కి పెంపు!
ABN , Publish Date - May 18 , 2026 | 02:29 AM
సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను 34 నుంచి 38కి పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు.
ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర
న్యూఢిల్లీ, మే 17 (ఆంధ్రజ్యోతి): సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను 34 నుంచి 38కి పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. న్యాయ వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్రం ‘సుప్రీంకోర్టు (న్యాయమూర్తుల సంఖ్య) సవరణ ఆర్డినెన్స్, 2026’ను తీసుకొచ్చింది. కోర్టుల్లో పేరుకుపోతున్న కేసుల భారాన్ని తగ్గించి, సామాన్యులకు సత్వర న్యాయం అందించే లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. 1956 చట్టాన్ని సవరిస్తూ తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి ఆమోదం తెలిపిన విషయాన్ని కేంద్ర న్యాయ శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ వెల్లడించారు. సుప్రీంకోర్టులో అదనంగా నాలుగు న్యాయమూర్తుల పోస్టులను పెంచేందుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపిన కొద్ది రోజులకే ఈ ఆర్డినెన్స్ వెలువడడం గమనార్హం.