ఎన్నికల కమిషనర్లను ప్రాసిక్యూట్ చేయలేమా
ABN , Publish Date - Oct 14 , 2026 | 06:24 AM
ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ), ఎన్నికల కమిషనర్లకు సివిల్, క్రిమినల్ ప్రాసిక్యూషన్ నుంచి చట్టబద్ధమైన మినహాయింపు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు కేంద్రప్రభుత్వానికి, కేంద్ర ఎన్నికలకమిషన్ (ఈసీ)కి నోటీసులు జారీచేసింది.
న్యూఢిల్లీ, అక్టోబరు 13: ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ), ఎన్నికల కమిషనర్లకు సివిల్, క్రిమినల్ ప్రాసిక్యూషన్ నుంచి చట్టబద్ధమైన మినహాయింపు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు కేంద్రప్రభుత్వానికి, కేంద్ర ఎన్నికలకమిషన్ (ఈసీ)కి నోటీసులు జారీచేసింది. తమ విధి నిర్వహణలో తీసుకున్న చర్యలకు సంబంధించి సీఈసీ, కమిషనర్లపై ఎలాంటి ప్రొసీడింగ్స్ జరపకుండా సీఈసీ-ఇతర కమిషనర్ల చట్టం (2023)లో సెక్షన్ 16 ద్వారా చట్టబద్ధమైన రక్షణ కల్పించారు. ప్రస్తుత లేదా విశ్రాంత సీఈసీ, కమిషనర్లపై దాఖలయ్యే సివిల్, క్రిమినల్ కేసులను కోర్టులు విచారణకు స్వీకరించరాదని ఈ నిబంధన చెబుతోంది. ఇలాంటి మినహాయింపు ఇవ్వడం చట్టబద్ధ పాలన, జవాబుదారీతనమనే రాజ్యాంగ విలువలకు లోబడి ఉందా అని ప్రశ్నిస్తూ ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం (ఏడీఆర్) పై పిటిషన్ వేసింది. ఇప్పటికే తమ ముందున్న పిటిషన్లకు దీనిని కూడా జతచేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. విచారణను ఈ నెల 29వ తేదీకి వాయిదావేసింది.