చెత్తపై యుద్థానికి కలెక్టర్లకు ‘సుప్రీం’ పవర్స్
ABN , Publish Date - May 08 , 2026 | 06:06 AM
దేశంలో ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలు--2026ను పకడ్బందీగా అమలు అంశంలో జిల్లా కలెక్టర్లకు సుప్రీం కోర్టు అత్యున్నత అధికారాలను కట్టబెట్టింది.
ఘన వ్యర్థాల నియంత్రణపై అత్యున్నత అధికారాలు
11 పాయింట్లతో సమగ్ర మార్గదర్శకాలు
దేశ సర్వోన్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు
తక్షణమే నోటిఫికేషన్ జారీ చేయాలని కేంద్రానికి స్పష్టం
న్యూఢిల్లీ, మే 7 (ఆంధ్రజ్యోతి): దేశంలో ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలు--2026ను పకడ్బందీగా అమలు అంశంలో జిల్లా కలెక్టర్లకు సుప్రీం కోర్టు అత్యున్నత అధికారాలను కట్టబెట్టింది. పర్యావరణ (సంరక్షణ) చట్టం -1986 ప్రకారం కలెక్టర్లకు ఈ చట్టబద్థమైన అధికారాలను అప్పగిస్తూ కీలక ఉత్తర్వులు వెలువరించింది. పర్యావరణ చట్టంలోని సెక్షన్ 23 ప్రకారం తక్షణమే నోటిఫికేషన్ జారీ చేయాలని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖను ఆదేశించింది. జస్టిస్ పంకజ్ మిథల్, జస్టిస్ ఎస్‌వీఎన్ భట్టితో కూడిన ధర్మాసనం ఓ కేసు విచారణ సందర్భంగా ఈ తీర్పునిచ్చింది. పట్టణాలు, నగరాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు 11 పాయింట్లతో కూడిన సమగ్ర మార్గదర్శకాలను కూడా ధర్మాసనం జారీ చేసింది. ముఖ్యంగా చట్టబద్థమైన నిబంధనలను పాటించడంలో విఫలమయ్యే భారీ వ్యర్థ ఉత్పత్తిదారుల (బల్క్ వేస్ట్ జనరేటర్స్)కు నీరు, విద్యుత్ సరఫరాను నిలిపివేసే అసాధారణ అధికారాన్ని కలెక్టర్లకు కల్పించింది. ఈ మార్గదర్శకాల అమలు చేసే క్రమంలో జిల్లా కలెక్టర్లు జారీ చేేస ఏ ఆదేశమైనా సుప్రీంకోర్టు ఉత్తర్వుల కొనసాగింపుగానే భావించాలని ధర్మాసనం తేల్చి చెప్పింది. కాగా, ఈ ఆదేశాల అమలుపై చేపట్టిన చర్యలను వివరిస్తూ కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ కార్యదర్శికి, పర్యావరణ శాఖ కార్యదర్శికి కలెక్టర్లు నివేదికలు పంపాలని కోర్టు పేర్కొంది. స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక లక్ష్యాల సాధనపై మే 24లోగా నివేదికలను దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. తదుపరి విచారణ మే 25కు వాయిదా వేసింది.
సమగ్ర వ్యర్థ నిర్వహణకు 11 సూత్రాల ప్రణాళిక
1) తడి,పొడి వ్యర్థాలను ఇళ్లు/సంస్థలు వద్దే వేరు చేయాలి. నిబంధనలు ఉల్లంఘించే వారికి చలాన్లు విధించాలి.
2) చెత్త రవాణాకు మూసివున్న వాహనాలనే వాడాలి.
3) చెత్త ఎక్కువగా పేరుకుపోయే ప్రాంతాలపై నిఘా.
4) జనం రద్దీ ఉండే చోట్ల రోజుకు రెండుసార్లు ఊడ్చాలి.
5) వ్యర్థాల ప్రాసెసింగ్‌కు ఎస్‌పీవీలను ఏర్పాటు చేయాలి.
6) పట్టణ, స్థానిక సంస్థలు తమ బడ్జెట్‌లో నిర్దిష్ట శాతాన్ని పరిశుభ్రత, వ్యర్థాల నిర్వహణకే కేటాయించాలి.
7) వార్డుల వారీగా పరిశుభ్రతపై ర్యాంకులు ఇచ్చి, ప్రోత్సాహకాలు ఇవ్వాలి.
8) కొత్తగా వెలిసే లేఅవుట్లు, విస్తరణ ప్రాంతాల్లో వ్యర్థాల నిర్వహణకు ప్రత్యేక స్థలాలను ముందే కేటాయించాలి.
9) ఎక్కడా వ్యర్థాలను పారబోయడం కానీ, పాత చెత్తకుప్పలు పేరుకుపోవడం కానీ ఉండకూడదు.
10) ప్రతి వార్డులో ‘తగ్గించడం-పునర్వినియోగించడం-రీసైక్లింగ్’ (ఆర్‌ఆర్‌ఆర్) కేంద్రాలను ఏర్పాటు చేయాలి.
11) ప్రతి ప్రధాన నగరం పారిశ్రామిక సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోవాలి. తద్వారా మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ (ఎంఆర్‌ఎఫ్) కేంద్రాలు వ్యర్థాల సేకరణకు వేదికలుగా మారతాయి. దీని ఆధారంగానే నగర పాలక సంస్థలు సదరు పరిశ్రమలకు ‘ఎక్స్‌టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ’ (ఈపీఆర్) ధ్రువీకరణ పత్రాలను జారీ చేసే వీలుంటుంది.