Supreme Court: కుక్కలకు కౌన్సెలింగ్ చేయడమే మిగిలింది!
ABN , Publish Date - Jan 08 , 2026 | 03:11 AM
వీధి కుక్కలు కరవడం వల్ల మాత్రమే ప్రజలు ప్రాణాలు కోల్పోవడం లేదని, వాటి వల్ల జరుగుతున్న రోడ్డు ప్రమాదాల కారణంగా కూడా చనిపోతున్నారని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
అలా చేస్తే వీధి కుక్కలు ఎవరినీ కరవవు!!
వీధి కుక్కల రక్షణపై దాఖలైన పిటిషన్ల విచారణలో సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యలు
న్యూఢిల్లీ, జనవరి 7: వీధి కుక్కలు కరవడం వల్ల మాత్రమే ప్రజలు ప్రాణాలు కోల్పోవడం లేదని, వాటి వల్ల జరుగుతున్న రోడ్డు ప్రమాదాల కారణంగా కూడా చనిపోతున్నారని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. వీధి కుక్కల నియంత్రణకు సంబంధించి తాము ఇచ్చిన ఆదేశాలను అమలు చేయడంలో స్థానిక సంస్థలు విఫలమవుతున్నాయని పేర్కొంది. వీధి కుక్కల రక్షణపై పెద్ద మొత్తంలో పిటిషన్‌లు దాఖలు అవుతుండడంపై అసహనం వ్యక్తం చేసింది. గత ఏడాది నవంబరు 7న తాము ఇచ్చిన ఆదేశాల్లో పాఠశాలలు, ఆస్పత్రులు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో వీధి కుక్కలు లేకుండా చూడాలని.. వాటిని షెల్టర్లకు తరలించాలని చెప్పామని గుర్తు చేసింది. వీధి కుక్కలపై దాఖలైన పిటిషన్లను జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్వీ అంజారియాల ధర్మాసనం బుధవారం విచారించింది. ‘‘రోడ్లపై కుక్కలు, ఇతర జంతువులు తిరగకుండా చూడాలి. కేవలం కుక్కల వల్లే కాదు కొన్ని జంతువులు రోడ్లపై తిరగడం వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. స్థానిక సంస్థలు నిబంధనలు, ఆదేశాలను కచ్చితంగా పాటించాలి’’ అని ధర్మాసనం పేర్కొంది. ‘‘అందరూ కుక్కల గురించే ఆలోచిస్తుంటే ఇతర జంతువుల జీవితాల సంగతేంటి? వాటివి ప్రాణాలు కావా?’’ అని ఈ కేసులో కుక్కల రక్షణపై వాదించిన సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్‌ను ప్రశ్నించింది. సిబాల్ స్పందిస్తూ.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల్లో కుక్కలకు టీకాలు వేయడం, స్టెరిలైజ్ చేయడం, షెల్టర్లు నిర్మించడం వంటి పద్ధతులతో వీధి కుక్కల సమస్య తగ్గుతోందని తెలిపారు. స్పందించిన ధర్మాసనం.. ‘‘ఇక కుక్కలకు కౌన్సెలింగ్ చేయడం ఒక్కటే మిగిలింది. కౌన్సెలింగ్ చేస్తే కుక్కలను విడిచిపెట్టిన తర్వాత అవి ఎవరినీ కరవవు’’ అంటూ సరదాగా వ్యాఖ్యానించింది. ఈ పిటిషన్లపై వాదనలు గురువారం కూడా కొనసాగనున్నాయి.