జైళ్ల సామర్థ్యం ఎంత? ఖైదీలు ఎంత మంది?
ABN , Publish Date - Mar 23 , 2026 | 04:01 AM
దేశవ్యాప్తంగా కిక్కిరిసిన జైళ్ల తీరుపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. జైళ్ల సామర్థ్యం ఎంత?, ఖైదీలు ఎంతమంది ఉన్నారు?
దేశంలో జైళ్ల పరిస్థితిపై సుప్రీంకోర్టు ఆందోళన
న్యూఢిల్లీ, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా కిక్కిరిసిన జైళ్ల తీరుపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. జైళ్ల సామర్థ్యం ఎంత?, ఖైదీలు ఎంతమంది ఉన్నారు? జైళ్లలో ఖాళీగా ఉన్న పోస్టులు ఎందుకు భర్తీ చేయడం లేదు? అంటూ ప్రశ్నించింది. జైళ్లు సంస్కరణకు నిలయాలుగా ఉండాలే తప్ప నరకకూపాలుగా మారకూడదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. జైళ్లలో స్థితిగతులపై దాఖలైన పిటిషన్‌ను సుమోటోగా విచారించిన ద్విసభ్య ధర్మాసనం కేంద్రంతోపాటు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు శనివారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ ఏడాది మార్చి 1 వరకూ జైళ్లలోని ఖైదీల సంఖ్య, జైళ్ల సామర్థ్యం, రద్దీని తగ్గించేందుకు తీసుకుంటున్న చర్యలపై మే 18లోగా సమగ్ర అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. అలాగే, జైళ్లలో మహిళా ఖైదీలతోపాటు ఉంటున్న చిన్నారుల దుస్థితిపై ధర్మాసనం కలత చెందింది. ఆ చిన్నారులకు అందుతున్న విద్యా సౌకర్యాలు, వైద్య సదుపాయాలపై స్పష్టత ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణను మే 26కు వాయిదా వేసింది.