Share News

మీడియాకు పోలీసుల బ్రీఫింగ్‌పై నియంత్రణ అవసరం

ABN , Publish Date - Jan 23 , 2026 | 04:05 AM

క్రిమినల్‌ కేసులకు సంబంధించి పోలీసు అధికారులు మీడియాకు సమాచారం తెలియజేసే అంశంలో నిర్దిష్ట విధానాలు రూపొందించి నోటిఫై చేయాలని సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాలనూ ఆదేశించింది.

మీడియాకు పోలీసుల బ్రీఫింగ్‌పై నియంత్రణ అవసరం

  • క్రిమినల్‌ కేసుల దర్యాప్తుపై విలేకరులకు వివరాలు ఇవ్వడంలో నియంత్రణ లేకుండా పోయింది

  • దీనిపై నిర్దిష్ట విధానాలు రూపొందించాలి

  • అన్ని రాష్ట్రాలకు సుప్రీం కోర్టు ఆదేశం

న్యూఢిల్లీ, జనవరి 22: క్రిమినల్‌ కేసులకు సంబంధించి పోలీసు అధికారులు మీడియాకు సమాచారం తెలియజేసే అంశంలో నిర్దిష్ట విధానాలు రూపొందించి నోటిఫై చేయాలని సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాలనూ ఆదేశించింది. గోప్యతను కాపాడి.. మీడియా ట్రయల్స్‌ను నివారించేందుకు 3 నెలల్లో ఈ పాలసీలను రూపొందించాలని జస్టిస్‌ ఎంఎం సుందరేశ్‌, జస్టిస్‌ ఎన్‌.కోటీశ్వర్‌సింగ్‌తో కూడిన ధర్మాసనం తాజాగా స్పష్టంచేసింది. దర్యాప్తు సమయాల్లో పోలీసులు మీడియా సమావేశాల్లో సమాచారమివ్వడాన్ని నియంత్రించే విషయంలో చిత్తశుద్ధి లోపించిందంటూ అసంతృప్తి వ్యక్తంచేసింది. రాష్ట్రాలు తమ పాలసీలు తయారుచేసుకునేటప్పుడు ఈ వ్యవహారంలో కోర్టుకు సహాయకారి (అమికస్‌ క్యూరీ)గా ఉన్న సీనియర్‌ న్యాయవాది గోపాల్‌ శంకర్‌నారాయణన్‌ రూపొందించిన ‘పోలీసు మాన్యువల్‌ ఆన్‌ మీడియా బ్రీఫింగ్‌’ను పరిశీలనలోకి తీసుకోవాలని సూచించింది. పోలీసు ఎన్‌కౌంటర్లు, పోలీసు అధికారుల మీడియా సమావేశాలకు సంబంధించి నిర్దిష్ట విధానాలు లేవంటూ పౌర హక్కుల సంఘం (పీయూసీఎల్‌) 1999లో దాఖలుచేసిన పిల్‌పై ధర్మాసనం ఈ నెల 15న జారీచేసిన ఉత్తర్వులు బుధవారం విడుదలయ్యాయి. వీటి ప్రతి అందుకున్న 3 నెలల్లోగా పాలసీ రూపొందించాలని నిర్దేశించింది.

Updated Date - Jan 23 , 2026 | 04:05 AM