Share News

డిజిటల్‌ అరెస్టుల్లో.. బ్యాంకులే జవాబుదారీ

ABN , Publish Date - Oct 30 , 2026 | 02:41 AM

బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు తమ బాధ్యతను సరిగా నిర్వర్తించకపోవడం వల్ల డిజిటల్‌ అరెస్టులు, సైబర్‌ మోసాలు జరిగితే.. బాధితులకు అవే పరిహారం చెల్లించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

డిజిటల్‌ అరెస్టుల్లో.. బ్యాంకులే జవాబుదారీ

  • తమ బాధ్యతలు నిర్వర్తించడంలో విఫలమైతే బాధితులకు పరిహారం అవే చెల్లించాలి: సుప్రీం కోర్టు

న్యూఢిల్లీ, అక్టోబరు 29: బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు తమ బాధ్యతను సరిగా నిర్వర్తించకపోవడం వల్ల డిజిటల్‌ అరెస్టులు, సైబర్‌ మోసాలు జరిగితే.. బాధితులకు అవే పరిహారం చెల్లించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వారు పోగొట్టుకున్న మొత్తానికి ఏమాత్రం తగ్గకుండా పరిహారం ఉండాలని.. ఈ తరహా మోసాలకు గురయ్యేప్రమాదం ఉన్నవారికి బ్యాంకులే ‘రక్షణ ఛత్రం’లాగా పనిచేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది. సాధారణం గా ఈ తరహా మోసాలకు పాల్పడేవారు తప్పుడుపత్రాలతో బ్యాంకు ఖాతాలు తెరుస్తారు. లేదా వేరే వ్యక్తుల పేరుతో ఖాతాలు (మ్యూల్‌ ఖాతాలు) తెరిపించి.. డిజిటల్‌ అరెస్టు పేరుతో అమాయకులను భయపెట్టి, ఆ మ్యూల్‌ ఖాతాల్లో డబ్బులు వేయించి ఆ సొమ్మును తాము తీసుకుంటారు. అలాంటి అనుమానాస్పద లావాదేవీలు జరగకుండా చూడాల్సిన బాధ్యత బ్యాంకులు, ఆర్థిక సంస్థలదేనని.. కాబట్టి అలాంటివి జరిగితే, బాధితులకు పరిహారం చెల్లించాల్సిన బాధ్యత వాటిదేనని సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ జోయ్‌మాల్య బాగ్చి, జస్టిస్‌ వి.మోహనల ధర్మాసనం పేర్కొంది. డిజిటల్‌ అరెస్టు స్కామ్‌లపై సుమోటోగా చేపట్టిన కేసు విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ విషయాన్ని స్పష్టం చేసింది. అనుమానాస్పద లావాదేవీలేవైనా జరుగుతుంటే.. వాటిని గ్రహించడానికి అవసరమైతే కృత్రిమ మేధను వినియోగించాలని.. డబ్బు ఒక ఖాతా నుంచి మరొక ఖాతాకు బదిలీ కాకముందే వాటిని ఆపేలా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని బ్యాంకులకు సూచించింది. ‘‘ఈ తరహా మోసాలను అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని ఆర్బీఐకి తాము సూచిస్తుంటే.. ఆర్బీఐ ఏమో బ్యాంకులతో సంప్రదింపులు జరుపుతోంది. సమస్య ఏమిటంటే.. (కొందరు) బ్యాంకు అధికారులు కూడా ఇందులో ఉన్నారు’’ అని సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.


విద్యావంతులు మోసపోవడమా?: సీజేఐ

డిజిటల్‌ అరెస్టు స్కాములపై ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నా, మీడియాలో విస్తృతంగా కవరేజీ ఇస్తున్నా.. అసలు ప్రజలు ఇంకా ఎందుకు మోసపోతున్నారని విచారణ క్రమంలో సీజేఐ అసహనం వ్యక్తం చేశారు. ‘‘ఈ బాధితులకు ఏమైంది? వారు డిజిటల్‌ మోసాల వలకు ఎలా చిక్కుతున్నారు? ఇంత చిన్న విషయం వారికెందుకు అర్థం కావట్లేదు? మొబైల్‌ ద్వారా అరెస్టు భయమేమిటి? ప్రజాస్వామ్య దేశంలో ఇలా మొబైల్‌ఫోన్‌ ద్వారా అరెస్టు అవుతున్నామని ఇంకా నమ్మడం ఎలాంటి వ్యక్తి లక్షణం? (అలాంటి సందర్భాల్లో) మొబైల్‌ఫోన్‌ను గోడకేసి కొడితే అరెస్టు దానంతట అదే పోతుంది’’ అని వ్యాఖ్యానించారు. ‘‘విద్యావంతులంతా మోసపోతుండడం మాకు నిరాశ కలిగిస్తోంది. ఈ వయసులో మీరు డిజిటల్‌ అరెస్టు అయితే.. తర్వాత తరానికి ఏం అందిస్తారు?’’ అని సీజేఐ ఆవేదన వెలిబుచ్చారు. అరెస్టు భయమే బాధితులను మోసగాళ్ల డిమాండ్లకు తలొగ్గేలా చేస్తోందని.. కొందరు మనస్తత్వ నిపుణులు ఈ పరిస్థితిని ఒకరకమైన హిప్నోసి్‌సగా అభివర్ణిస్తున్నారని అమికస్‌ క్యూరీగా వ్యవహరించిన సీనియర్‌ న్యాయవాది ఎన్‌ఎ్‌స నప్పినై ఈ సందర్భంగా ధర్మాసనానికి వివరించారు. వీటిని అరికట్టడానికి చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. ఈ స్కాములు కొనసాగుతున్నాయని, ఇటీవలే ఒక మహిళ డిజిటల్‌ అరెస్టు భయంతో రూ.2.5 కోట్లు పోగొట్టుకున్నారని తెలిపారు. ఇక.. ఈ కేసులో కేంద్రం తరఫున అటార్నీజనరల్‌ ఆర్‌.వెంకటరమణి వాదనలు వినిపించారు. డిజిటల్‌ అరెస్టులు, సైబర్‌ఫ్రాడ్‌లను అరికట్టడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని.. దీనివల్ల నిరుటితో పోలిస్తే డిజిటల్‌ అరెస్టు కేసులో 50ు దాకా తగ్గాయని ధర్మాసనానికి నివేదించారు. వీటిని అరికట్టేందుకు రిజర్వు బ్యాంకు మార్గదర్శకాలు రూపొందించిందని.. వాటిని నవంబరు 30 నాటికి నోటిఫై చేసి.. డిసెంబరు 31 నుంచి అమల్లోకి తెచ్చే అవకాశం ఉందని తెలిపారు. దీనికి సీజేఐ స్పందిస్తూ.. ఖాతాదారులు అనుమానాస్పద లావాదేవీలేవైనా చేస్తుంటే బ్యాంకులు వాటి ని తాత్కాలికంగా నిలిపివేయాలని సూచించారు. సదరు లావాదేవీ నిజమైనదా కాదా భౌతికంగా నిర్ధారించుకోవాలని పేర్కొన్నారు. ఒక ఖాతాదారు తన అలవాటుకు భిన్నంగా అసాధారణ లావాదేవీ జరుపుతున్నప్పుడు.. అతడు మోసగాళ్ల బారిన పడుతున్నట్టు బ్యాంకులు గ్రహించాలని.. సదరు ఖాతాదారుడు ఉండే ప్రాంత పోలీసుస్టేషన్‌కు వెంటనే సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు.

Updated Date - Oct 30 , 2026 | 02:43 AM