Share News

మెడికల్‌ సీట్ల భర్తీకి గడువు పెంపు కుదరదు

ABN , Publish Date - Mar 25 , 2026 | 03:54 AM

తెలుగు రాష్ట్రాల ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీ యాజమాన్యాలకు సుప్రీంకోర్టులో నిరాశే ఎదురైంది. మెడికల్‌ సీట్ల భర్తీకి కౌన్సెలింగ్‌ గడువును పొడిగించేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది.

మెడికల్‌ సీట్ల భర్తీకి గడువు పెంపు కుదరదు

  • తెలుగు రాష్ట్రాల ప్రైవేటు కాలేజీలకు సుప్రీంలో నిరాశ

న్యూఢిల్లీ, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ట్రాల ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీ యాజమాన్యాలకు సుప్రీంకోర్టులో నిరాశే ఎదురైంది. మెడికల్‌ సీట్ల భర్తీకి కౌన్సెలింగ్‌ గడువును పొడిగించేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వానికి వినతిపత్రం సమర్పించుకునేందుకు మాత్రం అనుమతి ఇచ్చింది. మెడికల్‌ సీట్ల భర్తీకి మరోసారి అవకాశం కల్పించేలా జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ)ను ఆదేశించాలని కోరుతూ 14న ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రైవేటు మెడికల్‌, డెంటల్‌ కాలేజీల యాజమాన్యాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఆ పిటిషన్‌పై మంగళవారం జస్టిస్‌ పమిడిఘంటం శ్రీనరసింహా నేతృత్వంలోని జస్టిస్‌ ఆలోక్‌ అరాధేలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించింది.

సాంకేతిక లోపాల వల్లే మెడికల్‌ సీట్ల ఖాళీ

కౌన్సెలింగ్‌ విధానంలోని లోపాల వల్లే తెలుగు రాష్ట్రాల్లో సుమారు 700కు పైగా మెడికల్‌ సీట్లు ఖాళీగా ఉండిపోయాయని పిటిషనర్ల తరఫు సీనియర్‌ న్యాయవాది ఎస్‌.నిరంజన్‌ రెడ్డి సుప్రీంకోర్టు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. విద్యార్థులు ఒక కాలేజీ నుంచి మరో కాలేజీకి మారుతుండటం వల్ల పాత సీట్లు ఖాళీ అయ్యాయని, వీటిని భర్తీ చేయకపోతే జాతీయ వనరులు వృథా అవుతాయని తెలిపారు. ‘‘మెరుగైన కళాశాలల్లో సీట్ల కోసం విద్యార్థులు ఆప్షన్లను మార్చుకోవడం వల్లే మొదట కేటాయించిన సీట్లు ఖాళీ అవుతున్నాయి. ఈ ఏడాది ప్రవేశ పరీక్షలు, కౌన్సెలింగ్‌ ప్రక్రియలో అసాధారణంగా జాప్యం జరిగింది. విలువైన వైద్య విద్య సీట్లు వృథా కాకుండా ఉండాలంటే మరో విడత కౌన్సెలింగ్‌ నిర్వహించేందుకు అనుమతించాలి’’ అని నిరంజన్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ముంబయి, కర్ణాటక ఉన్నత న్యాయస్థానాల తీర్పులను ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ.. మార్చి 31 వరకు గడువు పొడిగించి తుది అవకాశం కల్పించాలని విన్నవించారు.

..ఇంకెంతకాలం?: ధర్మాసనం

వైద్య విద్యా ప్రవేశాల గడువు పొడిగింపుపై అత్యున్నత న్యాయస్థానం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ‘ఈ కౌన్సెలింగ్‌ ప్రక్రియ ఇంకా ఎంతకాలం కొనసాగుతుంది? ఇప్పటికే చాలా ఆలస్యమైంది.’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇతర రాష్ట్రాల హైకోర్టులు ఇచ్చిన ఉత్తర్వులను తాము పరిగణనలోకి తీసుకోలేమని తేల్చిచెప్పింది. గడువు పెంపునకు సంబంధించి నేరుగా ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేమని స్పష్టం చేసింది. పిటిషనర్ల అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. సమస్యను వివరిస్తూ కేంద్ర ప్రభుత్వానికి లేదా సంబంధిత అధికారులకు వినతిపత్రం సమర్పించుకునేందుకు వెసులుబాటు కల్పించింది. ఆ వినతిని మెరిట్‌ (అర్హత) ప్రాతిపదికన పరిశీలించి, చట్టబద్ధంగా తగిన నిర్ణయం తీసుకోవాలని కేంద్రానికి సూచిస్తూ పిటిషన్‌పై విచారణను ముగించింది.

Updated Date - Mar 25 , 2026 | 03:54 AM