Denies Bail to Umar Khalid and Sharjeel Imam: ఢిల్లీ అల్లర్లు-హింస కేసులో..ఉమర్, షర్జీల్‌కు నో బెయిల్
ABN , Publish Date - Jan 06 , 2026 | 01:04 AM
పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) నిరసిస్తూ ఐదేళ్ల కిందట ఢిల్లీలో సంభవించిన అల్లర్లు, హింసాకాండకు సంబంధించిన కుట్ర కేసులో....
మిగతా ఐదుగురికి మంజూరుచేసిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ, జనవరి 5: పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) నిరసిస్తూ ఐదేళ్ల కిందట ఢిల్లీలో సంభవించిన అల్లర్లు, హింసాకాండకు సంబంధించిన కుట్ర కేసులో నిందితులైన ఉమర్ ఖాలిద్, షర్జీల్ ఇమామ్‌కు బెయిల్ మంజూరు చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. వారు నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని అభియోగాలకు ప్రాథమిక ఆధారాలు కనిపిస్తున్నాయని తెలిపింది. ఈ కేసులో మిగతా ఐదుగురికి బెయిల్ మంజూరుచేసింది. ఈ మేరకు జస్టిస్ అరవింద్‌కుమార్, జస్టిస్ ఎన్‌వీ అంజారియాతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. సీఏఏ వ్యతిరేక ప్రదర్శనలు 2020 ఫిబ్రవరి నెలాఖరులో ఈశాన్య ఢిల్లీలో హింసాత్మక రూపం దాల్చాయి. ఈ సందర్భంగా 53 మంది ప్రాణాలు కోల్పోవడం, 700 మందికిపైగా గాయపడడం తెలిసిందే. నిందితులపై చట్టవిరుద్ధ కార్యకలాపాల వ్యతిరేక చట్టం (యూఏపీఏ) కింద ఢిల్లీ పోలీసులు కేసులు నమోదుచేశారు. ఈ వ్యవహారంలో నిందితులందరినీ ఒకేగాటన కట్టలేమని.. ఒక్కొక్కరూ వేర్వేరు పాత్రలు పోషించారని ధర్మాసనం తెలిపింది. ఈ హింసాకాండలో ఇతర నిందితులతో పోలిస్తే ఉమర్, షర్జీల్ కీలకమైన, నిర్మాణాత్మక పాత్ర పోషించారని పేర్కొంది. అందుకే గుల్‌ఫిషా ఫాతిమా, మీరన్ హైదర్, షిఫాయుర్ రెహ్మాన్, మొహ్మద్ సలీం ఖాన్, షాదాబ్ అహ్మద్‌లకు బెయిల్ ఇస్తున్నట్లు వెల్లడించింది. అయితే సాక్షుల విచారణ పూర్తయ్యాక.. లేదంటే ఏడాది తర్వాత బెయిల్ కోసం కీలక నిందితులైన ఉమర్, షర్జీల్ కొత్తగా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ‘చెదురుమదురుగా, స్థానికంగా జరిగే దాడులకు మించి వీరిద్దరూ ప్రణాళికాబద్ధంగా, ఉద్దేశపూర్వకంగా జనసమీకరణ చేయడం.. అల్లర్లకు వ్యూహాత్మక నిర్దేశం చేయడం వంటి కీలక పాత్ర పోషించారనడానికి ప్రాథమిక ఆధారాలున్నట్లు ప్రాసిక్యూషన్ తేల్చింది’ అని స్పష్టంచేసింది. ఇదే సమయంలో బెయిల్ ప్రక్రియను వేగవంతం చేయాలని ట్రయల్ కోర్టును ఆదేశించింది. ఆ ఐదుగురికీ 11 షరతులతో బెయిల్ మంజూరుచేసింది. సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన తర్వాత ఉమర్ తన భాగస్వామి భానుజ్యోత్స్న లహిరితో మాట్లాడారు. ఇక జైలే తన జీవితమని.. మిగతా ఐదుగురికి బెయిల్ రావడం తనకు ఉపశమనం ఇచ్చిందని వ్యాఖ్యానించారు.