డబ్బులు, అధికారం ఉంటే ఏదైనా దొరుకుతుంది!
ABN , Publish Date - Sep 22 , 2026 | 04:30 AM
‘డబ్బులు, అధికారం ఉంటే ఈ దేశంలో ఏదైనా దొరుకుతుంది’ అంటూ బెయిల్‌పై విడుదలైన నిందితుడు వ్యాఖ్యానించగా.. అతడి బెయిల్ రద్దు చేయాలంటూ బాధితకుటుంబం సుప్రీం కోర్టును ఆశ్రయించింది
బెయిల్ తర్వాత నిందితుడి కామెంట్
బెయిల్ రద్దు చేయాలంటూ
బాధిత కుటుంబం పిటిషన్
నిరాకరించిన సుప్రీం ధర్మాసనం
న్యూఢిల్లీ, సెప్టెంబరు 21: ‘డబ్బులు, అధికారం ఉంటే ఈ దేశంలో ఏదైనా దొరుకుతుంది’ అంటూ బెయిల్‌పై విడుదలైన నిందితుడు వ్యాఖ్యానించగా.. అతడి బెయిల్ రద్దు చేయాలంటూ బాధితకుటుంబం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీనిపై సోమవారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం.. బెయిల్ రద్దు చేయటానికి నిరాకరించింది. ఈ కేసు వివరాలు ఏమిటంటే.. హరియాణాలోని బెర్లాలో 2022 అక్టోబరు 28వ తేదీన ఓ భూతగాదా సందర్భంగా గజానంద్, విశాల్ గొడవపడ్డారు. ఆ క్రమంలో గజానంద్ మరణించాడు. తర్వాత పోలీసులు విశాల్‌ను అరెస్టు చేసి జైలుకు పంపించారు. బెయిల్ కోసం విశాల్ పలుమార్లు దరఖాస్తు చేసుకున్నప్పటికీ రాలేదు. ఈ ఏడాది ఏప్రిల్‌లో పంజాబ్ హరియాణా హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా విశాల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం, అది వైరల్ కావటంతో బాధిత కుటుంబం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి బెయిల్ రద్దు చేయాలని కోరింది. దీనిని ధర్మాసనం తిరస్కరించింది.