Share News

అది ప్రణాళికాబద్ధమైన దాడి!

ABN , Publish Date - Feb 26 , 2026 | 02:21 AM

జాతీయ విద్యాపరిశోధన-శిక్షణ మండలి ఎన్‌సీఈఆర్‌టీ 8వ తరగతి సాంఘిక శాస్త్రం పాఠ్యపుస్తకంలో ‘న్యాయవ్యవస్థలో అవినీతి’ని పాఠంగా చేర్చడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది....

అది ప్రణాళికాబద్ధమైన దాడి!

  • ఇది ముమ్మాటికీ న్యాయవ్యవస్థ ప్రతిష్ఠకు భంగం కలిగించడమే. దేశ అత్యున్నత న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను దిగజార్చేలా వ్యవహరిస్తే సహించేది లేదు. చట్టం కఠిన చర్యలు తీసుకుంటుంది.

- చీఫ్‌ జస్టిస్‌ సూర్యకాంత్‌

  • 8వ తరగతి పిల్లలకు ‘న్యాయవ్యవస్థలో అవినీతి’పై పాఠమా?

  • సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఫైర్‌

  • వ్యవస్థ సమగ్రతను దెబ్బతీయడాన్ని ఈ భూమ్మీద ఎవరినీ అనుమతించను

  • ఈ వ్యవహారం ఎంత దూరం వెళ్లినా చట్టం తన పని తాను చేస్తుంది

  • ఎలా డీల్‌ చేయాలో నాకు బాగా తెలుసు.. ఇప్పటికే ఆదేశాలిచ్చా.. సుమోటోగా తీసుకుంటున్నా

  • చీఫ్‌ జస్టిస్‌ సూర్యకాంత్‌ హెచ్చరిక

  • నేడు సుమోటోగా విచారణ!

  • తక్షణమే స్పందించిన ఎన్‌సీఈఆర్‌టీ

  • వెబ్‌సైట్‌ నుంచి సాంఘిక శాస్త్రం పాఠ్యపుస్తకం తొలగింపు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): జాతీయ విద్యాపరిశోధన-శిక్షణ మండలి (ఎన్‌సీఈఆర్‌టీ) 8వ తరగతి సాంఘిక శాస్త్రం పాఠ్యపుస్తకంలో ‘న్యాయవ్యవస్థలో అవినీతి’ని పాఠంగా చేర్చడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఇది జ్యుడీషియరీపై ప్రణాళికాబద్ధమైన, లోతైన దాడిగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ అభివర్ణించారు. న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు ఈ భూమ్మీద ఎవరినీ అనుమతించనని తేల్చిచెప్పారు. న్యాయవ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లను ఎన్‌సీఈఆర్‌టీ 8వ తరగతి సాంఘిక శాస్త్రం కొత్త పాఠ్యపుస్తకంలో పొందుపరచింది. న్యాయవ్యవస్థలో అవినీతి, భారీగా పెండింగ్‌ కేసులు, న్యాయాధికారులు/న్యాయమూర్తుల కొరతను కూడా అందులో ప్రస్తావించింది. ‘మన సమాజంలో న్యాయవ్యవస్థ పాత్ర’ పేరుతో ఈ అధ్యాయాన్ని చేర్చింది. గత సంచికల్లో న్యాయవ్యవస్థ, కోర్టుల పాత్ర వరకే పరిమితం కాగా.. సోమవారం విడుదల చేసిన నూతన పాఠ్యపుస్తకంలో కోర్టుల వ్యవస్థ, న్యాయం ఎంతవరకు అందుతోంది.. అనే అంశాలపై విస్తృతంగా చర్చించారు. అదే సమయంలో న్యాయవ్యవస్థలో అవినీతి, ఆర్థికంగా బలహీన వర్గాలకు న్యాయం అందించడంలో దాని ప్రభావం గురించి వివరించారు. ఈ అంశాన్ని సీనియర్‌ న్యాయవాదులు కపిల్‌ సిబల్‌, అభిషేక్‌ మనుసింఘ్వీ బుధవారం జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ జోయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్‌ విపుల్‌ ఎస్‌.పంచోలితో కూడిన ధర్మాసనం ముందు ప్రస్తావించారు. ఆ పాఠ్యపుస్తకంలోని సదరు అధ్యాయం అవమానకరంగా ఉందని.. ఆ పుస్తకం ప్రతులు తమ వద్ద ఉన్నాయని సిబల్‌ తెలిపారు. ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకంలో 8వ తరగతి పిల్లలకు న్యాయవ్యవస్థలో అవినీతిని నేర్పిస్తుండడం చూసి ఈ వ్యవస్థలో సభ్యులుగా ఆందోళన చెందుతున్నామన్నారు.


న్యాయవ్యవస్థలో మాత్రమే అవినీతి ఉన్నట్లు పేర్కొన్నారని.. రాజకీయ నాయకులు, మంత్రులు, బ్యూరోక్రాట్లు, ఇతరుల గురించి ఒక్క మాట కూడా లేదని.. ఇది తమను కలవరపరుస్తోందని సింఘ్వీ అన్నారు. దీనిపై చీఫ్‌ జస్టిస్‌ స్పందించారు. ‘ఇది కచ్చితంగా మొత్తం వ్యవస్థను, అందులోని భాగస్వాములను ఆందోళనకు గురిచేస్తోంది. ఒక్క రోజు ఆగండి. ఇప్పటికే నేను సుమోటోగా ఈ వ్యవహారాన్ని పరిగణనలోకి తీసుకున్నాను. ఆదేశాలు కూడా ఇచ్చాను. న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను, సమగ్రతను దెబ్బతీయడానికి ఈ భూమ్మీద ఏ ఒక్క వ్యక్తినీ అనుమతించే ప్రసక్తే లేదు. ఏ పరిస్థితుల్లోనూ ఇందుకు అనుమతించను. ఈ వ్యవహారం ఎంత దూరం వెళ్లినా.. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. దీనినెలా డీల్‌ చేయాలో నాకు బాగా తెలుసు’ అని సీజేఐ తేల్చిచెప్పారు. ఇది చాలా ప్రణాళికాబద్ధమైన, లోతైన దాడిగా కనిపిస్తోందన్నారు. ఇంతకు మించి ఏమీ మాట్లాడాలనుకోవడం లేదని చెప్పారు. తన విధి తాను నిర్వర్తించానని స్పష్టంచేశారు. ఈ అంశాన్ని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చినందుకు సిబల్‌, సింఘ్వీలకు ధన్యవాదాలు తెలియజేశారు. కాగా.. ఈ వివాదంపై త్రిసభ్య ధర్మాసనం గురువారం సుమోటోగా విచారణ జరిపే అవకాశముంది.

వెబ్‌సైట్‌ నుంచి ‘పాఠ్యపుస్తకం’ మాయం

సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం నేపథ్యంలో ఎన్‌సీఈఆర్‌టీ తక్షణమే స్పందించింది. తన వెబ్‌సైట్‌ నుంచి 8వ తరగతి సాంఘిక శాస్త్రం పాఠ్యపుస్తకాన్ని తొలగించింది. అందులోని న్యాయవ్యవస్థ తాలూకు వివాదాస్పద అంశాలను కూడా తొలగించాలని జాతీయ మండలి యోచిస్తోందని కేంద్రప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఎన్‌సీఈఆర్‌టీ స్వతంత్ర సంస్థ అని.. పాఠ్యపుస్తకాల్లో అధ్యాయాలను చేర్చేటప్పుడు దాని అధికారులు బుర్రపెట్టి ఉండాల్సిందని కేంద్రప్రభుత్వ వర్గాలు వ్యాఖ్యానించాయి. న్యాయవ్యవస్థకు సంబంధించిన సదరు అంశాల కూర్పులో సమతౌల్యం లేదని పేర్కొన్నాయి. ‘పెండింగ్‌ కోర్టు కేసులు, న్యాయవ్యవస్థలో అవినీతిపై ఆ పుస్తకంలో చర్చించారు. అయితే భారత వ్యవస్థాగత ఫ్రేమ్‌వర్క్‌ ఎలా ఉంటుందో చెప్పడమే దాని ఉద్దేశమైతే.. పార్లమెంటు, కార్యనిర్వాహక వర్గం పాత్రలకు కూడా సమ ప్రాధాన్యం ఇచ్చి ఉండాల్సింది. కేవలం న్యాయవ్యవస్థకు సంబంధించిన అంశాలనే ప్రస్తావించడం వల్ల విద్యార్థుల్లో తప్పుడు అవగాహన సృష్టించే అవకాశం ఉంది’ అని స్పష్టం చేశాయి. ఈ వ్యవహారంపై ఎన్‌సీఈఆర్‌టీ చైర్మన్‌ దినేశ్‌ ప్రసాద్‌ సక్లానీ స్పందించలేదు.

Updated Date - Feb 26 , 2026 | 02:21 AM