Share News

ట్రైబ్యునళ్లు భారంగా మారాయ్‌!

ABN , Publish Date - Feb 27 , 2026 | 04:05 AM

దేశంలో ట్రైబ్యునళ్ల పనితీరుపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ట్రైబ్యునళ్లు అస్తవ్యస్తంగా, ఎలాంటి జవాబుదారీతనం లేకుండా...

ట్రైబ్యునళ్లు భారంగా మారాయ్‌!

  • అస్తవ్యస్తంగా, ఎవరికీ జవాబుదారీగా లేకుండా పనిచేస్తున్నాయి : సుప్రీం కోర్టు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: దేశంలో ట్రైబ్యునళ్ల పనితీరుపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ట్రైబ్యునళ్లు అస్తవ్యస్తంగా, ఎలాంటి జవాబుదారీతనం లేకుండా భారంగా మారాయని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఒక ఆర్థిక ట్రైబ్యునల్‌కు చెందిన సాంకేతిక సభ్యులు తీర్పును కూడా ఔట్‌సోర్సింగ్‌ ద్వారా రాయించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ట్రైబ్యునల్‌ సంస్కరణల చట్టం-2021ని గత ఏడాది కొట్టివేసిన నేపథ్యంలో చైర్‌పర్సన్లతో సహా ట్రైబ్యునల్‌ సభ్యుల పదవీకాలాన్ని పొడిగించాలంటూ దాఖలైన పిటిషన్‌ విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. ట్రైబ్యునళ్లు ప్రభుత్వం సృష్టించినవని, ఎవరికీ జవాబుదారీగా లేకుండా, ఎవరి నియంత్రణలోనూ లేనివిగా పని చేస్తున్నాయని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ జాయ్‌మాల్యా బాగ్చి, జస్టిస్‌ విపుల్‌ ఎం.పంచోలీల ధర్మాసనం గురువారం వ్యాఖ్యానించింది. ట్రైబ్యునళ్లలో ఖాళీల భర్తీకి అత్యవసరంగా చర్యలు తీసుకోవాలని అటార్నీ జనరల్‌ ఆర్‌.వెంకటరమణిని ఆదేశించింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం.. టీడీశాట్‌ చైర్‌పర్సన్‌ పదవీ విరమణ చేసిన తర్వాత ట్రైబ్యునల్‌ సాంకేతిక సభ్యుడు తాత్కాలిక చైర్‌పర్సన్‌ అవుతారని ధర్మాసనం పేర్కొంది. ఈ నిబంధనను ధర్మాసనం తప్పుపట్టింది. టీడీశాట్‌ లాంటి ముఖ్యమైన ట్రైబ్యునళ్లలో పాలనాపరమైన సంక్షోభాలు తలెత్తకుండా చూసుకోవాలని ఏజీకి సూచించింది. ‘‘మిస్టర్‌ అటార్నీ జనరల్‌, ట్రైబ్యునళ్లు మీ (కేంద్రం) సృష్టి. అవి క్రమంగా తలనొప్పిగా మారాయి. మీకు తలనొప్పిగా, మాకు భారంగా మారాయి. ట్రైబ్యునళ్లు జారీ చేసే ఆదేశాల కారణంగా మాకు భారంగా మారుతున్నాయి. అవి పనిచేస్తున్న విధానం మాకు సవాలుగా మారుతోంది’’ అని సీజేఐ అన్నారు.

Updated Date - Feb 27 , 2026 | 04:05 AM