Share News

మేము నియమించిన కమిటీకి వసతులు కల్పించకపోవడం మాకు అవమానం

ABN , Publish Date - Apr 22 , 2026 | 03:36 AM

ప్రైవేటు విశ్వవిద్యాలయాల ఆడిటింగ్‌ కోసం తాము నియమించిన కమిటీకి అవసరమైన వసతులు కల్పించలేదని కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

మేము నియమించిన కమిటీకి వసతులు కల్పించకపోవడం మాకు అవమానం

  • ప్రైవేటు వర్సిటీల ఆడిటింగ్‌ లో కేంద్రంపై సుప్రీం ఆగ్రహం

  • కేంద్ర విద్యా శాఖ కార్యదర్శికి కోర్టు ధిక్కరణ నోటీసులు

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 21: ప్రైవేటు విశ్వవిద్యాలయాల ఆడిటింగ్‌ కోసం తాము నియమించిన కమిటీకి అవసరమైన వసతులు కల్పించలేదని కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్రం తీరు సుప్రీం కోర్టును అవమానించడమేనని వ్యాఖ్యానించింది. ఇందుకు సంబంధించి కేంద్ర విద్యా శాఖ కార్యదర్శి వినీత్‌ జోషీకి సోమవారం కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. ఇది చాలా పెద్ద వ్యవహారమని, అందుకే అందరూ ఉద్దేశపూర్వకంగా ఆడిటింగ్‌ ప్రక్రియను ఆలస్యం చేస్తున్నారంటూ సుప్రీం కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అసలేం జరిగిందంటే.. కాలేజీ రికార్డుల్లో తన పేరు మార్పు అంశంలో యాజమాన్యం తనని వేధింపులకు గురి చేస్తోందంటూ అమిటీ విశ్వవిద్యాలయానికి చెందిన ఓ విద్యార్థిని సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం... దేశంలోని అన్ని ప్రైవేటు, డీమ్డ్‌ విశ్వవిద్యాలయాలను ఎవరు నిర్వహిస్తున్నారు ? యాజమాన్యాలు ఎవరు ? సిబ్బందివేతనాల చెల్లింపు ? తదితర అంశాలను తేల్చేందుకు ఆడిటింగ్‌ చేయాలని ఆదేశించింది. ఇందుకోసం మాజీ ఐఆర్‌ఎస్‌ అధికారి ఆర్‌ఎం శర్మ నేతృత్వంలో ఓ కమిటీని కూడా నియమించింది. అన్ని యాజమాన్యాలు ఆ కమిటీకి అఫిడవిట్లు సమర్పించాలని స్పష్టం చేసింది. అలాగే, కమిటీ పని చేసేందుకు కావాల్సిన వసతులను కల్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ ఫిబ్రవరిలో ఉత్తర్వులు జారీ చేసింది.

Updated Date - Apr 22 , 2026 | 03:36 AM