Share News

కొలీజియం నిర్ణయాలపై కోర్టులు జోక్యం చేసుకోలేవు

ABN , Publish Date - Jun 24 , 2026 | 03:38 AM

హైకోర్టు, సుప్రీంకోర్టు కొలీజియాల నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. జడ్జిల ఎంపిక ప్రక్రియ న్యాయస్థానాల..

కొలీజియం నిర్ణయాలపై కోర్టులు జోక్యం చేసుకోలేవు

  • ఆర్టీఐ కింద సమాచారమూ కుదరదు

  • జడ్జిల ఎంపికపై సుప్రీంకోర్టు స్పష్టీకరణ

న్యూఢిల్లీ, జూన్‌ 23: హైకోర్టు, సుప్రీంకోర్టు కొలీజియాల నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. జడ్జిల ఎంపిక ప్రక్రియ న్యాయస్థానాల సమీక్షకు, ఆర్టీఐ చట్టానికి పూర్తిగా అతీతమైనదని తేల్చిచెప్పింది. హైకోర్టు జడ్జిలను ఎలా ఎంపిక చేశారు? ఎవర్ని ఎందుకు తీసుకున్నారు అనే విషయాలను కోర్టుల్లో కేసులేసి ప్రశ్నించలేమని, ఆర్టీఐ చట్టం కింద దరఖాస్తులు పెట్టి తెలుసుకోవడం కుదరదని స్పష్టం చేసింది. ఈ మేరకు హిమాచల్‌ ప్రదేశ్‌కు చెందిన జిల్లా జడ్జి అరవింద్‌ మల్హోత్రా వేసిన పిటిషన్‌ను సోమవారం తోసిపుచ్చింది. సీనియర్‌ను అయిన తనను కాదని, జూనియర్ల పేర్లను హిమాచల్‌ప్రదేశ్‌ హైకోర్టు కొలీజియం సిఫార్సు చేసిందని ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జస్టిస్‌ నాగరత్న, జస్టిస్‌ బాగ్చీ ధర్మాసనం దీనిపై స్పందిస్తూ, జడ్జిల ఎంపిక పూర్తిగా కమిటీ వ్యక్తిగత అంచనాపై ఆధారపడి ఉంటుందని చెప్పింది. జడ్జిల ఎంపిక ప్రక్రియను కోర్టులు సమీక్షించడం మొదలుపెడితే అందరూ కోర్టును ఆశ్రయిస్తారని, దానికి అంతూ పొంతూ ఉండదని ఆందోళన వ్యక్తం చేసింది. న్యాయమూర్తిగా ఎంపికకు సీనియారిటీ ఒక్కటే ప్రాతిపదిక కాదని, కొలీజియం ఒక పేరును ఆమోదించాక దానిపై పునరాలోచన ఉండదని చెప్పింది. మల్హోత్రాకు ఇంకా పదేళ్ల సర్వీసు ఉందని, ఆయన ఓపిగ్గా ఎదురు చూడాలని సలహా ఇచ్చింది.

Updated Date - Jun 24 , 2026 | 03:38 AM