Share News

డిస్మిస్‌ అంటే ఉద్యోగిని రోడ్డున పడేయడమే

ABN , Publish Date - Jun 15 , 2026 | 03:33 AM

ఒక ఉద్యోగి తీవ్రమైన తప్పులు చేసినప్పుడు, అక్రమాలకు పాల్పడినప్పుడు మాత్రమే ఉద్యోగం నుంచి తొలగించడం సబబని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

డిస్మిస్‌ అంటే ఉద్యోగిని రోడ్డున పడేయడమే

  • తీవ్రమైన అక్రమాలకు పాల్పడితేనే ఉద్యోగం నుంచి తొలగించాలి: సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ, జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి): ఒక ఉద్యోగి తీవ్రమైన తప్పులు చేసినప్పుడు, అక్రమాలకు పాల్పడినప్పుడు మాత్రమే ఉద్యోగం నుంచి తొలగించడం సబబని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. డిస్మిస్‌ చేయడం అనేది ఒక ఉద్యోగి జీవితాన్ని రోడ్డున పడేసే అత్యంత కఠినమైన శిక్ష అని పేర్కొంది. తప్పు తీవ్రతతో పాటు సదరు ఉద్యోగి సుదీర్ఘ సర్వీసు, వయసు, సంస్థకు ఎలాంటి నష్టం వాటిల్లిందనే అంశాలను బేరీజు వేసుకున్నాకే నిర్ణయం తీసుకోవాలని సూచించింది. విచారణ పెండింగ్‌లో ఉన్న కాలంలో విధించే సస్పెన్షన్‌ను.. డిస్మిసల్‌తో పాటు అదనపు శిక్షగా మార్చడం ఎంతమాత్రం సరికాదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. 11 ఏళ్ల సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత మహారాష్ట్ర విద్యుత్తు పంపిణీ సంస్థకు చెందిన ఒక మహిళా ఉద్యోగికి ఊరటనిస్తూ కోర్టు ఈ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. మహారాష్ట్ర విద్యుత్తు పంపిణీ సంస్థ(ఎంఎ్‌సఈడీసీఎల్‌)లో 1985లో సురేఖ ఉద్యోగంలో చేరారు. బదిలీల వ్యవహారంలో ఆ సంస్థపై ఆమె న్యాయపోరాటం చేసి గెలిచారు. దీనికి కక్ష సాధింపుగా సంస్థ ఆమెపై అంతర్గత విచారణ జరిపి, 2006లో సస్పెండ్‌ చేసింది. 2017లో ఆమెను ఉద్యోగం నుంచి తొలగించింది. పైగా, 11 ఏళ్ల సస్పెన్షన్‌ కాలాన్ని కూడా శిక్షగా మారుస్తూ ఆమెకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలను నిలిపివేసింది. దీనిపై సురేఖ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్‌పై సుధీర్ఘ విచారణ అనంతరం ధర్మాసనం కీలక తీర్పునిచ్చింది. అవినీతికి, అధికారుల మాట వినకపోవడానికి మధ్య ఎంతో వ్యత్యాసం ఉందని న్యాయస్థానం గుర్తు చేసింది. బాధితురాలిపై వచ్చిన ఆరోపణలు కేవలం క్రమశిక్షణా రాహిత్యానికి సంబంధించినవేనని.. అవినీతి, లంచగొండితనం, నిధుల దుర్వినియోగం లాంటి తీవ్రమైన నేరాలు కావని కోర్టు అభిప్రాయపడింది. అందువల్ల ఉద్యోగం నుంచి తీసేయడం ఘోరమైన శిక్ష అవుతుందని పేర్కొంది. అలాగే, దాదాపు 11 ఏళ్ల పాటు ఉన్న సస్పెన్షన్‌ కాలాన్ని అదనపు శిక్షగా పరిగణించడాన్ని తప్పుబట్టింది. సర్వీస్‌ రూల్స్‌ అనుమతిస్తే తప్ప, ఒకే తప్పునకు రెండు వేర్వేరు శిక్షలను కలిపి ఇవ్వడానికి వీల్లేదంది. ఈ సస్పెన్షన్‌ కాలాన్ని మొదటి 6నెలలు, ఆ తర్వాత మిగిలిన 10.4 ఏళ్లుగా విభజించి.. ఆమెకు అందాల్సిన ఆర్థిక ప్రయోజనాలను చెల్లించాలని ధర్మాసనం ఆదేశించింది.

Updated Date - Jun 15 , 2026 | 03:33 AM