Share News

ఇంటర్నెట్‌ వినియోగం పిల్లల ప్రాథమిక హక్కు

ABN , Publish Date - Oct 18 , 2026 | 05:48 AM

ఇంటర్నెట్‌ వినియోగం పిల్లలతో సహా అందరి ప్రాథమిక హక్కు అని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఆన్‌లైన్‌ విషయంలో ఆందోళనలు ఉన్నా కూడా పిల్లలకు డిజిటల్‌ యాక్సెస్‌ను పూర్తిగా నిషేధించలేమని తేల్చి చెప్పింది.

ఇంటర్నెట్‌ వినియోగం పిల్లల ప్రాథమిక హక్కు

  • పిల్లలకు డిజిటల్‌ యాక్సె్‌సను పూర్తిగా నిషేధించలేం

  • కట్టడి చేస్తే చట్టవిరుద్ధమైన మరో మార్గం వెతికే ప్రమాదం

  • అసభ్యకర, సెక్సువల్‌ కంటెంట్‌ను సహించేది లేదు

  • పిల్లలకు హాని కలిగించేదేదీ సోషల్‌ మీడియాలో పెట్టొద్దు

  • స్పష్టం చేసిన సుప్రీం కోర్టు ధర్మాసనం

న్యూఢిల్లీ, అక్టోబరు 17: ఇంటర్నెట్‌ వినియోగం పిల్లలతో సహా అందరి ప్రాథమిక హక్కు అని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఆన్‌లైన్‌ విషయంలో ఆందోళనలు ఉన్నా కూడా పిల్లలకు డిజిటల్‌ యాక్సెస్‌ను పూర్తిగా నిషేధించలేమని తేల్చి చెప్పింది. రాజ్యాంగంలోని 21, 19(1)(ఎ) అధికరణాల ప్రకారం ఆ హక్కుకు రక్షణ ఉందని ‘జస్ట్‌ రైట్స్‌ ఫర్‌ చిల్డ్రన్‌ అలయెన్స్‌’ అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా జస్టిస్‌ జేబీ పార్దీవాలా, జస్టిస్‌ కె.వినోద్‌ చంద్రన్‌తో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. అలాగే, మైనర్లతో చిత్రీకరించే సెక్సువల్‌ దృశ్యాలు, పోస్టులు, కంటెంట్‌ను సోషల్‌ మీడియాలో పోస్టు చేయడానికి వీల్లేదని సుప్రీంకోర్టు ధర్మాసనం తేల్చిచెప్పింది. చిన్నారుల మనసును పాడుచేసే ఇలాంటి కంటెంట్‌ను పూర్తిగా నిషేధించాలని ఆదేశించింది. ఈ విషయంలో సోషల్‌ మీడియా మధ్యవర్తులదే పూర్తి బాధ్యత అని పేర్కొంది. సోషల్‌ మీడియా ఇతర ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌లపై బాలల లైంగిక దోపిడీ, దుర్వినియోగ మెటీరియల్‌ను గుర్తించి, తొలగించే విధానాన్ని బలోపేతం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ‘‘వయసుతో సంబంధం లేకుండా పిల్లలకు కూడా ప్రాథమిక హక్కులు ఉంటాయి. వారి ప్రాథమిక హక్కును నిరాకరించడం అసంబద్ధం అవుతుంది.


పిల్లలు భద్రత, స్వేచ్ఛ రెండింటికీ అర్హులే’’ అని కోర్టు అభిప్రాయపడింది. ప్రస్తుతం ఇంటర్నెట్‌ వినియోగం పిల్లలకు ప్రమాదకారిగా ఉందని అంగీకరిస్తూనే.. వారికి ఇంటర్నెట్‌ను పూర్తిగా నిషేధిస్తే చట్టవిరుద్ధమైన మరో మార్గం వెతుకుతారని, అది మరింత ప్రమాదమని హెచ్చరించింది. అంతేకాకుండా వక్రమార్గంలో ఇంటర్నెట్‌కు యాక్సెస్‌ అయ్యి వారు వేధింపులకు గురైతే.. ఆ విషయాన్ని తమ తల్లిదండ్రులకో, పెద్దలకో చెప్పడానికి వెనకడుగు వేస్తారని పేర్కొంది. అదే సమయంలో పిల్లలకు ఇంటర్నెట్‌ అవసరం ఎందుకో కూడా ధర్మాసనం వివరించింది. వారికి మంచి సమాచారం అందించడమే కాకుండా, నేర్చుకోవడానికి, ఆలోచనలు పంచుకోవడానికి, సృజనాత్మక వ్యక్తీకరణకు ఇంటర్నెట్‌ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపింది. పిల్లల ఇంటర్నెట్‌ వినియోగానికి తల్లిదండ్రుల సమ్మతి, పర్యవేక్షణ ఉండాలని, పిల్లల ఖాతాలకు ‘చైల్డ్‌ మోడ్‌’ వంటి ప్రత్యేక ఏర్పాటు చేయడాన్ని పరిశీలించాలని సూచించింది.


ఇప్పటికీ చర్యలు తీసుకోకపోవడం ఏంటి?

సెక్సువల్‌ కంటెంటును ప్రత్యక్షంగా లేక పరోక్షంగా ఆఫర్‌ చేసినా, హోస్ట్‌ చేసినా, సబ్‌స్ర్కిప్షన్‌ రూపంలో ఆఫర్‌ చేసినా కుదరదని జస్టిస్‌ పార్దీవాలా, జస్టిస్‌ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. 2024లోనే ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ.. సోషల్‌ మీడియా మధ్యవర్తులు, ప్లాట్‌ఫామ్స్‌ ఇప్పటికీ చర్యలు తీసుకోకపోవడంపై ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. ‘‘చిన్నారుల లైంగిక దోపిడీ, అసభ్య కంటెంట్‌ ఏ రూపంలో ఉన్నా సహించేది లేదు. ప్రతి మధ్యవర్తీ దీనికి బాధ్యులవుతారు.’’ అని హెచ్చరించింది.

Updated Date - Oct 18 , 2026 | 05:55 AM