మాజీ ఎంపీ ఆనంద్ మోహన్ ముందస్తు విడుదల రద్దు
ABN , Publish Date - Nov 27 , 2026 | 04:40 AM
బిహార్ మాజీ ఎంపీ ఆనంద్ మోహన్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణకు చెందిన ఐఏఎస్ అధికారి జి.కృష్ణయ్య హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఆయనకు బిహార్ ప్రభుత్వం..
బిహార్ ప్రభుత్వ నిర్ణయం చట్టవిరుద్ధం
ఐఏఎస్ అధికారి కృష్ణయ్య హత్య కేసులో సుప్రీంకోర్టు తీర్పు
న్యూఢిల్లీ, నవంబరు 26: బిహార్ మాజీ ఎంపీ ఆనంద్ మోహన్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణకు చెందిన ఐఏఎస్ అధికారి జి.కృష్ణయ్య హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఆయనకు బిహార్ ప్రభుత్వం కల్పించిన ముందస్తు విడుదలను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఆయనను నెల రోజుల్లోగా సంబంధిత జైలు అధికారుల ఎదుట లొంగిపోవాలని ఆదేశించింది. ఆనంద్ మోహన్ ముందస్తు విడుదలకు మార్గం సుగమం చేస్తూ బిహార్ ప్రభుత్వం జైలు నిబంధనల్లో చేసిన సవరణను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. అది చట్టపరంగా సమర్థించలేనిదని, నిలబడదని స్పష్టం చేసింది. జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ షీల్ నాగు ధర్మాసనం గురువారం ఈ మేరకు తీర్పు వెలువరించింది. 2023 ఏప్రిల్ 24న ఆనంద్ మోహన్‌కు శిక్షా కాలం తగ్గింపు(రిమిషన్) కల్పిస్తూ బిహార్ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేసింది. ఒక వ్యక్తికి ప్రయోజనం కల్పించేలా నిబంధనల్లో మార్పులు చేయడం, అందుకు తగిన ప్రజాప్రయోజనం లేదా సహేతుకమైన కారణాలను చూపకపోవడం సమర్థనీయం కాదని అభిప్రాయపడింది. ఆయన నెల రోజుల్లో లొంగిపోకపోతే, తిరిగి అదుపులోకి తీసుకునేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించింది. కాగా, 1994 డిసెంబరులో గోపాల్‌గంజ్ కలెక్టర్‌గా ఉన్న కృష్ణయ్యపై అల్లరిమూకలు దాడి చేసి హతమార్చాయి. అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్న ఆనంద్ మోహన్.. కృష్ణయ్య హత్యకు కారణమయ్యారని అభియోగాలు నమోదయ్యాయి.