Share News

బుద్ధిమాంద్యానికి మూలకణాల చికిత్స వద్దు

ABN , Publish Date - Jan 31 , 2026 | 03:48 AM

బుద్ధిమాంద్యానికి (ఆటిజానికి) మూలకణాల (స్టెమ్‌సెల్స్‌) చికిత్సను అందించవద్దని, దానివల్ల ఫలితాలు ఉంటాయన్న శాస్త్రీయ ఆధారాలు లేవని సుప్రీంకోర్టు పేర్కొంది.

బుద్ధిమాంద్యానికి మూలకణాల చికిత్స వద్దు

  • చికిత్స అందిస్తామని ప్రకటించే క్లినిక్‌ల లైసెన్సు రద్దు చేయాలి: సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ, జనవరి 30: బుద్ధిమాంద్యానికి (ఆటిజానికి) మూలకణాల (స్టెమ్‌సెల్స్‌) చికిత్సను అందించవద్దని, దానివల్ల ఫలితాలు ఉంటాయన్న శాస్త్రీయ ఆధారాలు లేవని సుప్రీంకోర్టు పేర్కొంది. క్లినికల్‌ ట్రయల్స్‌ జరగని, ఆమోదం లేని చికిత్సను అందించటం అనైతికత మాత్రమే కాదు.. వైద్యపరమైన తప్పుడు విధానమవుతుందని హెచ్చరించింది. బుద్ధిమాంద్యానికి మూలకణాల చికిత్స అందిస్తామంటూ దేశవ్యాప్తంగా అనేక క్లినిక్‌లు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, దీనిని అడ్డుకోవాలంటూ దాఖలైన ఓ పిటిషన్‌ మీద జస్టిస్‌ పార్ధివాలా, జస్టిస్‌ మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. పలు వైద్య రంగాల్లో మూలకణాల పరిశోధన ఫలితాలను ఇస్తున్నప్పటికీ.. బుద్ధిమాంద్యం చికిత్సలో మాత్రం దాని వల్ల ఉపశమనం లభిస్తుందన్న ఆధారాలు లేవని ఇప్పటికే పలు వైద్యపరిశోధన సంస్థలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలోనే, ఆటిజంకు మూలకణాల చికిత్సను అందిస్తామని అటు వైద్యులు చెప్పవద్దని, ఇటు ఆ చికిత్స కావాలని పేషంట్లు, వారి తరఫు వ్యక్తులు డిమాండ్‌ చేయటానికి వీల్లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఒకవేళ పేషంటు నుంచి సమ్మతి తీసుకొని ఆ చికిత్స ఇచ్చినా.. ఆ సమ్మతి చెల్లదని తెలిపింది. ఇప్పటికే స్టెమ్‌సెల్స్‌ చికిత్స తీసుకుంటున్న ఆటిజం పేషంట్లకు ఉన్నపళంగా చికిత్సను నిలిపివేయకుండా, క్రమంగా ఇతర చికిత్సకు మళ్లించాలని సూచించింది. ఈ మేరకు జాతీయ వైద్య మండలి, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించింది. ఆటిజంకు స్టెమ్స్‌సెల్స్‌ థెరపీ ఇస్తామని ప్రకటించుకునే క్లినిక్‌ల లైసెన్సు రద్దు చేయాలని, జరిమానా విధించాలని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది.

Updated Date - Jan 31 , 2026 | 03:48 AM