Share News

బెయిల్‌ మంజూరుపై సుప్రీంకే ఉచిత సలహా!

ABN , Publish Date - Oct 04 , 2026 | 05:52 AM

ఓ కేసును ఎలా పరిష్కరించాలి.. బెయిల్‌ ఎప్పుడు ఇవ్వాలో సుప్రీంకోర్టుకే సలహా ఇచ్చే సాహసం చేశారు ఓ దిగువ కోర్టు న్యాయాధికారి. దీనిపై సుప్రీంకోర్టు కన్నెర్రచేసి..

బెయిల్‌ మంజూరుపై సుప్రీంకే ఉచిత సలహా!

  • చిక్కుల్లో బెంగాల్‌ న్యాయాధికారి..వివరణ కోరిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ, అక్టోబరు 3: ఓ కేసును ఎలా పరిష్కరించాలి.. బెయిల్‌ ఎప్పుడు ఇవ్వాలో సుప్రీంకోర్టుకే సలహా ఇచ్చే సాహసం చేశారు ఓ దిగువ కోర్టు న్యాయాధికారి. దీనిపై సుప్రీంకోర్టు కన్నెర్రచేసి.. వివరణ ఇవ్వాలని ఆయనకు ఆదేశాలు జారీచేసింది. పశ్చిమ బెంగాల్లో ఐదేళ్లుగా జైల్లో మగ్గుతున్న ఓ అండర్‌ ట్రయల్‌ ఖైదీ బెయిల్‌ పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఈ ఏడాది మే 11న కొట్టివేసింది. 3నెలల్లో కేసు విచారణ పూర్తిచేయాలని ఉత్తర 24 పరగణాల జిల్లా 3వ అదనపు జిల్లా-సెషన్స్‌ కోర్టును ఆదేశించింది. అయితే సదరు కోర్టు న్యాయాధికారి ఈ ఆదేశాలను పాటించలేదు. పైగా నిందితుడికి బెయిల్‌ ఎప్పుడు ఇవ్వాలో.. ఎప్పుడు ఇవ్వకూడదో వివరిస్తూ ఆగస్టు 11న సుప్రీం అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌కు లేఖ రాశారు. ఆ లేఖ జస్టిస్‌ పార్దివాలా, జస్టిస్‌ వినోద్‌చంద్రన్‌ల ధర్మాసనం ముందు ఇటీవల విచారణకు వచ్చింది. అందులోని అంశాలను చదివి.. న్యాయమూర్తులు దిగ్ర్భాంతికి లోనయ్యారు. ఆయన ఇలా ఎందుకు రాశారో వివరణ కోరాలని రిజిస్ట్రీని ఆదేశించారు.

Updated Date - Oct 04 , 2026 | 06:39 AM