Share News

నిందితులను న్యాయ వ్యవస్థ కాపాడడం లేదు

ABN , Publish Date - May 26 , 2026 | 04:09 AM

త్విశా శర్మ మరణం కేసులో నిందితులను న్యాయవ్యవస్థ కాపాడుతోందంటూ వస్తున్న కథనాలు బాధ కలిగించాయని సోమవారం సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

నిందితులను న్యాయ వ్యవస్థ కాపాడడం లేదు

  • ఆ వ్యాఖ్యలు బాధించాయి

  • సీబీఐ స్వేచ్ఛగా దర్యాప్తు చేసేలా చూస్తాం

  • త్విశా శర్మ మరణం కేసుపై సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ, మే 25: త్విశా శర్మ మరణం కేసులో నిందితులను న్యాయవ్యవస్థ కాపాడుతోందంటూ వస్తున్న కథనాలు బాధ కలిగించాయని సోమవారం సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాంటిదేమీ లేదని, దీనిపై సీబీఐ స్వేచ్ఛగా, నిజాయితీగా, నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసేలా అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. భోపాల్‌కు చెందిన మోడల్‌-నటి అయిన త్విశా శర్మ(33) ఈ నెల 12న అత్తవారింట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. వరకట్నం వేధింపులే ఇందుకు కారణమని పుట్టింటివారు ఆరోపించగా, మాదక ద్రవ్యాలను తీసుకున్న ప్రభావమని అత్తింటివారు పేర్కొన్నారు. పోలీసులు మాత్రం వరకట్నం వేధింపులకు పాల్పడ్డారంటూ న్యాయవాది అయిన భర్త సమర్థ్‌ సింగ్‌, మాజీ జిల్లా జడ్జి అయిన అత్త గిరిబాల సింగ్‌లపై కేసులు నమోదు చేశారు. నిందితులు న్యాయవ్యవస్థకు చెందిన వారు కావడం వల్లనే రక్షణ పొందుతున్నారంటూ కథనాలు రావడంతో సుప్రీంకోర్టు స్పందించి సుమోటోగా విచారణ చేపట్టింది. ఈ కేసుకు సంబంధించిన వార్తల విషయంలో మీడియా మిత్రులు సంయమనం పాటించాలని సుప్రీంకోర్టు కోరింది.

Updated Date - May 26 , 2026 | 04:09 AM