Share News

బెంగాల్‌ ‘సర్‌’ విధుల్లో న్యాయాధికారులు

ABN , Publish Date - Feb 21 , 2026 | 02:18 AM

పశ్చిమబెంగాల్‌లో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియకు సంబంధించి సుప్రీంకోర్టు అసాధారణ ఆదేశాలు జారీ చేసింది.

బెంగాల్‌ ‘సర్‌’ విధుల్లో న్యాయాధికారులు

  • సుప్రీంకోర్టు అసాధారణ నిర్ణయం

  • రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం మధ్య నిందల పర్వం దురదృష్టకరమని వ్యాఖ్య

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20: పశ్చిమబెంగాల్‌లో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియకు సంబంధించి సుప్రీంకోర్టు అసాధారణ ఆదేశాలు జారీ చేసింది. వివాదాస్పద సర్‌ విధుల్లో ప్రస్తుత, మాజీ జిల్లా న్యాయాధికారులను నియమించాలని కలకత్తా హైకోర్టును ఆదేశించింది. సర్‌పై బెంగాల్‌ సర్కారు, కేంద్ర ఎన్నికల సంఘాల(ఈసీ)ల మధ్య పరస్పర నిందల పర్వం కొనసాగుతోందని.. ఇది దురదృష్టకరమని అభిప్రాయపడింది. ఈసీ, టీఎంసీ ప్రభుత్వాల మధ్య విశ్వాసం లోపించిందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ జాయ్‌మాల్యా బాగ్చి, విపుల్‌ ఎం.పంచోలీ ధర్మాసనం శుక్రవారం వ్యాఖ్యానించింది. బెంగాల్‌లో సర్‌ ప్రక్రియను పూర్తి చేసేందుకు గాను పలు కీలక ఆదేశాలు జారీ చేసింది. సర్‌ ప్రక్రియలో ఎన్నికల అధికారులకు సాయం చేసేందుకు జ్యుడీషియల్‌ అధికారులను డిప్యుటేషన్‌పై నియమించాలని కలకత్తా హైకోర్టును ఆదేశించింది. సర్‌ దరఖాస్తులపై వచ్చే అభ్యంతరాలను ఈ అధికారులు పరిశీలించి, పరిష్కరిస్తారని స్పష్టం చేసింది. బెంగాల్‌లో కొనసాగుతున్న సర్‌ ప్రక్రియ పరిశీలనకు రాష్ట్ర ప్రభుత్వం గ్రేడ్‌ ఏ అధికారులను నియమించకపోవడంపై ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం, ఈసీ తీరును ఆక్షేపిస్తూ.. ‘‘రెండు రాజ్యాంగబద్ధ సంస్థల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణల పర్వం కొనసాగుతుండడం దురదృష్టకర పరిణామం. ఇది వ్యవస్థల మధ్య అపనమ్మకాన్ని సూచిస్తోంది’’ అని ధర్మాసనం పేర్కొంది. సర్‌ ప్రక్రియ సజావుగా సాగేందుకు కొందరు న్యాయాధికారులను కేటాయించాలని, మరికొందరు మాజీ జిల్లా జడ్జిలు, అదనపు జిల్లా జడ్జిలను కూడా నియమించాలని కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సుజయ్‌ పాల్‌ను సీజేఐ ధర్మాసనం ఆదేశించింది. జ్యుడీషియల్‌ అధికారుల నియామకానికి సంబంధించి శనివారం సమావేశం నిర్వహించాలని ఆయనకు సూచించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ఈసీ అధికారి, రాష్ట్ర అడ్వొకేట్‌ జనరల్‌, కేంద్ర అదనపు సొలిసిటర్‌ జనరల్‌, హైకోర్టు రిజిస్ట్రార్లతో సమావేశమై న్యాయాధికారుల నియామకాలను ఖరారు చేయాలని ఆదేశించింది. సర్‌ ప్రక్రియ పారదర్శకంగా, సజావుగా జరిగేలా చూసేందుకుగాను న్యాయాధికారులను నియమించడం తప్ప తమకు మరో మార్గం కనిపించలేదని సీజేఐ ధర్మాసనం వ్యాఖ్యానించింది. 28న తుది ఓటరు జాబితాను విడుదల చేసేందుకు ఈసీకి అనుమతి ఇచ్చింది.


డీజీపీ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది..

బెంగాల్‌ సీఎం మమత తరఫున శ్యామ్‌ దివాన్‌ వాదనలు వినిపిస్తూ.. ఓటరు జాబితా అధికారులు (ఈఆర్‌వో) ఇచ్చిన ఆదేశాలను ప్రస్తుతం ప్రత్యేక ఓటరు జాబితా అధికారులు (ఎస్‌ఆర్‌వో) పరిశీలిస్తున్నారని, వారి ఆదేశాలను ఎస్‌ఆర్‌వోలు ఎలా గంపగుత్తగా తిరస్కరిస్తారని ప్రశ్నించారు. ఈ ఆరోపణను ఈసీ తోసిపుచ్చింది. సర్‌ ప్రక్రియ ప్రారంభం నుంచీ ఎస్‌ఆర్‌వోలు ఉన్నారని తెలిపింది. ఈసీ తరఫు న్యాయవాది డీఎస్‌ నాయుడు వాదనలు వినిపిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం తమకు ఏ మాత్రం సహకరించడం లేదన్నారు. వివిధ పార్టీల నేతలు, సంస్థలు ఎన్నికల సంఘంపై చేసిన ప్రకటనలను ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. వారిపై ఇప్పటి వరకు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయలేదన్నారు. స్పందించిన సీజేఐ.. ఎన్నికల సమయంలో కొందరు బాధ్యతారహిత ప్రకటనలు చేస్తుంటారని, అలాంటి వారిపై చర్యలు తీసుకోకపోతే డీజీపీ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అన్నారు. అలాగే ఈసీ అధికారులకు భద్రత కల్పించాలని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను ధర్మాసనం ఆదేశించింది.

Updated Date - Feb 21 , 2026 | 02:18 AM