విద్యార్థులపై ఎఫ్‌ఐఆర్‌లు ఉపసంహరించుకోవచ్చు
ABN , Publish Date - Aug 04 , 2026 | 06:52 AM
నీట్ పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా నిర్వహించిన నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్న విద్యార్థులపై పోలీసులు నమోదుచేసిన ఎఫ్‌ఐఆర్‌లను రద్దుచేసే లేదా ఉపసంహరించుకొనే స్వేచ్ఛ రాష్ట్రాలకు...
నిర్ణయం తీసుకొనే స్వేచ్ఛ ప్రభుత్వాలకు ఉంది
తీవ్రమైన నేరచరిత్ర ఉన్నవారిపై ఉపసంహరణ కుదరదు.. సుప్రీం స్పష్టీకరణ
న్యూఢిల్లీ, ఆగస్టు 3(ఆంధ్రజ్యోతి): నీట్ పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా నిర్వహించిన నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్న విద్యార్థులపై పోలీసులు నమోదుచేసిన ఎఫ్‌ఐఆర్‌లను రద్దుచేసే లేదా ఉపసంహరించుకొనే స్వేచ్ఛ రాష్ట్రాలకు ఉందని సుప్రీంకోర్టు ప్రకటించింది. అయితే, తీవ్రమైన నేర చరిత్ర ఉన్నవారిపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను ఉపసంహరించకోవటం కుదరదని స్పష్టం చేసింది. గత నెల 20న ఢిల్లీలో నిర్వహించిన చలో సంసద్ కార్యక్రమం సందర్భంగా పోలీసుల బలప్రయోగాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లను సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తులు జస్టిస్ జోయ్‌మాల్యా బాగ్చీ, జస్టిస్ వీ మోహనలతో కూడిన ధర్మాసనం సోమవారం మరోసారి విచారించింది. విద్యార్థులపై దాఖలైన ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా రాష్ట్రాలు దర్యాప్తు చేయవచ్చని జూలై 28న ఇచ్చిన ఆదేశాలపై వివరణ ఇచ్చింది. తాము ఉపయోగించిన ‘నేర చరితులు’ అన్న పదం విద్యార్థులందరికీ వర్తించదని.. తీవ్రమైన నేరాలకు పాల్పడ్డ వారికి మాత్రమే వర్తిస్తుదని పేర్కొంది. ఈ సందర్భంగా సీజేఐ కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యార్థులపై తీవ్రమైన దమనకాండకు పాల్పడిన పోలీసులను రక్షించరాదని, అదే సమయంలో విద్యార్థుల ముసుగులో హింసకు పాల్పడినవారిని కూడా వదిలిపెట్టరాదని అన్నారు. ఈ సందర్భంగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందిస్తూ.. అమాయకులైన విద్యార్థులపై ఎఫ్‌ఐఆర్‌లను ఉపసంహరించుకుంటామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించినట్లు తెలిపారు. అయితే, ఈ నిర్ణయంపై తప్పుడు ప్రచారం జరుగుతోందని అన్నారు. నేరచరిత్ర ఉన్న 2,700 మందిపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను ఉపసంహరించుకోవటం లేదని చెప్పారు. ధర్మాసనం విచారణను 18వ తేదీకి వాయిదా వేసింది.