Share News

ఐటీ సవరణ రూల్స్‌ కొట్టివేతపై కేంద్రం అప్పీల్‌ పరిశీలనకు సుప్రీం ఓకే!

ABN , Publish Date - Mar 11 , 2026 | 04:08 AM

ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ నిబంధనలకు సవరణ-2023పై బాంబే హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు మంగళవారం అంగీకరించింది.

ఐటీ సవరణ రూల్స్‌ కొట్టివేతపై కేంద్రం అప్పీల్‌ పరిశీలనకు సుప్రీం ఓకే!

న్యూఢిల్లీ, మార్చి 10: ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ నిబంధనలకు సవరణ-2023పై బాంబే హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు మంగళవారం అంగీకరించింది. అయితే 2024 నాటి హైకోర్టు తీర్పుపై స్టే విధించేందుకు మాత్రం తిరస్కరించింది. ఈ విషయంలో సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ మహదేవన్‌, జస్టిస్‌ జోయ్‌మాల్యా బాగ్చిలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం అసలు పిటిషన్‌దారులైన స్టాండప్‌ కమెడియన్‌ కునాల్‌ కమ్రా, ఎడిటర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండియా, అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ మ్యాగజైన్స్‌కు నోటీసులు జారీచేసింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్‌ మీడియాలో ఉండే నకిలీ, తప్పుడు కంటెంట్‌ను నియంత్రించే ఉద్దేశంతో కేంద్రం ఐటీ నిబంధనలకు సవరణలు చేసింది. వీటిని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ చేసిన బాంబే హైకోర్టు.. సవరణ ఐటీ రూల్స్‌ను కొట్టివేయడమే కాకుండా, అవి రాజ్యాంగ విరుద్ధమైనవని 2024 సెప్టెంబరు 26న తీర్పు వెలువరించింది. సుప్రీంకోర్టులో కేంద్రం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు వినిపిస్తూ.. హైకోర్టు ఉత్తర్వుపై స్టే విధించాలని కోరారు. కంటెంట్‌ను పూర్తిగా బ్లాక్‌ చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని, తప్పుడు సమాచారాన్ని మాత్రమే నియంత్రిస్తుందని కోర్టుకు తెలిపారు.

Updated Date - Mar 11 , 2026 | 04:08 AM