Share News

సోమ, శుక్రవారాల్లో వీసీ ద్వారా కేసుల విచారణ

ABN , Publish Date - May 16 , 2026 | 03:49 AM

దేశ సర్వోన్నత న్యాయస్థానం కూడా పొదుపు చర్యలు ప్రారంభించింది. ఇకపై సోమ, శుక్రవారాల్లో కేసులను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారించాలని నిర్ణయించింది.

సోమ, శుక్రవారాల్లో వీసీ ద్వారా కేసుల విచారణ

  • పొదుపు చర్యల్లో భాగంగా సుప్రీంకోర్టు నిర్ణయం

న్యూఢిల్లీ, మే 15: దేశ సర్వోన్నత న్యాయస్థానం కూడా పొదుపు చర్యలు ప్రారంభించింది. ఇకపై సోమ, శుక్రవారాల్లో కేసులను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారించాలని నిర్ణయించింది. అలాగే ఇంధన వినియోగాన్ని తగ్గించడంలో భాగంగా న్యాయమూర్తులు ‘కార్‌-పూలింగ్‌’ (నలుగురైదుగురు కలిసి ఒకే కారులో రావడం) చేయాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో అనవసర ఖర్చులు తగ్గించుకోవాలని, ఇంధనాన్ని కూడా పొదుపుగా వాడుకోవాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సుప్రీంకోర్టు కూడా పొదుపు చర్యలకు ఉపక్రమించింది.


ఒకే రోజు, ఒకే రూట్‌.. విమాన చార్జీల్లో ఇంత తేడానా?: సుప్రీం కోర్టు

పండుగలు, సెలవు రోజుల్లో విమానయాన సంస్థలు ఇష్టానుసారంగా టికెట్‌ ధరలను పెంచడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఒకే రోజు, ఒకే మార్గంలో నడిచే విమానాలకు వేర్వేరు సంస్థలు వసూలు చేస్తోన్న చార్జీల్లో భారీ వ్యత్యాసం ఉండడాన్ని తప్పుబట్టింది. విమాన చార్జీల అకారణ పెంపు, డిమాండ్‌కు అనుగుణంగా ధరలు పెంచే (సర్జ్‌ ప్రైసింగ్‌) విధానాన్ని నియంత్రించేలా మార్గదర్శకాలు ఇవ్వాలని కోరుతూ ఎస్‌. లక్ష్మీనారాయణన్‌ అనే సామాజిక కార్యకర్త సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌, జస్టిస్‌ సందీప్‌ మెహతాల ద్విసభ్య ధర్మాసనం శుక్రవారం ఆ పిటిషన్‌ను విచారించింది. పండుగలు, సెలవు రోజుల్లో విమానయాన సంస్థలు చార్జీలను 300ు మేర పెంచుతున్నాయని పిటిషనర్‌ తరఫు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. కేంద్రం, డీజీసీఏ తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు వినిపిస్తూ.. ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్య వాస్తవమేనని అంగీకరించారు. అయితే, కొత్తగా ‘భారతీయ వాయుయాన్‌ అధినియం-2024’ చట్టం అమల్లోకి వచ్చిందని, నిబంధనల రూపకల్పన జరుగుతోందని తెలిపారు. విమాన చార్జీల్లోని భారీ వ్యత్యాసాలను సరిదిద్ది ప్రయాణికులకు కాస్త ఉపశమనం కలిగించాలని కేంద్రానికి ధర్మాసనం సూచించింది.

Updated Date - May 16 , 2026 | 03:49 AM