ఎల్నినో మంట
ABN , Publish Date - Oct 23 , 2026 | 03:18 AM
ప్రస్తుతం కొనసాగుతున్న ఎల్నినో ప్రభావం గతంలో ఎన్నడూ చూడని తీవ్రస్థాయికి చేరుకోవచ్చని ప్రపంచ వాతావరణ సంస్థ(డబ్ల్యూఎంవో) అంచనా వేసింది.
గతంలో ఎన్నడూ చూడనంత ప్రభావం
నవంబరు-జనవరి మధ్య అసాధారణ స్థాయికి ఉష్ణోగ్రతలు
సాధారణ సగటు కంటే 3.8 డిగ్రీల వరకూ పెరిగే అవకాశం
డిసెంబరులో గరిష్ఠ స్థాయికి..: డబ్ల్యూఎంవో హెచ్చరిక
న్యూఢిల్లీ, అక్టోబరు 22: ప్రస్తుతం కొనసాగుతున్న ఎల్నినో ప్రభావం గతంలో ఎన్నడూ చూడని తీవ్రస్థాయికి చేరుకోవచ్చని ప్రపంచ వాతావరణ సంస్థ(డబ్ల్యూఎంవో) అంచనా వేసింది. ఈ ఏడాది నవంబరు నుంచి 2027 జనవరి మధ్యకాలంలో ఉష్ణమండల పసిఫిక్ ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణ సగటు కంటే 3.8 డిగ్రీల వరకూ పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. డిసెంబరులో ఇది గరిష్ఠ స్థాయికి చేరుకోనుందని తెలిపింది. ఈ ఉష్ణోగ్రతల్లో 0.5 డిగ్రీలు లేదా అంతకంటే ఎక్కువ పెరుగుదల ఉంటే డబ్ల్యూఎంవో ఎల్నినోగా ప్రకటిస్తుంది. ఈసారి ఏకంగా 3.8 డిగ్రీలు పెరుగుతుందని అంచనా వేయడం వాతావరణ నిపుణులను కలవరపెడుతోంది. దీని ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో అనూహ్య మార్పులు చోటుచేసుకోనున్నాయి. భారత్తో సహా దక్షిణ, ఆగ్నేయాసియాలోని పలు దేశాల్లో శీతాకాలంలో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. వర్షపాతం గణనీయంగాతగ్గుతుంది. ఇది వ్యవసాయ రంగంతో పాటు తాగునీటి వనురులపైనా తీవ్ర ప్రభావం చూపనుంది. తూర్పు ఆఫ్రికా, అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలు సంభవిస్తే, దక్షిణాఫ్రికాలో పొడి వాతావరణం నెలకొంటుంది. ఉత్తర అమెరికా, కరేబియన్ ప్రాంతంలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదు కావచ్చు. మధ్య అమెరికా, దక్షిణ కరేబియన్, అమెజాన్ ప్రాంతాల్లో కరువు ముప్పు పెరుగుతుంది. చాలా బలమైన ఎల్నినో సాధారణ ఉష్ణోగ్రతలను, వర్షపాత సరళిని దెబ్బతీస్తుంది.
దీనివల్ల కొన్ని ప్రాంతాల్లో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొంటే, మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు సంభవిస్తాయని డబ్ల్యూఎంవో పేర్కొంది. ప్రస్తుత పరిస్థితి గత నాలుగు దశాబ్దాలుగా ఉపయోగిస్తున్న వాతావరణ చార్ట్ల అంచనాలకు మించి ఉందని డబ్ల్యూఎంవో సెక్రటరీ జనరల్ సెలెస్టే సౌలో అందోళన వ్యక్తం చేశారు. 2026 చివరి నాటికి ఎల్నినో గరిష్ఠ స్థాయికి చేరుకుంటుందని, దాని ప్రభావాలు ఆ తర్వాత చాలాకాలం పాటు కొనసాగుతాయని అన్నారు. వాతావరణ ముప్పులను ఎదుర్కోవడానికి ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను బలోపేతం చేసుకోవాలని, తగిన నివారణ చర్యలు చేపట్టాలని ప్రపంచ దేశాలకు సెలెస్టే పిలుపునిచ్చారు.