Share News

డిప్యూటీ సీఎంగా సునేత్ర ప్రమాణం

ABN , Publish Date - Feb 01 , 2026 | 04:18 AM

మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా అజిత్‌ పవార్‌ సతీమణి సునేత్ర(62) శనివారం ప్రమాణ స్వీకారం చేశారు.

డిప్యూటీ సీఎంగా సునేత్ర ప్రమాణం

ముంబై, జనవరి 31: మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా అజిత్‌ పవార్‌ సతీమణి సునేత్ర(62) శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. తద్వారా మహారాష్ట్రలో ఈ పదవిని చేపట్టిన మొట్టమొదటి మహిళగా రికార్డు సృష్టించారు. మహారాష్ట్ర గవర్నర్‌ ఆచార్య దేవవ్రత లోక్‌భవన్‌లో ఆమెతో ప్రమాణం చేయించారు. మహారాష్ట్ర సీఎం ఫడణవీస్‌, డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్‌ శిందే, ఎన్సీపీ సీనియర్‌ నాయకులు ప్రఫుల్‌ పటేల్‌, సునీల్‌ తట్కరే, ఛగన్‌ భుజ్‌బల్‌ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సునేత్ర చిన్న కుమారుడు జై పవార్‌, ఆయన భార్య కూడా పాల్గొన్నారు. సునేత్రకు ఎక్సైజ్‌, క్రీడలు, మైనారిటీ వ్యవహారాల శాఖలను కేటాయించారు. అజిత్‌ పవార్‌ నిర్వహించిన ఆర్థిక, ప్రణాళిక శాఖలను సీఎం ఫడణవీస్‌ ప్రస్తుతం తన వద్దే ఉంచుకున్నారు. అంతకుముందు ఆమె తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. మరోవైపు, ఎన్సీపీ సునేత్రను తమ శాసనసభా పక్ష నాయకురాలిగా ఎన్నుకున్నది. ప్రస్తుతం సునేత్రకు మహారాష్ట్రలోని ఉభయసభల్లోనూ సభ్యత్వం లేదు. ఆమె ఆరు నెలల్లో ఏదో ఒక సభకు ఎన్నిక కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అజిత్‌ ప్రాతినిధ్యం వహించిన బారామతి అసెంబ్లీ స్థానంలో ఆమె పోటీ చేయనున్నారు.

Updated Date - Feb 01 , 2026 | 04:19 AM