వైజాగ్ గ్లోబల్ ఏఐ హబ్ అవుతుందని ఊహించలేదు
ABN , Publish Date - Feb 20 , 2026 | 02:31 AM
ఐఐటీ ఖరగ్‌పూర్‌లో చదివే రోజుల నుంచీ తనకు వైజాగ్ పరిచయం ఉందని, ఈ నగరం గ్లోబల్ ఏఐ హబ్‌గా మారుతుందని తానప్పుడు ఊహించలేదని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ అన్నారు.
ఏఐ మన జీవితకాలంలో పెద్దమార్పు
ఏ సాంకేతికత కూడా ఏఐ స్థాయిలో పెద్ద కలలను కనేందుకు నన్ను ప్రోత్సహించలేదు: సుందర్ పిచాయ్
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి): ఐఐటీ ఖరగ్‌పూర్‌లో చదివే రోజుల నుంచీ తనకు వైజాగ్ పరిచయం ఉందని, ఈ నగరం గ్లోబల్ ఏఐ హబ్‌గా మారుతుందని తానప్పుడు ఊహించలేదని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ అన్నారు. వైజాగ్‌లో గూగుల్ ఒక పుల్ స్టాక్ ఏఐ హబ్‌ను ఏర్పాటు చేస్తోందని తెలిపారు. ఈ హబ్ దేశ ప్రజలకు, వ్యాపారాలకు అత్యాధునిక ఏఐ ప్రయోజనాలను అందించడంతో పాటు ఉద్యోగాలను తీసుకొస్తుందని అన్నారు. గురువారం ఆయన ఏఐ సమిట్‌లో మాట్లాడారు. ‘‘నేను ఐఐటీ ఖరగ్‌పూర్‌లో చదువుతున్న రోజుల్లో తరచుగా చెన్నై నుంచి ఖరగ్‌పూర్ వరకు కోరమాండల్ ఎక్స్‌ప్రె్‌సలో ప్రయాణించే వాడిని. వైౖజాగ్ మీదుగా వెళ్లేవాళ్లం. అది ఎంతో నిశ్శబ్దంగా, అపారమైన సామర్థ్యం ఉన్న ఒక తీర ప్రాంత నగరంగా నాకు గుర్తు. ఇప్పుడు, అదే నగరంలో గూగుల్ ఇప్పుడు ఒక పూర్తి స్థాయి ఏఐ హబ్‌ను ఏర్పాటు చేస్తోంది. ఇది భారత్‌లో మేము చేపట్టిన 15 బిలియన్ డాలర్ల మౌలిక సదుపాయాల పెట్టుబడిలో ఒక భాగం. ఇది పూర్తయ్యాక, ఈ హబ్‌లో ఒక గిగావాట్ స్థాయి కంప్యూటింగ్, ఒక కొత్త అంతర్జాతీయ సబ్‌సీ కేబుల్ గేట్‌వే ఉంటాయి. ఇది దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలకు, వ్యాపారాలకు అత్యాధునిక ఏఐ ప్రయోజనాలను అందిస్తుంది. ఉద్యోగాలను తీసుకువస్తుంది. ఆ రైలులో కూర్చున్నప్పుడు వైజాగ్ ఒక గ్లోబల్ ఏఐ హబ్‌గా మారుతుందని నేను ఊహించలేదు. నేను డేటా సెంటర్లను అంతరిక్షంలో ఉంచడం ఎలాగో ఆలోచించే బృందాలతో సమయాన్ని గడుపుతానని కూడా ఊహించలేదు’’ అన్నారు. ఏ సాంకేతికత కూడా ఏఐ కంటే పెద్ద కలలు కనేలా తనను ప్రేరేపించలేదని చెప్పారు. మానవాళి పెద్ద కలలు కన్నప్పుడు ఏం చేయగలదన్నది ఏఐ పురోగతి నిరూపిస్తోందని పేర్కొరు. ఏఐ మన జీవితకాలంలోనే అతి పెద్ద మార్పని తెలిపారు. ఏఐ కోట్లాది ప్రజల జీవితాలను మెరుగుపరుస్తుందని, సైన్స్‌లోని అత్యంత కఠినమైన సమస్యలను పరిష్కరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎంత బాధ్యతాయుతంగా ఉన్నప్పటికీ అందరం కలిసి పని చేస్తేనే ఏఐ పూర్తి ప్రయోజనాలను పొందగలమని.. దీనిలో ప్రభుత్వాలకు కీలకపాత్ర ఉందని చెప్పారు. ప్రజల జీవితాలను మెరుగుపరిచే ప్రభుత్వ సేవల్లో ఏఐని ప్రవేశపెట్టాలని సూచించారు. అమెరికా-భారత్ కనెక్ట్ ఇనిషియేటివ్‌లో భాగంగా అమెరికా, భారత్ మధ్య నాలుగు కొత్త సబ్‌సీ ఫైబర్ ఆప్టిక్ కేబుల్ వ్యవస్థలను నిర్మిస్తున్నామని పిచాయ్ తెలిపారు.

ఏఐ సదస్సులో ప్రసంగానికి బిట్‌గేట్స్ దూరం
ఏఐ సమిట్‌లో గురువారం మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ ప్రసంగించాల్సి ఉండగా చివరిక్షణంలో అది రద్దు అయ్యింది. సమిట్ ప్రాధాన్యతలు పక్కదారి పట్టకూడదన్న ఉద్దేశంతోనే ఆయన సదస్సుకు దూరంగా ఉన్నట్లు గేట్స్ ఫౌండేషన్ ప్రకటించింది. నిజానికి కొద్ది రోజులుగా ఆయన సదస్సుకు దూరంగా ఉంటున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, గేట్స్ ఫౌండేషన్ ఆ కథనాలను తోసిపుచ్చింది. చివరికి ఆయన తప్పుకుంటున్నట్లు గేట్స్ ఫౌండేషనే ధ్రువీకరించింది. అమెరికా న్యాయశాఖ విడుదల చేసిన ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో అనేక మంది ప్రపంచ ధనికులతో పాటు బిల్‌గేట్స్ ప్రస్తావన కూడా ఉండటంతో ఆయన సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు.

బడా సీఈవోలను మించిన ఇంటెలిజెన్స్ చూస్తాం: శామ్ ఆల్ట్‌మన్
ప్రపంచం మానవ మేధస్సును అధిగమించే పూర్తిస్థాయి సూపర్ ఇంటెలిజెన్స్‌ను రూపొందించడానికి కొద్ది ఏళ్ల దూరంలోనే ఉందని ఓపెన్ ఏఐ సహ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ శామ్ ఆల్ట్‌మన్ చెప్పారు. అది ఒక పెద్ద కంపెనీ సీఈవో కన్నా సమర్థంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోగలదని, భూమ్మీద ఉన్న అత్యున్నత శాస్త్రవేత్తల కన్నా గొప్పగా పరిశోధనలు చేయగలదని అన్నారు. భూమ్మీద ఉన్న మేధోశక్తి కన్నా ఎక్కువ మేధో శక్తి డేటా సెంటర్లలో ఉండే రోజు వస్తుందని అంచనా వేశారు. ఈ నేపథ్యంలో ఏఐని ప్రజాస్వామ్యీకరించాల్సిన అవసరం ఉందని, అప్పుడే మానవాళి వికాసం సాధ్యమవుతుందని చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానం మొత్తం ఒక కంపెనీ చేతిలోనో, ఒక దేశం చేతిలోనో కేంద్రీకృతం కావడం అత్యంత ప్రమాదకరమని అన్నారు. అందరూ కలిసి పూనుకోకపోతే ఏఐ వ్యవస్థ దానికదే సొంతంగా మానవాళికి గొప్ప భవిష్యత్తును అందించలేదని చెప్పారు. ఏఐ భవిష్యత్తును పరిరక్షించడం ప్రజలకు ఎక్కువ భాగస్వామ్యం కల్పించడం ద్వారా మాత్రమే సాధ్యమని అన్నారు. ఉద్యోగాలు పోతాయన్న భయాలు స్వల్పకాలికమేనని, కాలక్రమంలో పరిస్థితులు మెరుగు పడతాయని చెప్పారు.

పది లక్షల కోట్లతో ఏఐ డేటా సెంటర్లు: ముఖేశ్ అంబానీ
భారతదేశ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌కి జియో గుండెకాయ కాబోతోందని రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ అన్నారు. గురువారం ఆయన ఏఐ సమిట్‌లో మాట్లాడారు. పది లక్షల కోట్ల రూపాయలతో పూర్తిగా భారత ప్రభుత్వ నియంత్రణలో పనిచేసే కంప్యూటింగ్ మౌలిక సదుపాయ వ్యవస్థను నిర్మిస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటిదాకా డేటా కనెక్టివిటీకే పరిమితం అయిన జియో ఇక ఏఐ ఆధార సేవలు కూడా అందించనుందని చెప్పారు. ఇండియా ఎల్లకాలం ఏఐని అద్దెకు తీసుకుంటూ బతకలేదని వ్యాఖ్యానించారు. డేటా విషయంలో భారతీయులకు స్వేచ్ఛ కల్పించినట్లే ఏఐ సొల్యూషన్స్ విషయంలోనూ కల్పిస్తామని చెప్పారు. జామ్‌నగర్‌లో నిర్మిస్తున్న 120 మెగావాట్ల ఏఐ డేటా సెంటర్ ఈ ఏడాదే అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు. తమ దగ్గర ఇప్పటికే 10 గిగావాట్ల సౌర విద్యుత్ అందుబాటులో ఉందని తెలిపారు.