Share News

వేసవిలో బీర్ల కొరత!

ABN , Publish Date - Mar 27 , 2026 | 04:47 AM

అమెరికా- ఇరాన్‌ యుద్ధం ప్రభావం మనదేశంలోని చాలా రంగాలపై తీవ్రంగా కనిపిస్తోంది. ఇప్పటికే వంటగ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌ కొరత అంటూ ప్రజలు నానా తిప్పలూ పడుతుండగా..

వేసవిలో బీర్ల కొరత!

  • గ్యాస్‌ కొరతతో బీరు సీసాల ఉత్పత్తికి అంతరాయం

  • అల్యూమినియం దిగుమతుల్లో సమస్యతో క్యాన్ల ఉత్పత్తికీ సెగ

న్యూఢిల్లీ, మార్చి26: అమెరికా- ఇరాన్‌ యుద్ధం ప్రభావం మనదేశంలోని చాలా రంగాలపై తీవ్రంగా కనిపిస్తోంది. ఇప్పటికే వంటగ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌ కొరత అంటూ ప్రజలు నానా తిప్పలూ పడుతుండగా.. త్వరలో బీర్లకు కూడా తీవ్రమైన కొరత ఏర్పడే ప్రమాదం కనిపిస్తోంది. మనదేశంలో వేసవి కాలంలో బీర్లకు అత్యధిక డిమాండ్‌ ఉంటుంది. సరిగ్గా ఇదే సమయంలో వాటికి కొరత రాబోతోందని మద్యం తయారీ కంపెనీలు అంటున్నాయి. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా అక్కడి నుంచి మనదేశానికి సహజవాయువు సరఫరా చాలావరకు తగ్గిపోయింది. బీరు సీసాలు తయారు చేసే కంపెనీలు చాలావరకు గ్యాస్‌తోనే నడుస్తున్నాయి. ఇప్పుడు ఆ కంపెనీలకు గ్యాస్‌ కొరత ఏర్పడటంతో ఉత్పత్తిని తగ్గించటమో, తాత్కాలికంగా నిలిపేయటమో చేస్తున్నాయి. గ్యాస్‌ కొరత కారణంగా 40 శాతం ఉత్పత్తిని తగ్గించినట్లు ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌కు చెందిన ఫైన్‌ ఆర్ట్‌ గ్లాస్‌ వర్క్స్‌ కంపెనీ సీఈవో నితిన్‌ అగర్వాల్‌ తెలిపారు. ఈ సంస్థ పలు మద్యం కంపెనీలకు బీరు సీసాలు సరఫరా చేస్తోంది. శీతల పానీయాలు (జ్యూసులు), కెచ్‌పల ప్యాకేజింగ్‌ సీసాల ఉత్పత్తిని కూడా తగ్గించినట్లు తెలిపారు. ఉత్పత్తివ్యయం పెరగటంతో సీసాల ధరలను కూడా 17-18 శాతం పెంచినట్లు వెల్లడించారు. బీరును అల్యూమినియం క్యాన్లలో కూడా విక్రయిస్తుంటారు. ఇప్పుడు అల్యూమినియం దిగుమతుల్లోనూ ఇబ్బందులు తలెత్తటంతో వాటి ఉత్పత్తి కూడా ప్రభావితం అవుతోందని అంటున్నారు.


ధరలు పెంచకుంటే ఉత్పత్తి చేయలేం..

మనదేశంలో బీర్ల ఉత్పత్తి సంస్థలు చాలా ఉన్నప్పటికీ.. ఈ మార్కెట్‌ ప్రధానంగా మూడు అంతర్జాతీయ కంపెనీల చేతుల్లోనే ఉంది. హైనకెన్‌ సంస్థకు మొత్తం మార్కెట్‌లో దాదాపు 50ు వాటా ఉంది. ఏబీ ఇన్‌బెవ్‌, కార్ల్స్‌బెర్గ్‌ సంస్థలకు చెరో 19శాతం వాటా ఉంది. ఇప్పుడు ఈ మూడు సంస్థలు కూడా బీర్ల ధరలు పెంచకుంటే ఉత్పత్తి సాధ్యం కాదని చెబుతున్నాయని రాయిటర్స్‌ సంస్థ పేర్కొంది. బీరు సీసాలతోపాటు ప్యాకేజింగ్‌ వస్తువులు, లేబుల్స్‌ ధరలు కూడా పెరిగాయని మద్యం కంపెనీలు చెబుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో బీర్ల ధరలను 12-15 శాతం పెంచకుంటే ఉత్పత్తి కష్టమని బ్రెవర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా డైరెక్టర్‌ జనరల్‌ వినోద్‌ తెలిపారు. గ్రాండ్‌ వ్యూ రిసెర్చ్‌ ప్రకారం మనదేశంలో 2024లో బీర్ల మార్కెట్‌ విలువ రూ.65వేల కోట్లు.

ఇప్పటికే ప్యాకేజ్డ్‌ నీళ్ల మార్కెట్‌పై ప్రభావం

యుద్ధ ప్రభావం ప్యాకేజ్డ్‌ నీటి మార్కెట్‌పై పడింది. నీళ్ల బాటిల్స్‌ ధరలను కంపెనీలు 11 శాతం పెంచినట్లు సమాచారం. ప్లాస్టిక్‌ బాటిల్స్‌, వాటి మూతల ధరలు పెరగటమే ఇందుకు కారణమని చెబుతున్నారు. ప్లాస్టిక్‌ బాటిల్స్‌, ఇతర ప్లాస్టిక్‌ వస్తువులకు కొరత తీవ్రంగా ఉందని దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ శీతల పానీయాల ఉత్పత్తి సంస్థ లాట్టీ చిల్‌సంగ్‌ బేవరేజ్‌ ప్రతినిధులు తెలిపారు.

Updated Date - Mar 27 , 2026 | 04:47 AM