అస్సాంలో కూలిన సుఖోయ్.. ఇద్దరు ఐఏఎఫ్ పైలట్లు మృతి
ABN , Publish Date - Mar 07 , 2026 | 04:24 AM
అస్సాంలో భారత వైమానిక దళానికి చెందిన సుఖోయ్-30 ఎంకేఐ యుద్ధ విమానం కూలిన ఘటనలో ఇద్దరు పైలట్లు ప్రాణాలు కోల్పోయారు.
న్యూఢిల్లీ, మార్చి 6: అస్సాంలో భారత వైమానిక దళానికి చెందిన సుఖోయ్-30 ఎంకేఐ యుద్ధ విమానం కూలిన ఘటనలో ఇద్దరు పైలట్లు ప్రాణాలు కోల్పోయారు. కార్బీ ఆంగ్లోంగ్ జిల్లా జోర్హాట్ నుంచి బయలుదేరిన కాసేపటికే గురువారం రాత్రి 7:42గంటలకు విమానానికి రాడార్‌తో సంబంధాలు తెగిపోయి చోకిహోలా అటవీ ప్రాంతంలో కూలిపోయినట్లు గుర్తించారు. ప్రాణాలు కోల్పోయిన వారిలో స్క్వాడ్రన్ లీడర్ అనుజ్ వశిష్ట్, ఫ్లైట్ లెఫ్టెనెంట్ పూర్వేశ్ దురాగ్‌కర్ ఉన్నారు. కాగా, హర్యానా గురుగ్రామ్‌కు చెందిన అనుజ్ వశిష్టకు ఓ పక్క పెళ్లి ఏర్పాట్లు జరుగుతుండగా ఈ విషాదకర వార్త వినాల్సి వచ్చిందని కుటుంబ సభ్యులు కన్నీళ్లు పెట్టుకున్నారు. పెళ్లి కుమార్తె కూడా పైలట్ కాగా అనుజ్ తండ్రి రిటైర్డ్ సుబేదార్. మరోవైపు ప్రమాదంలో మరణించిన మరో పైలట్ పూర్వేశ్‌ది మహారాష్ట్ర నాగ్‌పూర్. గత ఏడాది నిర్వహించిన ఆపరేషన్ సిందూర్‌లో ఆయన పాల్గొన్నారు.