Sudha Murty Urges: దేశ విభజన తప్పు.. మళ్లీ జరగొద్దు: సుధామూర్తి
ABN , Publish Date - Jan 18 , 2026 | 03:30 AM
దేశ చరిత్ర, ముఖ్యంగా దేశ విభజన గురించి నేటి తరం పిల్లలు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని రాజ్యసభ ఎంపీ, ప్రముఖ రచయిత్రి సుధామూర్తి అన్నారు...
జైపూర్, జనవరి 17: దేశ చరిత్ర, ముఖ్యంగా దేశ విభజన గురించి నేటి తరం పిల్లలు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని రాజ్యసభ ఎంపీ, ప్రముఖ రచయిత్రి సుధామూర్తి అన్నారు. దేశ విభజన జరగడం తప్పని, భవిష్యత్తులో అలాంటివి జరగకుండా చూసుకోవాలని అభిప్రాయపడ్డారు. దేశ విభజనపై అవగాహన చేసుకోవడంలో యువతకు సహకరించేందుకు ఆయా సున్నిత అంశాలపై తాను తాజా పుస్తకం ‘ది మ్యాజిక్ ఆఫ్ ది లాస్ట్ ఎర్నింగ్స్’లో వివరించానని పేర్కొన్నారు. రాజస్థాన్‌లో జరుగుతున్న జైపూర్ సాహిత్య వేడుకల (జేఎల్‌ఎఫ్) 19వ ఎడిషన్ కార్యక్రమంలో సుధామూర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భారత సంప్రదాయాలు, దేశ భాషల గురించి తెలియని ఓ వ్యక్తి ఒక పెన్సిల్ తీసుకొని గీత గీసి.. ‘ఇప్పటి నుంచి ఈ భూమి ఇకపై మీకు చెందదు. అది విదేశీ భూభాగం అవుతుంది’ అని చెప్పారని, అది ఎంత హృదయ విదారకరమని సుధామూర్తి అన్నారు. తన అల్లుడు, బ్రిటీష్ మాజీ ప్రధాని రిషి సునాక్ కుటుంబం గురించి చెబుతూ.. నేడు పాకిస్థాన్‌లో ఉండే ప్రాంతానికి చెందిన సునాక్ తాత దేశ విభజన సమయంలో అక్కడి నుంచి ఇల్లు, వ్యాపారాలు అన్నీ వదులుకొని, బలవంతంగా వెళ్లిపోవాల్సి వచ్చిందన్నారు.