Share News

కళ్లు గప్పి.. ఖర్చు పెంచి!

ABN , Publish Date - Jun 22 , 2026 | 04:04 AM

ఆన్‌లైన్‌లో ఏదో వస్తువు కొందామని వెతుకుతున్నారు.. ఒక ఈ-కామర్స్‌ వెబ్‌సైట్లో ధర తక్కువగా ఉన్నట్టు కనిపించింది.. సరేనని కార్ట్‌కు యాడ్‌ చేశారు.. బిల్లు చెల్లించేందుకు సిద్ధమయ్యారు..

కళ్లు గప్పి.. ఖర్చు పెంచి!

  • ఆన్‌లైన్‌ కొనుగోళ్లలో నిగూఢ చార్జీలు

  • వినియోగదారులకు భారీగా నష్టం

  • డార్క్‌ ప్యాటర్న్స్‌తో నష్టపోతున్న 88 శాతం మంది

  • ఏటా కోల్పోతున్న మొత్తం రూ.28 వేల కోట్లపైనే!

  • సగటున ప్రతినెలా ఒక్కొక్కరికి నష్టం రూ.78-87 వరకు..

  • డ్రిప్‌ ప్రైసింగ్‌, బైట్‌ అండ్‌ స్విచ్‌, ఫాల్స్‌ అర్జెన్సీ ఆప్షన్లతో గాలం

  • ‘డాటమ్‌ ఇంటెలిజెన్స్‌’ అధ్యయనంలో వెల్లడి

  • కేంద్ర వినియోగదారుల హక్కుల రక్షణ సంస్థ హెచ్చరికలు బేఖాతరు

ఆన్‌లైన్‌లో ఏదో వస్తువు కొందామని వెతుకుతున్నారు.. ఒక ఈ-కామర్స్‌ వెబ్‌సైట్లో ధర తక్కువగా ఉన్నట్టు కనిపించింది.. సరేనని కార్ట్‌కు యాడ్‌ చేశారు.. బిల్లు చెల్లించేందుకు సిద్ధమయ్యారు.. పేమెంట్‌ పేజీకి వచ్చే సరికి చెల్లించాల్సిన సొమ్ము పెరిగిపోయింది.. హ్యాండ్లింగ్‌ చార్జీలు, డెలివరీ ప్రొటెక్షన్‌, కన్వీనియెన్స్‌ ఫీజు ఇలా వివిధ పేర్లతో చార్జీలు కలిపి.. 20శాతం అదనంగా చెల్లించాల్సి వచ్చింది. ఎలాగూ కొనడానికి సిద్ధమయ్యాం కదా.. అని చాలా మంది చెల్లించేస్తూ ఉంటారు.. కొందరైతే అసలు గమనించకుండానే పేమెంట్‌ చేసేస్తారు.. ఇలా వినియోగదారులకు తెలియకుండాగానీ, వారిని మభ్యపెట్టిగానీ ఎక్కువ సొమ్ము వసూలు చేసుకునేందుకు ఆన్‌లైన్‌, ఈ-కామర్స్‌ సంస్థలను అనుసరించే విధానాలను ‘డార్క్‌ ప్యాటర్న్స్‌’ అంటారు. ఇలాంటి విధానాలతో దేశంలో 88శాతం మంది ఆన్‌లైన్‌ కొనుగోలు దారులు మోసపోతున్నారని.. ఏటా ఏకంగా రూ.28,000 కోట్లకుపైగా నష్టపోతున్నారని తమ అధ్యయనంలో తేలిందని ‘డాటమ్‌ ఇంటెలిజెన్స్‌’ సంస్థ వెల్లడించింది. ఈ మేరకు ‘డార్క్‌ ప్యాటర్న్స్‌ ఇన్‌ ఇండియాస్‌ ఆన్‌లైన్‌ మార్కెట్‌ ప్లేసెస్‌’ పేరిట నివేదికను విడుదల చేసింది. ఒకటీ రెండూ కాదు.. ప్రస్తుతమున్న ఆన్‌లైన్‌, ఈ-కామర్స్‌, క్విక్‌ కామర్స్‌ వెబ్‌సైట్లు, యాప్‌లలో చాలా వరకు ఇలాంటి డార్క్‌ ప్యాటర్న్స్‌ను అనుసరిస్తున్నాయని పేర్కొంది. 2026 తొలి మూడు నెలల్లో 50 పట్టణాల్లో.. బిగ్‌ బాస్కెట్‌, జెప్టో, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌, బ్లింకిట్‌, అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ తదితర వెబ్‌సైట్లు, యాప్‌ల వినియోగదారులను ప్రశ్నించి, వివరాలు సేకరించామని తెలిపింది.


నివేదికలోని కీలక అంశాలివీ..

  • దేశంలో సుమారు 30.4 కోట్ల మంది ఆన్‌లైన్‌లో కొనుగోళ్లు చేస్తున్నారు. వారిలో 88శాతం మంది వివిధ ‘డార్క్‌ ప్యాటర్స్స్‌’తో డబ్బును కోల్పోతున్నారు.

  • ఈ-కామర్స్‌తోపాటు బ్యాంకింగ్‌, ట్రావెల్‌, క్యాబ్‌లు, ఇన్సూరెన్స్‌, ఆన్‌లైన్‌ పేమెంట్‌ గేట్‌వేలు, లోన్‌ యాప్‌లు, వెబ్‌సైట్లలోనూ నిగూఢ చార్జీలు, మభ్యపెట్టి, మోసగించి అదనపు సొమ్ము వసూలు చేయడం వంటివి జరుగుతున్నాయి.

  • సగటున ఒక్కో ఆన్‌లైన్‌ వినియోగదారు ప్రతినెలా రూ.78 నుంచి రూ.87 మధ్య నష్టపోతున్నారు.

  • 2024లో 52శాతం మంది నిగూఢ చార్జీల సమస్యను ఎదుర్కోగా, 2025లో ఇది 63శాతానికి చేరింది. వెబ్‌సైట్లు, యాప్‌లు అదనంగా సొమ్ము వసూలు చేసేందుకు డ్రిప్‌ ప్రైసింగ్‌, బైట్‌ అండ్‌ స్విచ్‌, ఫాల్స్‌ అర్జెన్సీ, ప్రీటిక్‌, ఫోర్స్‌డ్‌ యాక్షన్‌ వంటి విధానాలను అమలు చేస్తున్నాయి.

డ్రిప్‌ ప్రైసింగ్‌: వస్తువు ధరను తక్కువగా చూపిస్తారు. చెల్లింపుల పేజీకి వెళ్లే సరికి హ్యాండ్లింగ్‌ చార్జీలు, డెలివరీ ప్రొటెక్షన్‌, కన్వీనియెన్స్‌ ఫీజు, ఇన్సూరెన్స్‌ అంటూ వివిధ చార్జీలు కలిపి.. కట్టాల్సిన సొమ్మును 10శాతం-30శాతం వరకు పెంచేస్తారు.

బైట్‌ అండ్‌ స్విచ్‌: మొదట వస్తువు ధరను తక్కువగా చూపిస్తారు. క్లిక్‌ చేసి చూస్తే.. అది అందుబాటులో లేదని, అదే తరహాలో మరో మోడల్‌ ఉందని చూపిస్తూ ఎక్కువ ధర కనిపిస్తుంది. గమనించకపోతే ఎక్కువ సొమ్ము చెల్లించాల్సి వస్తుంది.

ఫాల్స్‌ అర్జెన్సీ: ఏదైనా వస్తువు కొంతసేపు మాత్రమే అందుబాటులో ఉంటుందనిగానీ, డిస్కౌంట్‌ కొంతసేపే ఉంటుందని గానీ టైమర్‌ చూపిస్తూ.. మానసికంగా ఒత్తిడి కలిగేలా చేస్తారు. హడావుడిగా కొనడానికి సిద్ధమై క్లిక్‌ చేసి, చెల్లింపుల పేజీకి వెళ్లే సరిగి ఇతర చార్జీలు కలిసి ఉంటాయి. గమనించకుంటే ఎక్కువ సొమ్ము కట్టాల్సిందే.

ప్రీటిక్‌ ఆప్షన్లు: ఏదైనా వస్తువును కొనే ఆప్షన్‌ కింద అదే తరహాలోని, లేదా దానికి అనుబంధంగా ఉండే మరో ఒకట్రెండు వస్తువులు కూడా జోడించి.. వాటికి టిక్‌ మార్క్‌ చేసి ఉంటాయి. మనం కేవలం వస్తువును కొందామని బై ఆప్షన్‌ క్లిక్‌ చేస్తే.. మిగతా వస్తువులు కూడా కార్ట్‌కు యాడ్‌ అవుతాయి. గమనించకుండా చెల్లింపు జరిపితే.. అవన్నీ కొనేసినట్టే.

సీసీపీఏ హెచ్చరించినా

డార్క్‌ ప్యాటర్న్స్‌తో వినియోగదారులకు నష్టం జరుగుతున్నట్టు గుర్తించిన ‘కేంద్ర వినియోగదారుల హక్కుల రక్షణ సంస్థ (సీసీపీఏ)’ 2023లోనే దీనిపై ఆన్‌లైన్‌, ఈ-కామర్స్‌ సంస్థలకు హెచ్చరికలు జారీ చేసింది. 13 రకాల డార్క్‌ ప్యాటర్న్స్‌ నియంత్రణ కోసం మార్గదర్శకాలు రూపొందించి, కట్టుదిట్టంగా అమలు చేయాలని ఆదేశించింది. అయినా చాలా సంస్థలు ఏదో ఒక రూపంలో అదనపు వసూళ్లకు పాల్పడుతున్నాయి.

Updated Date - Jun 22 , 2026 | 04:04 AM