పదేళ్లలో 131శాతం పెరిగిన రాష్ట్రాల వ్యయం
ABN , Publish Date - Jun 17 , 2026 | 03:51 AM
పదేళ్లలో రాష్ట్రాల మొత్తం వ్యయం భారీగా 131శాతం పెరిగిందని కంప్ట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ (కాగ్) నివేదిక వెల్లడించింది.
2015లో రూ.22.18 లక్షల కోట్ల నుంచి
2024లో రూ.51.20 లక్షల కోట్లకు.. కాగ్ నివేదిక వెల్లడి
న్యూఢిల్లీ, జూన్ 16: పదేళ్లలో రాష్ట్రాల మొత్తం వ్యయం భారీగా 131శాతం పెరిగిందని కంప్ట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ (కాగ్) నివేదిక వెల్లడించింది. రాష్ట్రాలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారించడం ఈ పెరుగుదలకు కారణమని పేర్కొంది. మొత్తం వ్యయం 2015-16 ఆర్థిక సంవత్సరంలో రూ.22.18 లక్షల కోట్లు ఉండగా 2024-25 నాటికి రూ.51.20 లక్షల కోట్లకు పెరిగిందని వివరించింది. ఇందులో మూడింట రెండొంతులు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకే ఖర్చు చేస్తున్నాయని తెలిపింది. కంపో్ట్రలర్ అండ్ ఆడిటర్ జనరల్ కె. సంజయ్‌మూర్తి మంగళవారం ఈ నివేదికను విడుదల చేశారు. రాష్ట్రాల మొత్తం వ్యయంలో రెవెన్యూ వ్యయం 83 శాతానికి పైగా ఉందని, మూలధన వ్యయం నికరంగా పెరిగినా వాటాపరంగా మాత్రం తక్కువగానే ఉందని నివేదిక పేర్కొంది.