Share News

కంచుకోటలో ఓడిన స్టాలిన్‌

ABN , Publish Date - May 05 , 2026 | 04:28 AM

తమిళనాడు ఎన్నికల్లో డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ ఓడిపోయారు. తనకు కంచుకోట అయిన కొళత్తూరు నియోజకవర్గం నుంచి బరిలోకి ..

కంచుకోటలో ఓడిన స్టాలిన్‌

చెన్నై, మే 4(ఆంధ్రజ్యోతి): తమిళనాడు ఎన్నికల్లో డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ ఓడిపోయారు. తనకు కంచుకోట అయిన కొళత్తూరు నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన ఆయన టీవీకే అభ్యర్థి వీఎస్‌ బాబు చేతిలో 8,795 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. బాబు ఒకప్పడు స్టాలిన్‌కు కుడిభుజంగా ఉండేవారు. 2011లో కొళత్తూరు నియోజకవర్గం ఏర్పడినప్పుడు స్టాలిన్‌ను అక్కడకు ఆహ్వానించి, ఆ ఎన్నికల్లో ప్రచారం చేపట్టి గెలిపించింది ఆయనే. అయితే అప్పట్లో స్టాలిన్‌కు 2వేల మెజారిటీ మాత్రమే రావడంతో ఆయన్ను పార్టీ దూరం పెట్టింది. ఆ తర్వాత అన్నాడీఎంలో చేరిన వీఎస్‌ బాబు.. అక్కడా సహకారం లేకపోవడంతో టీవీకేలో చేరి, తన పాత బాస్‌ను ఓడించారు. దీంతో ఎన్నికల్లో ఓడిపోయిన డీఎంకే తొలి అధ్యక్షుడిగా స్టాలిన్‌ అపఖ్యాతిని మూటకట్టుకున్నారు. 1996 తర్వాత స్టాలిన్‌ ఓడిపోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.


1.jpg

నిరాశలో డీఎంకే...

గెలుపుపై తిరుగులేని ధీమాతో ఉన్న డీఎంకే తాజా పరిణామాలతో తీవ్రనిరాశలో కూరుకుపోయింది. ‘జయం మనదే’ అనే నమ్మకంతో సోమవారం ఉదయానికే డీఎంకే కార్యాలయం ముందు పార్టీ జెండాలతో కార్యకర్తలు గుమికూడారు. ఫలితాల సరళిపై స్పష్టత రాగానే... అక్కడి నుంచి వెళ్లిపోయారు. చివరికి... సీఎం స్టాలిన్‌తో పాటు 14మంది మంత్రులూ పరాజయం పాలవడంతో డీఎంకే శిబిరంలో నిస్పృహ నెలకొంది.

Updated Date - May 05 , 2026 | 04:30 AM