Share News

ప్రజాస్వామ్య పునాదులు తలకిందులు!

ABN , Publish Date - Mar 10 , 2026 | 04:54 AM

ఒకే దేశం-ఒకే ఎన్నిక’ అనేది మన పార్లమెంటరీ ప్రజాస్వామ్య పునాదులను తలకిందులు చేస్తుందని డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు సీఎం స్టాలిన్‌ వ్యాఖ్యానించారు.

ప్రజాస్వామ్య పునాదులు తలకిందులు!

  • జమిలి ఎన్నికలపై స్టాలిన్‌ వ్యాఖ్య

చెన్నై, మార్చి 9(ఆంధ్రజ్యోతి): ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ అనేది మన పార్లమెంటరీ ప్రజాస్వామ్య పునాదులను తలకిందులు చేస్తుందని డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు సీఎం స్టాలిన్‌ వ్యాఖ్యానించారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఒక వ్యాధిని నయం చేసేందుకు పనికిరాని మందు ఇవ్వడంతో సమానంగా ‘ఒకే దేశం - ఒకే ఎన్నిక’ను అభివర్ణించారు. ఎన్నికల నిర్వహణలో పరిపాలనా సమస్యల్లోని కారణాలను బూచిగా చూపించి ప్రజాస్వామ్యాన్ని స్తంభింపజేయాలని అనుకోవడం పెద్ద తప్పు అన్నారు. 2019లో ఇండోనేషియాలో కూడా ఇలాగే ఒకే రోజు అధ్యక్ష, జాతీయ, ప్రాంతీయ, అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించి చరిత్ర సృష్టించారని తెలిపారు. ఖర్చులు తగ్గించడం, పరిపాలనను సరళీకృతం చేయడం వంటివి లక్ష్యంగా పెట్టుకుని చేసిన ఆ ప్రయత్నంలో భారీగా ప్రాణనష్టం జరిగిందన్నారు. సుమారు 900 మంది ఎన్నికల సిబ్బంది ప్రాణాలు కోల్పోగా, 5 వేల మంది వరకు గాయపడ్డారని తెలిపారు. ఇదిలా ఉండగా, తమిళనాడు రాష్ట్రాన్ని ‘కాషాయ మూక’ మింగేయాలనుకుంటోందని, అందుకు తమ పార్టీ అనుమతించబోదని స్టాలిన్‌ స్పష్టం చేశారు. సోమవారం తిరుచిరాపల్లిలో నిర్వహించిన డీఎంకే మెగా సదస్సులో ఆయన మాట్లాడుతూ సీఎం పదవి కోసం అన్నాడీఎంకే నాయకుడు పళనిస్వామి బీజేపీకి బానిసగా మారిపోయారని విమర్శించారు.

Updated Date - Mar 10 , 2026 | 04:54 AM