స్థిరమైన పాలన అందించండి
ABN , Publish Date - May 10 , 2026 | 05:44 AM
టీవీకే అధినేత, నటుడు విజయ్ నేతృత్వంలో ఏర్పడనున్న కొత్త ప్రభుత్వానికి డీఎంకే అధ్యక్షులు ఎంకే స్టాలిన్, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి వేర్వేరు ప్రకటనల్లో...
మా సహకారం మీకు ఉంటుంది
కొత్త ప్రభుత్వానికి, విజయ్‌కు స్టాలిన్, ఎడప్పాడి శుభాకాంక్షలు
చెన్నై, మే 9 (ఆంధ్రజ్యోతి) : టీవీకే అధినేత, నటుడు విజయ్ నేతృత్వంలో ఏర్పడనున్న కొత్త ప్రభుత్వానికి డీఎంకే అధ్యక్షులు ఎంకే స్టాలిన్, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి వేర్వేరు ప్రకటనల్లో శుభాకాంక్షలు తెలిపారు. శనివారం సాయంత్రం విజయ్‌కు వీసీకే మద్దతు ఇవ్వడంతో కొత్త ప్రభుత్వం ఏర్పాటులో నెలకొన్న గండం తప్పిపోయింది. ఈ పరిణామం జరిగిన కొద్దిసేపటికే స్టాలిన్ ఒక ప్రకటన విడుదల చేశారు. ‘‘నేను ఇప్పటికే పత్రికలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ఆటంకం కలిగించబోమని, బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశాను. నేటి క్లిష్ట పరిస్థితిని నివారించేందుకు టీవీకేకు మద్దతిచ్చినా, సిద్ధాంతపరంగా డీఎంకే కూటమిలోనే ఉంటామని మా మిత్రపక్షాలు ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నాను’’ అని స్టాలిన్ తెలిపారు. అయితే, కూటమిలో భాగంగా పోటీచేసి విజయం సాధించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కనీసం కృతజ్ఞతలు తెలిపేందుకు కూడా రాలేదని, ఒక్కరోజులోనే డీఎంకే కూటమితో సంబంధాలు తెంచుకుని వెళ్లిపోయారని స్టాలిన్ అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్ర హక్కుల కోసం, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం డీఎంకేతో కలసి పోరాటం కొనసాగిస్తామని సీపీఎం, సీపీఐ, వీసీకే పేర్కొనడాన్ని స్వాగతిస్తున్నానని తెలిపారు. ‘‘మా ఐదేళ్ల పాలన రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేలా సాగింది. దీర్ఘ దృష్టితో, పటిష్ఠమైన ప్రణాళికలతో మా ప్రభుత్వం అమలుచేసిన పథకాలను కొత్త ప్రభుత్వం కొనసాగించాలన్నదే నా ఆకాంక్ష’’ అని స్టాలిన్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
కొత్త ఎమ్మెల్యేలతో ఎడప్పాడి భేటీ
రాష్ట్రంలో కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న పార్టీకి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి(ఈపీఎస్) తన ఎక్స్ పేజీలో ప్రకటించారు. గత కొద్దిరోజులుగా పుదుచ్చేరి రిసార్ట్స్‌లో బసచేసిన ఆ పార్టీ శాసనసభ్యులంతా శనివారం ఉదయం నగరానికి తిరిగొచ్చారు. ఆ తర్వాత అడయార్ గ్రీన్‌వేస్ రోడ్డులోని ఈపీఎస్ నివాసగృహంలో అందరూ సమావేశమయ్యారు. ఈ సమావేశానికి కొంతమంది గైర్హాజరయ్యారు. సుమారు అరగంటకు పైగా కొనసాగిన సమావేశం జరిగింది.