ప్రపంచ బ్యాంకు ర్యాంకుల్లో భారత్‌ను దాటిన లంక
ABN , Publish Date - Jul 05 , 2026 | 05:57 AM
కొంత కాలం క్రితం ఆర్థిక సంక్షోభంతో అల్లాడిన శ్రీలంక ఇప్పుడు గాడిన పడి ప్రపంచ బ్యాంకు ర్యాంకింగ్స్‌లో ఎగువ మధ్య ఆదాయ వర్గం విభాగంలో స్థానం దక్కించుకుంది..
మళ్లీ ఎగువ మధ్య ఆదాయ వర్గంలోకి
దిగువ మధ్య ఆదాయ వర్గంలోనే భారత్
న్యూఢిల్లీ, జూలై 4: కొంత కాలం క్రితం ఆర్థిక సంక్షోభంతో అల్లాడిన శ్రీలంక ఇప్పుడు గాడిన పడి ప్రపంచ బ్యాంకు ర్యాంకింగ్స్‌లో ఎగువ మధ్య ఆదాయ వర్గం విభాగంలో స్థానం దక్కించుకుంది. సంవత్సరాల తరబడి కొనసాగిన సుస్థిర ఆర్థిక విస్తరణకు ప్రతిఫలంగా వియత్నాం, ఫిలిప్పీన్స్ కూడా తమ స్థానాలు మెరుగుపరుచుకున్నాయి. కానీ మనదేశం మాత్రం ఇంకా దిగువ మధ్య ఆదాయ వర్గంలోనే కొనసాగుతోంది. 2007 నుంచి తన స్థానాన్ని మెరుగుపరుచుకోలేకపోయింది. ప్రపంచ బ్యాంకు తాజా వర్గీకరణలో శ్రీలంక పురోగతిని ‘కోలుకున్న ఓ కథ’ అంటూ అభివర్ణించింది. మూడేళ్ల క్రితం దారుణమైన సంక్షోభంతో పతనం అంచుకు చేరుకున్న ఆ దేశ ఆర్థిక వ్యవస్థ త్వరగా కోలుకుని 2025లో 5శాతం అభివృద్ధి చెందిందని పేర్కొంది. దీనికి పరిశ్రమల పునరుద్ధరణతో పాటు బలమైన పర్యాటక రంగం, ఆర్థిక సేవలే కారణమని తెలిపింది. కాగా, 2019లో శ్రీలంక తొలిసారి ఎగువ మధ్య ఆదాయ విభాగంలోకి అడుగుపెట్టింది. 2022 నాటికి తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి పడిపోయింది. తర్వాత ఐఎంఎఫ్ సహకారంతో చేపట్టిన సంస్కరణలు, ఆర్థిక క్రమశిక్షణతో ఆర్థిక వృద్ధిలో నిలకడ సాధించింది.