Share News

హైదరాబాద్‌ రావాల్సిన ఆకాశ విమానాన్ని ఢీకొట్టిన స్పైస్‌జెట్‌

ABN , Publish Date - Apr 17 , 2026 | 03:35 AM

ఢిల్లీ విమానాశ్రయంలో గురువారం మధ్యాహ్నం రెండు ప్రయాణికుల విమానాలు ఢీకొన్నాయి. స్పైస్‌జెట్‌కు చెందిన ఓ విమానం ఆకాశ ఎయిర్‌ సంస్థకు చెందిన విమానాన్ని పక్క నుంచి ఢీకొట్టింది.

హైదరాబాద్‌ రావాల్సిన ఆకాశ విమానాన్ని ఢీకొట్టిన స్పైస్‌జెట్‌

  • ఢిల్లీ విమానాశ్రయంలో ప్రమాదం

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 16 : ఢిల్లీ విమానాశ్రయంలో గురువారం మధ్యాహ్నం రెండు ప్రయాణికుల విమానాలు ఢీకొన్నాయి. స్పైస్‌జెట్‌కు చెందిన ఓ విమానం ఆకాశ ఎయిర్‌ సంస్థకు చెందిన విమానాన్ని పక్క నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో ప్రయాణికులు, సిబ్బందికి ఎలాంటి ముప్పు వాటిల్లలేదు. కానీ రెండు విమానాలు స్వల్పంగా దెబ్బ తిన్నాయి. విమానాశ్రయ అధికారుల కథనం ప్రకారం.. ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరుతున్న విమానం గురువారం మధ్యాహ్నం రన్‌వే మీదకు వస్తోంది. అదే సమయంలో లేహ్‌ నుంచి వచ్చిన స్పైస్‌ జెట్‌ విమానం పార్కింగ్‌ బేలోకి వెళుతోంది. ఈ క్రమంలో స్పైస్‌జెట్‌ విమానం ఆకాశ విమానాన్ని పక్క నుంచి తాకుతూ వెళ్లింది. దీంతో స్పైస్‌జెట్‌ విమానం కుడివైపు రెక్క భాగం ధ్వంసమైంది. అలాగే, ఆకాశ విమానం ఎడమ వైపు భాగం స్వల్పంగా దెబ్బతింది. దీంతో నిబంధనల ప్రకారం ఆకాశ విమానంలో నుంచి ప్రయాణికులను కిందికి దించేశారు. అయితే, ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని ఆకాశ సంస్థ ప్రకటించింది.

Updated Date - Apr 17 , 2026 | 03:35 AM