రాజీవ్ హత్యకేసు దర్యాప్తు పైనే పీవీకి, నాకు విభేదం
ABN , Publish Date - Nov 17 , 2026 | 03:36 AM
సోనియాగాంధీ తన జీవితంలో తీసుకున్న అతిపెద్ద నిర్ణయాల్లో ఒకటైన తెలంగాణ ఏర్పాటు గురించి ఆత్మకథలో ఒక్కసారి కూడా రాయలేదు. ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ పేరుతో వెలువడిన 636 పేజీల పుస్తకంలో..
కానీ, మా మధ్య ఎప్పుడూ వైరమే ఉన్నట్లు చిత్రించే ప్రయత్నాలు జరిగాయి: సోనియా
(సెంట్రల్ డెస్కు)
సోనియాగాంధీ తన జీవితంలో తీసుకున్న అతిపెద్ద నిర్ణయాల్లో ఒకటైన తెలంగాణ ఏర్పాటు గురించి ఆత్మకథలో ఒక్కసారి కూడా రాయలేదు. ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ పేరుతో వెలువడిన 636 పేజీల పుస్తకంలో ’తెలంగాణ’, ‘తెలుగు’ అన్న పదాలే కనిపించవు. 2009 డిసెంబరు ప్రకటన, 2014 రాష్ట్ర విభజన, ఆ తర్వాత రెండు రాష్ట్రాల్లో పార్టీ పతనం, 2023లో తెలంగాణలో తిరిగి అధికారం.. వీటిలో ఏ ఒక్కటీ పుస్తకంలో చోటు చేసుకోలేదు. ఆంధ్రప్రదేశ్ పేరు మాత్రం ఏడు చోట్ల వస్తుంది. అవి కూడా నెహ్రూ-గాంధీ కుటుంబ జీవితంలోని ఘట్టాలకు నేపథ్యంగానే తప్ప, రాష్ట్ర రాజకీయాల చర్చగా కాదు.
జలగం ఎలర్ట్తో ఇందిర అప్రమత్తం
ఇందిరను గద్దె దించేందుకు మద్దతు కోరుతూ జయప్రకాష్ నారాయణ్ నీలం సంజీవరెడ్డికి పంపిన సందేశాన్ని అప్పటి ఏపీ సీఎం (జలగం వెంగళరావు) పసిగట్టి ఇందిరకు చేరవేశారని సోనియా తన పుస్తకంలో రాశారు. 1975 నాటి అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇందిరకు వ్యతిరేకంగా వస్తుందని జేపీ ముందే భరోసా ఇచ్చినట్టు అందులో ఉంది. జలగం ఇచ్చిన అలర్ట్‌కు అనుగుణంగానే తర్వాత తీర్పు రావడంతో తనపై ఏదో కుట్ర జరుగుతోందని ఇందిర భావించారని అర్థం చేసుకోవచ్చు. రాజీవ్‌తో కలిసి దక్షిణాది ఆలయాలు దర్శించిన సందర్భంలో తమిళనాడు మీనాక్షి ఆలయంతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని వెంకటేశ్వర ఆలయం(తిరుమల) సందర్శించినట్లు సోనియా చెప్పారు. 2024లో తాను విజయవాడలో పర్యటించినప్పుడు ’ఇందిరమ్మ’ నినాదాలతో తనకు స్వాగతం లభించిందని సోనియా రాశారు. ‘‘కాన్వాయ్ నెమ్మదిగా సాగుతుండగా కొంత దూరంలో లంబాడా మహిళల బృందం కనిపించడంతో వాహనం ఆపారు. వారు పరుగున వచ్చి అద్దాల పనితనం ఉన్న ఓఢ్నీని నా తలపై కప్పారు. ఇందిరమ్మ కోడలివి కాబట్టి అమ్మ పార్టీకే ఓటేస్తామని వారు చెప్పారు’’ అని సోనియా గుర్తుచేసుకున్నారు.
పీవీ: ప్రశంస ఉంది.. వివాదాలు లేవు
తెలుగు నేతల్లో కాస్త విస్తారంగా కనిపించేది పీవీ నరసింహారావు ఒక్కరే. ఆరు చోట్ల ఆయన పేరుంది. ఇందిర కారాగారంలో ఉన్నప్పుడు పంపిన చీటీల్లో ఒకదానిలో ’దేవరాజ్ అర్స్, పీవీలను సంప్రదించాలి’ అన్న సూచన ఉందని, దాన్ని సంజయ్‌కు అందజేశానని రాశారు. 1991లో ప్రధాని అయిన పీవీని ఇందిర, రాజీవ్ మంత్రివర్గాల్లో విశ్వసనీయ సహచరుడిగా, బహుభాషా పాండిత్యం, పాలనానుభవం ఉన్న రాజకీయ దురంధరుడిగా అభివర్ణించారు. తమ మధ్య వైరం ఉన్నట్టు చిత్రించే ప్రయత్నాలు జరిగాయని, నిజానికి రాజీవ్ హత్య కేసు దర్యాప్తు నత్తనడకపై తాను బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేసినప్పుడు ఒకే ఒక్కసారి విభేదించామని పేర్కొన్నారు. ఆర్థిక సంస్కరణల్లో తదుపరి దశకు బాటలు వేసింది పీవీ ప్రభుత్వమేనన్న గుర్తింపూ ఇచ్చారు. అయితే 1992 బాబ్రీ కూల్చివేతను ప్రస్తావించిన చోట పీవీ పేరు లేదు. 2004లో ఆయన మరణం, అంత్యక్రియల వివాదం, 2024లో భారతరత్న.. ఏదీ లేదు.
కనిపించని పేర్లు, ఘట్టాలు
వైఎస్, ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు, కేసీఆర్, జగన్మోహన్రెడ్డి, రేవంత్‌రెడ్డి, అంజయ్య, చెన్నారెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి.. వీరెవరి పేర్లూ సోనియా పుస్తకంలో లేవు. 2004లో కాంగ్రెస్ కూటమికి 218 స్థానాలు వచ్చాయని రాసిన సోనియా, అందులో ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన 29 స్థానాల గురించి, 2009 గెలుపులో ఆ రాష్ట్రం పాత్ర గురించి ఏమీ చెప్పలేదు. తన జీవితంలో గొప్ప తృప్తినిచ్చిన చట్టంగా ఉపాధి హామీని వివరించినా, ఆ పథకం అనంతపురం జిల్లాలో ప్రారంభమైన సంగతి లేదు.