భగవద్గీతే దారిచూపింది
ABN , Publish Date - Nov 08 , 2026 | 03:09 AM
తాను రాజకీయాల్లోకి రావాలా.. వద్దా? అన్న సందిగ్ధంలో ఉన్నప్పుడు.. భగవద్గీతే తనకు దారి చూపిందని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియాగాంధీ తెలిపారు.
రాజకీయాల్లోకి రావటంపై నాతో నేనే యుద్ధం చేశా.. ఫలితాన్ని ఆశించకుండా పనిచేయాలన్న గీతాబోధతో ముందడుగు వేశా
దేశంలో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించటం పొరపాటే.. కానీ తప్పలేదు
సంజయ్‌గాంధీ ఒత్తిడితోనే ఆ నిర్ణయం
ద హిందూ, ద గార్డియన్ వార్తా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో సోనియాగాంధీ
న్యూఢిల్లీ, నవంబరు 7: తాను రాజకీయాల్లోకి రావాలా.. వద్దా? అన్న సందిగ్ధంలో ఉన్నప్పుడు.. భగవద్గీతే తనకు దారి చూపిందని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియాగాంధీ తెలిపారు. రాజకీయాల్లోకి రావటంపై తనలోతాను పెద్ద యుద్ధమే చేశానని చెప్పారు. తన ఆత్మకథ ‘బిలాంగింగ్: ఏ జర్నీ ఆఫ్ లవ్’ గ్రంథం ఈ నెల 10వ తేదీన విడుదల కానున్న నేపథ్యంలో ఆమె ద గార్డియన్, ద హిందూ వార్తా సంస్థలకు శనివారం ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు ఇచ్చారు. తాను ఇందిరాగాంధీ కుటుంబంలో భాగమవటం, ఇందిర, రాజీవ్‌గాంధీల హత్యలు, దేశంలో అత్యవసర పరిస్థితితోపాటు గత 12ఏళ్ల ఎన్డీయే పాలనపై ఆమె తన జ్ఞాపకాలు, అనుభవాలు, అభిప్రాయాలను వెల్లడించారు. ద హిందూ గ్రూప్ డైరెక్టర్, సీనియర్ జర్నలిస్టు ఎన్ రామ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను రాజకీయాల్లోకి వచ్చిన పరిస్థితులను వివరించారు. ‘నాకు రాజకీయాలంటే మొదటి నుంచీ ఇష్టంలేదు. ఇందిరాగాంధీ హత్య తర్వాత పార్టీ నేతలంతా తనను ప్రధాని పదవి చేపట్టాలని కోరుతున్నట్లు రాజీవ్ నాతో చెప్పారు. అప్పుడు నాకు చాలా భయమేసింది. ఎట్టిపరిస్థితుల్లోనూ ఆ పదవి చేపట్టవద్దని వాదించాను. కానీ, ఆయన వినలేదు. నేను రాజకీయాల్లోకి వెళ్లకపోయినా తనను బతకనివ్వరని చెప్పారు. ఆ తర్వాత రాజీవ్ హత్యతో నేను తీవ్ర దుఃఖంలో మునిగిపోయాను. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీలో చీలికలు ఏర్పడి పరిస్థితి రోజురోజుకు దిగజారుతూ పోయింది. అప్పుడు పార్టీ నేతలు, కార్యకర్తలు చాలామంది నన్ను రాజకీయాల్లోకి రావాలని ఒత్తిడి తేవటం మొదలుపెట్టారు. దీంతో నేను తీవ్ర అంతర్మథనలో మునిగిపోయాను.
రాజకీయాల్లోకి రావాలా వద్దా? అనే అంశంపై నాలో నేను పెద్ద యుద్ధమే చేశాను. నానమ్మ, నాన్న హత్యలతో భయంతో ఉన్న నా పిల్లలు రాహుల్, ప్రియాంకలు నన్ను రాజకీయాల్లోకి వెళ్లవద్దని గట్టిగా వాదించారు. ఆ సమయంలో నేను భగవద్గీతను ఆశ్రయించాను. ఫలితాలను ఆశించకుండా.. నీ కర్మను నీవు ఆచరించు అన్న గీతా బోధనతో నా సందేహాలు, ప్రశ్నలకు సమాధానం దొరికింది. దాంతో నేను బాధ్యతల వైపు ముందడుగు వేశాను. 1997-98 మధ్య ప్రొఫెసర్ వాచస్పతి ఉపాధ్యాయ నాకు గీతాసారాన్ని బోధించారు’ అని సోనియాగాంధీ వివరించారు.
ఎమర్జెన్సీ విధించటం పొరపాటే..
ఇందిరాగాంధీ 1975లో దేశంలో అత్యవసర పరిస్థితి విధించటం పొరపాటేనని ద గార్డియన్ వార్తా సంస్థ ఇంటర్వ్యూలో సోనియాగాంధీ అభిప్రాయపడ్డారు. ఈ అంశంపై ఇందిర కూడా విచారం వ్యక్తంచేశారని గుర్తుచేశారు. ‘ఎమర్జెన్సీ విధించటంపై మా కుటుంబంలో కూడా విబేధాలు వచ్చాయి. నాడు దేశంలో పరిస్థితులు రోజురోజుకూ దిగజారుతున్నాయి. ప్రతిపక్షాల నేతృత్వంలో నిరసనకారులు ప్రభుత్వ కార్యాలయాలను, ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. ఆ పరిస్థితుల్లో ఒకరోజు మా కుటుంబ సభ్యులందరం రాత్రి భోజనం చేస్తున్న సమయంలో ఈ అంశం చర్చకు వచ్చింది. ఎమర్జెన్సీ విధించటం సరికాదని రాజీవ్ అప్పుడు బలంగా వాదించారు. కానీ, ఆయన తమ్ముడు సంజయ్‌గాంధీ ఎమర్జెన్సీ విధించాల్సిందేనని పట్టుబట్టారు. ప్రతిపక్షాలు తన తల్లి ప్రతిష్ఠను నాశనం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. మరికొందరు పార్టీ సీనియర్లు కూడా తర్వాత ఆయనకు జతకలిశారు. దీంతో రాజీవ్ మాటను వినకుండా ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ నిర్ణయం తీసుకున్నారు. నేను చెప్తున్నది కొందరికి హాస్యాస్పదంగా ఉండవచ్చు కానీ.. ఇందిరాగాంధీ ప్రజాస్వామ్యవాది. ఎమర్జెన్సీ సమయంలో ఆమె కూడా సంతోషంగా లేరు. ఆ నిర్ణయం ఆమెకు తీవ్ర వేదన కలిగించి ఉంటుంది. ఎమర్జెన్సీ విధించిన తర్వాత దాని ప్రభావం నాకు అర్థమైంది. అది పొరపాటు నిర్ణయమే. అయితే, ఎమర్జెన్సీ సమయంలో పౌరుల ప్రజాస్వామ్య హక్కుల రద్దు రాజ్యాంగం ప్రకారమే జరిగింది. సంజయ్‌గాంధీని కట్టడి చేసి ఉంటే పరిస్థితి మెరుగ్గా ఉండేది’ అని సోనియా అన్నారు.
ఆ రోజు భయంతో కంపించిపోయా..
ఇందిరాగాంధీ హత్యరోజు ఏం జరిగిందన్న విషయాన్ని కూడా సోనియా వివరించారు. ‘ఆరోజు మా ఇంటిపక్కనే ఉన్న ఆఫీసుకు ఇందిర బయలుదేరగానే నేను స్నానం చేయటానికి నా గదికి వెళ్లా. ఆ సమయంలో పేలుళ్ల శబ్దాలు వినిపిచాయి. మొదట టపాకాయల శబ్దాలు అనుకున్నా. కానీ, అప్పుడే ఆయా ఓంగ్ము ఒగరుస్తూ పరుగెత్తుకొచ్చింది. ఆమె తీవ్రమైన భయంతో వణికిపోతోంది. మాట కూడా బయటకు రావటం లేదు. దీంతో ఏదో ఉపద్రవం జరిగిందని అర్థమై బయటకు పరుగెత్తుకొచ్చా. అలాగే అక్బర్ రోడ్డులో పరుగెత్తా. అదే దారిలో తెల్లని అంబాసిడర్ కారు నెమ్మదిగా వెళ్లటం గమనించాను. భయంతో కంపించిపోయా. గుండె గొంతులోకొచ్చింది. ఒంట్లో వణుకుతో కిందపడబోయి తమాయించుకున్నా. వెంటనే తేరుకొని కారుదగ్గరికి పరుగెత్తి, దానిని ఆపి లోపలికి ఎక్కాను. కారులో ఎక్కడ చూసినా రక్తమే.. ఇందిర వస్త్రాలపై, ముఖంపై మొత్తం రక్తమే. ఆమె కళ్లు షాక్‌తో అలాగే తెరుచుకొనే ఉన్నాయి. మమ్మీ.. మమ్మీ అని పిలిచా.. ఎలాంటి స్పందనా లేదు. ఆ సమయంలో ఇందిర కారు ముందు ఆమె అనుచరులు గుమికూడటంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడి వేగంగా ఆస్పత్రికి వెళ్లటం సాధ్యంకాలేదు. ఆస్పత్రికి వెళ్లాక కూడా గేటువద్దనే కారును ఆపారు. లోపలికి వెళ్లాక కూడా వెంటనే వైద్యం మొదలుపెట్టలేదు. ఆ సమయంలో నిలువెళ్లా వణుకుతున్నాను. పిల్లలు స్కూల్లో ఉన్నారు. రాజీవ్ పశ్చిమబెంగాల్లో ఉన్నారు. వారికి కూడా ఏమైనా ప్రమాదం జరుగుతుందేమోనని మరింత భయపడ్డాను. పిల్లలను వెంటనే ఇంటికి తీసుకువచ్చాం. రాజీవ్ ఢిల్లీకి వచ్చి నేరుగా ఆస్పత్రికి వెళ్లారు. నాతో మాట్లాడటానికి ప్రయత్నించారు కానీ.. నాకేమీ వినాలనిపించలేదు. కొద్దిసేపటికి తనను ప్రధాని పదవి చేపట్టాలని సీనియర్లు కోరుతున్నట్లు చెప్పారు. ఆ మాటలు నా గుండెల్లో కత్తితో పొడుస్తున్నట్లు అనిపించాయి’ అని నాటి భయానక ఘటనను సోనియా గుర్తుచేసుకున్నారు.
బీజేపీ పాలనలో దేశం విధ్వంసం
గత 12 ఏళ్లుగా బీజేపీ పాలనలో దేశంలోని అన్ని వ్యవస్థలు ధ్వంసమయ్యాయని సోనియావిమర్శించారు. ఈ విషయం సామాన్య ప్రజలకు కూడా ఇప్పుడు అర్థమవుతోందన్నారు. ‘‘ఈ దేశ ప్రజలు మళ్లీ సరైన ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారన్న నమ్మకం ఉంది’’ అని వ్యాఖ్యానించారు. ‘‘దేశంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగ వ్యవస్థలు ధ్వంసమయ్యాయి. ఈ ప్రభుత్వం తర్వాత వచ్చే ప్రభుత్వాలకు వీటిని బాగుచేయటం అంత తేలిక కాదు’’ అన్నారు. ‘‘కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా రోజురోజుకూ బలపడుతోంది. ప్రస్తుత ప్రభుత్వాన్ని ఎదుర్కొనే శక్తి ఒక్క కాంగ్రె్‌సకే ఉంది. ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా మా కార్యకర్తలు ధైర్యంగా పోరాడుతున్నారు’’ అని చెప్పారు. తన ఆత్మకథ పుస్తకాన్ని భారత్‌లో విడుదల చేసే విషయంలో పెంగ్విన్ ఇండియా సంస్థ వ్యవహరించిన తీరు తనకు బాధ కలిగించిందని సోనియా తెలిపారు. ప్రభుత్వాన్ని విమర్శించే విషయంలో ఆ సంస్థ వెనుకడుగు వేసి తన పుస్తకంలో మార్పులు చేసేందుకు ప్రయత్నించిందని వెల్లడించారు. ఈ పుస్తకాన్ని భారత్‌లో హార్పర్ కొలిన్స్ సంస్థ ఈ నెల 10న విడుదల చేయనుంది.