నా వైపు కథ చెప్పాలనుకున్నా!
ABN , Publish Date - Nov 17 , 2026 | 02:27 AM
తన కుటుంబంపై ఏళ్ల తరబడి తప్పుడు ప్రచారం జరిగిందని, చివరకు తాను మాట్లాడాలనుకున్నానని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియాగాంధీ అన్నారు.
మా కుటుంబంపై ఏళ్ల తరబడి తప్పుడు ప్రచారం
దానికి సమాధానంగా పుస్తకమే సరైన మార్గం
‘బిలాంగింగ్’ ఆత్మకథ ఆవిష్కరణలో సోనియా
అమ్మ నాలుగు సార్లు క్యాన్సర్‌ను జయించింది
అమ్మానాన్న కలిసిన హోటల్‌కు గర్ల్‌ఫ్రెండ్‌తో వెళ్లా
నాన్న మరణంతో అమ్మ ముభావంగా మారింది
చిన్ననాటి జ్ఞాపకాలతో రాహుల్‌గాంధీ ఉద్వేగం
కార్యక్రమానికి హాజరైన సీఎంలు రేవంత్, డీకే
సోనియా, రాజీవ్ తొలిసారి కలుసుకున్న కేంబ్రిడ్జ్‌లోని వర్సిటీ రెస్టారెంట్‌కు చాలా ఏళ్ల తర్వాత నా గర్ల్‌ఫ్రెండ్‌తో వెళ్లా. నా తల్లిదండ్రులు అక్కడే కలిశారని చెబితే, అక్కడి వ్యక్తి ‘వాళ్లిద్దరూ నాకు బాగా తెలుసు’ అన్నాడు. అతను చెప్పిన ‘చికెన్ షాసర్’ ఆర్డర్ చేశాం. ప్రేమలో పడాలంటే వర్సిటీ రెస్టారెంట్‌కు వెళ్లండి. కానీ అక్కడ చికెన్ షాసర్ మాత్రం తినకండి. అక్కడ భోజనం బ్రహ్మాండంగా ఉండేదని మా అమ్మానాన్నలకు గుర్తుంది. కానీ, మేం తిన్నది దారుణంగా ఉంది.
- రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): తన కుటుంబంపై ఏళ్ల తరబడి తప్పుడు ప్రచారం జరిగిందని, చివరకు తాను మాట్లాడాలనుకున్నానని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియాగాంధీ అన్నారు. అందుకే తన భావాలను పుస్తక రూపంలో తీసుకొచ్చానని చెప్పారు. ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ పేరుతో ఆమె రాసిన ఆత్మకథను సోమవారం ఢిల్లీలోని ఐటీసీ హోటల్‌లో అధికారికంగా ఆవిష్కరించారు. ఈ పుస్తకం ఈ నెల 10నే మార్కెట్‌లోకి వచ్చింది. ప్రచురణ సంస్థ హార్పర్ కాలిన్స్ ఇండియా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో రాహుల్, ప్రియాంక పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత సోనియా పుస్తకం గురించి మాట్లాడారు. ‘నా అత్తగారు ఇందిరాగాంధీ, నా భర్త, కొడుకు రాహుల్, కూతురు ప్రియాంక.. ఇలా మా కుటుంబం అందరి మీదా ఎన్నో ఏళ్లుగా తప్పుడు ప్రచారం చేశారు. మనసును గాయపరిచే మాటలు అన్నారు. నా వైపు నుంచి కథ ఏమిటో చెప్పాలంటే పుస్తకం రాయడమే సరైందని అనిపించింది’ అని సోనియా చెప్పారు. పుస్తకానికి వస్తున్న ఆదరణ ఎంతో సంతోషం కలిగించిందన్నారు.
తన పిల్లలు రాహుల్, ప్రియాంక, స్నేహితురాలు మంజూలికా దూబే పట్టుబట్టడం వల్లే ఈ పుస్తకం రాశానని తెలిపారు. తనకు డైరీ రాసే అలవాటు లేదని, జీవితంలో జరిగిన సంఘటనలను గుర్తు చేసుకుని రాశానని చెప్పారు. మొదట్లో రాయడం కష్టంగా అనిపించినా, ఒకసారి మొదలుపెట్టాక ఆనకట్ట తెగినట్టు జ్ఞాపకాలన్నీ బయటకు వచ్చాయని అన్నారు. అత్త ఇందిరాగాంధీ హత్య, భర్త రాజీవ్‌గాంధీ హత్యల గురించి రాసేటప్పుడు చాలా కష్టంగా అనిపించిందని చెప్పారు.
కోడలిగా సర్దుకుపోవడమే ‘బిలాంగింగ్’
ఇటలీ నుంచి వచ్చి కొత్త సంస్కృతిలో, కొత్త కుటుంబంలో కలిసిపోవడానికి తాను పడిన కష్టమే ఈ పుస్తకమని సోనియా చెప్పారు. ఈ దేశానికి చెందినదాన్నిగా మారిన అనుభవాన్ని చెప్పడానికే ‘బిలాంగింగ్’ అనే పేరు పెట్టానన్నారు. పెళ్లయి అత్తారింటికి చేరే చాలామంది అమ్మాయిలకు ఎదురయ్యే అనుభవమే తనకూ ఎదురైందని చెప్పారు. అందరు కోడళ్లలాగే తానూ కొత్త వాతావరణానికి, కొత్త పద్ధతులకు అలవాటు పడ్డానన్నారు. ఇందిరాగాంధీ అంటే మొదట్లో తనకు ఎంతో భయంగా ఉండేదని, ఆమెను ‘మమ్మీ’ అని పిలవడానికి కొంత సమయం పట్టిందని సోనియా చెప్పారు. రాహుల్, ప్రియాంక పుట్టాక ఇందిరలో ఎంతో మార్పు వచ్చిందని తెలిపారు. ఆమె ఎంత బిజీగా ఉన్నా డైనింగ్ టేబుల్ దగ్గర అందరం కలుసుకుని మాట్లాడుకునే వాళ్లమని గుర్తుచేసుకున్నారు.
ఆ రెస్టారెంట్‌కు వెళ్లండి.. చికెన్ మాత్రం తినకండి: రాహుల్
పుస్తకావిష్కరణలో రాహుల్‌గాంధీ తన తల్లిదండ్రుల గురించి చెప్పిన సంగతులు సభికులను ఒకసారి నవ్వించాయి, మరోసారి కంటతడి పెట్టించాయి. సోనియా, రాజీవ్ తొలిసారి కలుసుకున్న కేంబ్రిడ్జ్‌లోని వర్సిటీ రెస్టారెంట్‌కు చాలా ఏళ్ల తర్వాత తన గర్ల్‌ఫ్రెండ్‌తో వెళ్లానని రాహుల్ చెప్పారు. తన తల్లిదండ్రులు అక్కడే కలిశారని చెబితే, అక్కడి వ్యక్తి ‘వాళ్లిద్దరూ నాకు బాగా తెలుసు’ అన్నాడని తెలిపారు. అతను చెప్పిన ‘చికెన్ షాసర్’ ఆర్డర్ చేశామని అన్నారు. ‘ప్రేమలో పడాలంటే వర్సిటీ రెస్టారెంట్‌కు వెళ్లండి. కానీ అక్కడ చికెన్ షాసర్ మాత్రం తినకండి. అక్కడ భోజనం బ్రహ్మాండంగా ఉండేదని వీళ్లకు గుర్తుంది. కానీ దారుణంగా ఉంది’ అనడంతో సభలో నవ్వులు విరిశాయి. ఇంట్లో భోజనం చేసేటప్పుడు నాన్న తన ఒడిలో అమ్మను కూర్చోబెట్టుకునే వారని రాహుల్ చెప్పారు. అన్ని ఇళ్లలో అలాగే ఉంటుందని అనుకునే వాడినని, స్నేహితుల ఇంట్లో అలా లేకపోవడం చూసి ఆశ్చర్యపోయే వాడినని అన్నారు. తల్లిదండ్రులు గొడవ పడటం తాను ఒక్కసారే చూశానని చెప్పారు. నాన్న ఫోన్‌లో అమరీందర్‌సింగ్‌తో మాట్లాడుతూ అమ్మ పిలుపును పట్టించుకోనప్పుడే ఆ గొడవ జరిగిందని, సభలో ఉన్న అమరీందర్ వైపు చూపిస్తూ గుర్తు చేశారు. ‘‘ఒక అందమైన జీవితాన్ని చూస్తూ పెరిగాం. ఆ తర్వాత ఒక్కసారిగా అంతా ముక్కలై పోయింది. మా ఆధారాల్లో ఒకరిని తుపాకీతో కాల్చిచంపారు. మా అతిపెద్ద ఆధారం బాంబు దాడిలో ముక్కలైపోయారు’’ అని రాహుల్ ఆవేదనగా చెప్పారు. అమ్మ నాలుగు సార్లు క్యాన్సర్‌ను జయించారని, కానీ దాన్ని ఆమె ఎప్పుడూ పెద్దగా చెప్పుకోరని రాహుల్ వెల్లడించారు. ‘‘నా జీవితంలో ఒక్కసారి కూడా ఆమె భయపడటం గానీ, వెనకడుగు వేయడం గానీ చూడలేదు. అమ్మా... నాన్న నిన్ను ఎంతో ప్రేమించారు. నిన్ను చూసి ఆయన ఎంత గర్వపడేవారో చెప్పలేను’’ అంటూ తల్లి వైపు తిరిగి ఉద్వేగంగా ప్రసంగం ముగించారు.
రాజీవ్‌తో ప్రేమ ఓ అద్భుతం
రాజీవ్‌తో తన ప్రేమ ఒక అద్భుతమని సోనియా అన్నారు. ఆయన రాజకీయాల్లోకి వెళ్లడాన్ని తాను వ్యతిరేకించానని, ఆ సమయంలో స్వార్థంగా ఆలోచించానేమోనని ఇప్పుడు అనిపిస్తోందని చెప్పారు. రాజీవ్ మరణం తన జీవితాన్ని అతలాకుతలం చేసిందన్నారు. ఆ తర్వాత తాను చిన్నపిల్లలా అయిపోయానని, రాహుల్, ప్రియాంకలే తనకు తల్లిదండ్రులుగా మారి కాపాడారని చెప్పారు.
ప్రతిపక్షాల బల ప్రదర్శన
సోనియా పుస్తకావిష్కరణ కార్యక్రమం ప్రతిపక్షాల బల ప్రదర్శనకు వేదికగా మారింది. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, కర్ణాటక సీఎం శివకుమార్, హిమాచల్ సీఎం సుఖ్విందర్‌సింగ్ సుఖుతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్, తృణమూల్ నేత అభిషేక్ బెనర్జీ కూడా వచ్చారు. నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా, జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, జేఎంఎం నేత, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, తమిళనాడు సీఎం విజయ్ కూడా హాజరయ్యారు.
పుస్తకం అద్భుతం: అమరీందర్
బీజేపీ నేత, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్‌సింగ్ కూడా ఈ కార్యక్రమానికి రావడం గమనార్హం. ‘‘ఇది అద్భుతమైన పుస్తకం. నేను చదివాను. చాలా బాగా రాశారు’’ అని ఆయన మెచ్చుకున్నారు. తిరిగి కాంగ్రె్‌సలో చేరతారా అని అడిగితే, ‘‘లేదు. నా పుస్తకాల ఆవిష్కరణలకు సోనియాజీ వచ్చారు. అందుకే ఆమె పుస్తకావిష్కరణకు రావడం సంతోషంగా ఉంది’’ అని బదులిచ్చారు.