ఖమేనీ హత్యపై మౌనమేల?
ABN , Publish Date - Mar 04 , 2026 | 03:38 AM
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హత్యపై ప్రధాని మోదీ మౌనం వహిస్తున్నారని కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ ధ్వజమెత్తారు.
ప్రధాని మోదీపై సోనియా ఆగ్రహం
న్యూఢిల్లీ, మార్చి 3: ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హత్యపై ప్రధాని మోదీ మౌనం వహిస్తున్నారని కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ ధ్వజమెత్తారు. ఓ దేశాధినేతను హత్య చేయడాన్ని సమర్థిస్తారా అని నిలదీశారు. ఇది తటస్థంగా ఉండడం కాదని.. బాధ్యతను విస్మరించడమేనని మంగళవారం ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ పత్రికకు రాసిన వ్యాసంలో సోనియా ఆగ్రహం వ్యక్తంచేశారు. భారత విదేశాంగ విధానం దిశ, విశ్వసనీయతలపై తీవ్ర సందేహాలు వెలిబుచ్చారు. ఈ అంశంపై పార్లమెంటు మలివిడత బడ్జెట్ సమావేశాల్లో చర్చించాలని డిమాండ్ చేశారు. ‘‘ఖమైనీ హత్య, ఇరాన్ సార్వభౌమాధికారాన్ని అమెరికా, ఇజ్రాయెల్ ఉల్లంఘించడాన్ని భారత ప్రభుత్వం ఖండించలేదు. ఆ రెండు దేశాల భారీ దాడులను విస్మరించి.. యూఏఈపై ఇరాన్ ప్రతీకార దాడిని ప్రధాని మోదీ ఖండించారు. ఆ తర్వాత.. ఈ పరిణామం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని.. చర్చలు, దౌత్యమంటూ నిస్సారంగా మాట్లాడారు. దౌత్యప్రక్రియ జరుగుతుండగానే ఖమైనీ హత్య జరిగింది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ సైద్ధాంతికంగా అభ్యంతరం చెప్పకపోవడం అంతర్జాతీయ విలువలను తుడిచిపెట్టడమే’ అని మండిపడ్డారు. మరోవైపు, ఇరాన్ అధినేత హత్యపై ప్రధాని మోదీ గళం విప్పాలని.. ఓ దేశాధినేత హత్యను సమర్థిస్తారో లేదో జవాబివ్వాలని రాహుల్ డిమాండ్ చేశారు. ఇరాన్‌పై ఏకపక్ష దాడులను.. అలాగే మధ్య ప్రాచ్య దేశాలపై ఇరాన్ దాడులను సమానంగా ఖండించాలని ‘ఎక్స్’లో స్పష్టంచేశారు. ఈ అంశంపై మౌనం కారణంగా భారత ప్రతిష్ఠ మసకబారిందన్నారు.