Share News

ప్రసంగాలతో యువతను రెచ్చగొట్టారు

ABN , Publish Date - Feb 03 , 2026 | 02:27 AM

ప్రముఖ పర్యావరణ ఉద్యమకారుడు, శాస్త్రవేత్త సోనమ్‌ వాంగ్‌చుక్‌ లద్దాఖ్‌ యువతను తన ఉపన్యాసాలతో రెచ్చగొట్టి.. ఆ ప్రాంతంలో నేపాల్‌, బంగ్లాదేశ్‌, శ్రీలంక తరహా పరిస్థితులు సృష్టించాలనుకున్నారని కేంద్ర ప్రభుత్వం ఆరోపించింది.

ప్రసంగాలతో యువతను రెచ్చగొట్టారు

  • అందుకే ముందస్తు అరెస్టు

  • సోనమ్‌ వాంగ్‌చుక్‌ బెయిల్‌ విచారణపై సుప్రీంలో కేంద్రం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: ప్రముఖ పర్యావరణ ఉద్యమకారుడు, శాస్త్రవేత్త సోనమ్‌ వాంగ్‌చుక్‌ లద్దాఖ్‌ యువతను తన ఉపన్యాసాలతో రెచ్చగొట్టి.. ఆ ప్రాంతంలో నేపాల్‌, బంగ్లాదేశ్‌, శ్రీలంక తరహా పరిస్థితులు సృష్టించాలనుకున్నారని కేంద్ర ప్రభుత్వం ఆరోపించింది. సోనమ్‌ చర్యలు దేశ భద్రతకు విఘాతం కలిగిస్తాయని తెలిపింది. గతేడాది సెప్టెంబరులో లద్దాఖ్‌లో జరిగిన హింసాకాండ తర్వాత జాతీయ భద్రతా చట్టం (ఎన్‌ఎస్‌ఏ) కింద సోనమ్‌ను పోలీసులు అరెస్టు చేసి రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌ జైలుకు తరలించిన విషయం తెలిసిందే. ఎన్‌ఎ్‌సఏ కింద ఏడాదిపాటు విచారణ లేకుండా జైలులో నిర్బంధించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో, సోనమ్‌కు బెయిల్‌ ఇవ్వాలని కోరుతూ ఆయన భార్య గీతాంజలి అంగ్మో సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ అరవింద్‌ కుమార్‌, జస్టిస్‌ ప్రసన్న వరాలే సోమవారం విచారణ జరిపారు. కేంద్రం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు వినిపిస్తూ.. పాకిస్థాన్‌, చైనా సరిహద్దుల్లో ఉన్న లద్దాఖ్‌ వంటి సున్నిత ప్రాంతంలో యువతను రెచ్చగొట్టేలా సోనమ్‌ ప్రసంగాలు చేయటం ప్రమాదకరమన్నారు. బంగ్లాదేశ్‌, నేపాల్‌, శ్రీలంకల్లో యువత తిరుగుబాటు చేసి రాజకీయ అస్థిరతను సృష్టించినట్లుగా ఉద్యమించాలంటూ లద్దాఖ్‌ యువతను సోనమ్‌ రెచ్చగొట్టే ప్రయత్నాలు చేశారన్నారు. సోనమ్‌ ప్రసంగాల వీడియోలను చూశాకే ఆయన ముందస్తు అరెస్టుకు.. స్థానిక కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారన్నారు. తుషార్‌ మెహతా వాదనలను వ్యతిరేకిస్తూ గీతాంజలి తరఫున సీనియర్‌ న్యాయవాది కపిల్‌సిబల్‌ వాదనలు వినిపిస్తూ ఊహలతో కూడిన ఆరోపణలతో అరెస్టు చేశారన్నారు. ఇది పూర్తిగా అధికార దుర్వినియోగమని పేర్కొన్నారు.

Updated Date - Feb 03 , 2026 | 02:27 AM