Accident: నాన్నా.. నాకు చావాలని లేదు.. వచ్చి కాపాడు!
ABN , Publish Date - Jan 19 , 2026 | 04:05 AM
ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో 70 అడుగుల లోతున్న ఓ భారీ గోతిలో పడి యువరాజ్ మెహతా(27) అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ చనిపోయాడు.
నీళ్లలో మునిగిపోతున్నాను.. ఎవరైనా రక్షించండి
70అడుగుల గోతిలో పడ్డ ఓ యువకుడి ఆర్తనాదాలు
పొగమంచు వల్ల నీళ్లున్న గోతిలోకి దూసుకెళ్లిన కారు
నోయిడాలో ప్రమాదం..యువకుడి అరుపులు వినిపిస్తున్నా పొగమంచులో కారును కనిపెట్టలేకపోయిన పోలీసులు
నోయిడా, జనవరి 18: ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో 70 అడుగుల లోతున్న ఓ భారీ గోతిలో పడి యువరాజ్ మెహతా(27) అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ చనిపోయాడు. గురుగ్రామ్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో డాటా అనలిస్టుగా పనిచేస్తున్న యువరాజ్ శుక్రవారం రాత్రి ఆఫీసు నుంచి ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దట్టమైన పొగమంచు కారణంగా ఏమీ కనిపించక ఆయన కారు రోడ్డు పక్కన ఉన్న గోతిలోకి దూసుకెళ్లింది. అది పూర్తిగా నీళ్లతో నిండి ఉండటంతో మునిగిపోయింది. కారుతో సహా నీళ్లలో పడ్డ యువరాజ్ బయటకు రాలేక సాయం కోసం ఎంతగానో అరిచాడు. వెంటనే తండ్రికి, స్నేహితుడికి ఫోన్ చేశాడు. ‘‘నేను మునిగిపోతున్నాను. నాకు చావాలని లేదు. కాపాడండి’’ అని వేడుకున్నాడు. తండ్రి, పోలీసులు నిమిషాల వ్యవధిలోనే ప్రమాద స్థలానికి చేరుకున్నారు. అయితే, యువరాజ్ అరుపులు వినిపిస్తున్నప్పటికీ చీకటి అందునా పొగమంచు వల్ల ఏమీ కనిపించకపోవడంతో వారు ఆ నీళ్లలో కారు ఎక్కడ ఉందన్నది గుర్తించలేకపోయారు. యువరాజ్‌తో సహా కారు పూర్తిగా మునిగిపోయింది. ఐదు గంటల తర్వాత కారును గుర్తించి వెలికితీశారు. యువరాజ్ మృతికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని స్థానికులు ఆరోపించారు. గుంత ఉన్న దగ్గర రోడ్డుపై రిఫ్లెక్టర్లు, సైన్ బోర్డులు పెట్టాలని ఎన్నోసార్లు కోరినప్పటికీ అధికారులు స్పందించలేదన్నారు. కాగా, అధికారులు కారును వెలికితీసిన తర్వాత ఆ గోతిని భవన వ్యర్ధాలు, రాళ్లతో పూడ్చేశారు.