Minimum Work Period: 90 రోజులు పనిచేస్తే గిగ్ వర్కర్లకు సామాజిక భద్రత
ABN , Publish Date - Jan 03 , 2026 | 02:37 AM
ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా అమలు చేయాలని అనుకుంటున్న నాలుగు లేబర్ కోడ్‌లకు సంబంధించి కేంద్ర కార్మిక శాఖ ముసాయిదా నిబంధనలను ప్రచురించింది.
న్యూఢిల్లీ, జనవరి 2: ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా అమలు చేయాలని అనుకుంటున్న నాలుగు లేబర్ కోడ్‌లకు సంబంధించి కేంద్ర కార్మిక శాఖ ముసాయిదా నిబంధనలను ప్రచురించింది. ఈ ముసాయిదా నిబంధనల్లో గిగ్, ప్లాట్‌ఫామ్ కార్మికులకు సామాజిక భద్రత కల్పనకు సంబంధించి కేంద్రం కీలకమైన అర్హత రూల్స్‌ను ప్రతిపాదించింది. సామాజిక భద్రత లబ్ధికి అర్హత పొందాలంటే గిగ్ వర్కర్లు ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక అగ్రిగేటర్ వద్ద అయితే కనీసంగా 90 రోజులు, ఒకటి కంటే ఎక్కువ అగ్రిగేటర్ల వద్ద అయితే కనీసంగా 120 రోజులు పనిచేయాల్సి ఉంటుందని కేంద్రం నోటిఫికేషన్‌లో పేర్కొంది. ముసాయిదా రూల్స్ ప్రకారం.. గిగ్ కార్మికుడు లేదా ప్లాట్‌ఫాం కార్మికుడు ఒక రోజు అగ్రిగేటర్ వద్ద పనిచేస్తే, ఆదాయంతో సంబంధం లేకుండా దానిని ఒక రోజు పనిదినంగా పరిగణనలోకి తీసుకుంటారు. అదే ఒక కార్మికుడు మూడు అగ్రిగేటర్ల వద్ద ఒకే రోజు పనిచేస్తే.. దాన్ని మూడు పని దినాలుగా పరిగణిస్తారు.