స్మార్ట్‌ఫోన్ తెరపై మట్టి గుట్టు
ABN , Publish Date - Nov 16 , 2026 | 02:48 AM
గ్లూకోమీటర్ స్ట్రిప్‌పై ఒక్క చుక్క రక్తం వేస్తే క్షణాల్లో మనిషి శరీరంలోని చక్కెర స్థాయిలను చెప్పేస్తుంది. బొటనవేలంత పరిమాణంలో ఉండే పల్స్ ఆక్సిమీటర్‌ను వేలికి పెట్టుకుంటే..
తడిమట్టిని పరీక్షించి భూసార పరీక్షలు చెప్పే న్యూట్రీసెన్స్
ఆకుల చిత్రాలను చూసి తెగులును గుర్తించే ఏఐ మోడల్
‘కిసాన్ తక్’ సదస్సులో ప్రధాని మోదీ చెప్పింది వీటి గురించే
ఈ సాంకేతికతను పూర్తిగా నమ్మలేకపోతున్న రైతులు
న్యూఢిల్లీ, నవంబరు 15: గ్లూకోమీటర్ స్ట్రిప్‌పై ఒక్క చుక్క రక్తం వేస్తే క్షణాల్లో మనిషి శరీరంలోని చక్కెర స్థాయిలను చెప్పేస్తుంది. బొటనవేలంత పరిమాణంలో ఉండే పల్స్ ఆక్సిమీటర్‌ను వేలికి పెట్టుకుంటే.. శరీరంలో ఆక్సిజన్ స్థాయి ఎంత ఉందో ఇట్టే వెల్లడిస్తుంది. మరి వీటిలాగే చిటికెడు మట్టిని పట్టిచూసి అందులోని సారం గురించి చెప్పటం సాధ్యమేనా? సాధ్యమే అంటోంది ఆధునిక సాంకేతికత. మనదేశంలో ఇప్పటికే ఇలాంటి టెక్నాలజీలు కొన్ని అందుబాటులో ఉన్నాయి కూడా.. ఈ నెల 12న కిసాన్ తక్ భారత్ అగ్రికల్చర్ కాన్ఫరెన్స్‌లో ప్రధాని మోదీ చెప్పింది కూడా వీటి గురించే. మొబైల్ ఫోన్ తెరపై చిటికెడు మట్టి వేస్తే.. అందులో మొక్కలకు అవసరమైన నైట్రోజన్, ఫాస్పరస్, కార్బన్ మూలకాల సారం ఎంతశాతం ఉందో క్షణాల్లో చెప్పేస్తుందని మోదీ తెలిపారు. ఆయన ప్రకటనపై సోషల్ మీడియాలో భిన్నవాదనలు జరుగుతున్నప్పటికీ.. మనదేశంలో దాదాపు అలాంటి టెక్నాలజీలు ప్రస్తుతం ఉన్నాయి. క్షేత్రస్థాయిలో మరీ అత్యద్భుతమైన ఫలితాలను ఇవ్వకపోయినా.. భవిష్యత్తులో భూసార పరీక్షలు ఎలా ఉండబోతున్నాయనేందుకు ఇవి ఉదాహరణగా నిలుస్తున్నాయి.

గ్రాము మట్టితో..క్షణాల్లో భూసార పరీక్ష
ఐఐటీ బాంబేకు చెందిన శాస్త్రవేత్త డాక్టర్ రాజుల్ పాట్కర్ భూసార పరీక్ష (సాయిల్ టెస్ట్)ల కోసం ‘న్యూట్రీసెన్స్’ అనే ఒక పరికరాన్ని తయారు చేశారు. గ్లూకోమీటర్ తరహాలోనే పనిచేసే ఈ పరికరం ఒకే ఒక్క గ్రాము తడి మట్టిని పరీక్షించి దానిని సేకరించిన పొలంలో ఎలాంటి ఎరువు మూలకాలు ఎంత శాతం ఉన్నాయి? ఎలాంటి పంట వేస్తే మంచిది? అదనంగా పంటకు ఇంకా ఎలాంటి బయటి ఎరువులు వాడాలి అనే ఆరు రకాల ఫలితాలను క్షణాల్లో మొబైల్ యాప్ ద్వారా చెప్పేస్తుంది. గ్లూకోమీటర్ స్ట్రిప్ లాంటిదే ఈ పరికరానికి కూడా ఉంటుంది. దానిపై మట్టిని వేయగానే.. దానిపై ఉండే ఎలక్ర్టోడ్‌లు ఆ మట్టిలోని నైట్రేట్, హైడ్రోజన్ ఆయాన్లను గ్రహించి మృత్తికలను గుర్తిస్తాయి. ఈ పరికరాన్ని ఇప్పటికే ప్రయోగాత్మకంగా 8 రాష్ట్రాల్లో దాదాపు 15,000 మంది రైతులు వాడి చూశారు. ఈ పరికరంలోని సాయిల్ పీహెచ్ సెన్సార్ పనితీరును ఐఈఈఈ సెన్సార్స్ జర్నల్, ప్రెసిషన్ అగ్రికల్చర్ జర్నల్ ప్రశంసించాయి. దీనిద్వారా ఒకసారి భూసార పరీక్ష చేయటానికి రూ.300 మాత్రమే ఖర్చవుతుందని రాజుల్ పాట్కర్ తెలిపారు.
ఇన్‌ఫ్రారెడ్ లైట్‌తో భూసార పరీక్ష
ఐఐటీ కాన్పూర్ పరిశోధకులు కూడా భూసార పరీక్ష కోసం ‘భూ పరీక్షక్’ అనే పరికరాన్ని తయారుచేశారు. ఇది పొడిమట్టిని పరీక్షించి ఫలితాలను తెలుపుతుంది. 5 గ్రాముల మట్టిపై ఈ పరికరాన్ని ఉంచితే.. అందులోని ఇన్‌ఫ్రారెడ్ కిరణాలు ఆ మట్టిపై పడతాయి. ఆ మట్టిలో ఉండే ఎరువు మూలకాలు.. ఈ కిరణాలను శోషించుకుంటాయి. అయితే, భిన్న మూలకాలు ఇన్‌ఫ్రారెడ్ కిరణాలను భిన్నరకాలుగా శోషించుకుంటాయి. ఆ శోషణలోని తేడాల ఆధారంగా ఈ పరికరం ఫలితాలను ఇస్తుంది. 90సెకన్ల వ్యవధిలో మొబైల్ యాప్ ద్వారా ఫలితాలు తెలుస్తాయి. ఈ పరికరంతో స్మార్ట్ ఫోన్‌కు బ్లూటూత్‌తో అనుసంధానమవుతుంది. ఐకార్-వరి పరిశోధనా కేంద్రం కూడా ‘భూ విజన్’ పేరుతో ఇలాంటి పరికరాన్నే అభివృద్ధి చేసింది. ఇది 30 నిమిషాల్లో 12 రకాల భూసార పరీక్ష ఫలితాలు ఇస్తుంది.
ఆకును ఫొటో తీస్తే.. తెగులు తెలిసిపోద్ది
ప్రస్తుతం టెక్నాలజీ ప్రపంచంలో సంచలనంగా మారిన కృత్రిమ మేధ (ఏఐ)ను కూడా భూసారపరీక్షలు, తెగుళ్ల గుర్తింపు కోసం వినియోగించే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. ఒక ఏఐ మోడల్‌కు పరిశోధకులు 14 రకాల పంటలకు సోకుతున్న 26 రకాల తెగుళ్లను గుర్తించేలా శిక్షణ ఇచ్చారు. ఇందుకోసం వివిధ పంటలకు చెందిన 54,306 ఆకుల చిత్రాలను వినియోగించారు. అయితే, పరిశోధనశాలలోని నియంత్రిత వాతావరణంలో ఈ ఏఐ మోడల్ తెగుళ్లను 99.35 శాతం కచ్చితత్వంతో గుర్తించగా.. బయటి వాతావరణంలో 31 శాతం మాత్రమే కచ్చితంగా తెగులును చెప్పగలిగింది. ఈ ప్రయోగ ఫలితాలు ‘ప్లానెట్ సైన్స్’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. నేషనల్ పెస్ట్ సర్వేలెన్స్ సిస్టమ్ (ఎన్‌పీఎస్‌ఎస్) కూడా ఇలా ఆకు చిత్రం ఆధారంగా తెగులును గుర్తించే ‘ప్లాంటిక్స్’ అనే యాప్‌ను రూపొందించింది. ఇది 73 రకాల పంటలకు సోకే 436 రకాల తెగుళ్లను గుర్తింస్తుందని ఇక్రిశాట్ వెల్లడించింది. ఈ యాప్‌ను ఇప్పటికే 3 కోట్లమంది మొబైళ్లలో డౌన్‌లోడ్ చేసుకున్నట్లు తెలిపింది. అయితే, ఈ యాప్ కొన్ని తెగుళ్ల తీవ్రతను సరిగ్గా గుర్తించటం లేదని ఎక్స్‌టెన్షన్ ఎడ్యుకేషన్ అనే భారతీయ జర్నల్ పేర్కొంది. పంటలకు సోకుతున్న తెగుళ్లు, పొలాల్లోని మృత్తిక రకాల గురించి రైతులు మొబైల్ ఫోన్ల ద్వారాతెలుసుకోవటం పెరుగుతోందని నోబెల్ పురస్కార గ్రహీత మైకేల్ క్రెమెర్ తెలిపారు. భూసార పరీక్షలు, పంట సలహాలు, తెగుళ్లపై ముందస్తు హెచ్చరికలు, రైతులకు ప్రభుత్వం అందిస్తున్న పథకాలు తదితర అన్ని అంశాలను ఒకేచోట అందించేందుకు ఈ ఏడాది ఫిబ్రవరి 17న కేంద్ర ప్రభుత్వం ‘భారత్ విస్తార్’ అనే ఏఐ ప్లాట్‌ఫామ్‌ను, యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది.
వీటిలో ఉన్న ‘భారతి’ అనే వాయిస్ అసిస్టెంట్‌తో నేరుగా మాట్లాడి రైతులు తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. భారత్ విస్తార్‌లో 155261 అనే హెల్ప్‌లైన్ నంబర్ కూడా ఉంది. కాగా, వ్యవసాయ రంగంలో సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ.. వాటిని వినియోగించటంలో రైతులు వెనుకంజ వేస్తున్నారు. ఇప్పటికీ గ్రామాల్లో ఒక రైతు తన పొలంలో రెండు బస్తాల ఎరువు వేస్తే.. పక్క రైతు కూడా రెండు బస్తాలు వేస్తున్నాడు తప్ప.. నిజంగా తన పొలానికి ఎంత ఎరువు అవసరం అనే విషయాన్ని తెలుసుకోటం లేదని కిసాన్ తక్ సదస్సులో మోదీ అన్నారు.