Share News

అన్యాయం ఎక్కడున్నా సీజేపీ పోరాటం

ABN , Publish Date - Jul 27 , 2026 | 06:04 AM

దేశంలో ప్రతిపక్షాలను, ప్రశ్నించే గొంతుకలను అణిచివేస్తూ ప్రజాస్వామ్యాన్ని హత్య చేసేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) ఆందోళనలో పాల్గొన్న...

అన్యాయం ఎక్కడున్నా సీజేపీ పోరాటం

  • మోసం చేస్తే ‘జెన్‌-జీ’ తరం ఊరుకోదు

  • ఏపీ, తెలంగాణలో ప్రజలకోసం ఉద్యమిస్తాం

  • మీడియాతో సీజేపీ తెలుగు రాష్ట్రాల యువత

న్యూఢిల్లీ, జూలై 26(ఆంధ్రజ్యోతి): దేశంలో ప్రతిపక్షాలను, ప్రశ్నించే గొంతుకలను అణిచివేస్తూ ప్రజాస్వామ్యాన్ని హత్య చేసేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) ఆందోళనలో పాల్గొన్న తెలుగు రాష్ట్రాలకు పలువురు యువకులు ధ్వజమెత్తారు. అన్యాయం, అరాచకం జరిగిన ప్రతిచోటా సీజేపీ ప్రజల పక్షాన పోరాడుతుందని వారు చెప్పారు. ఆదివారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విజయ్‌ మల్లంగి, రుచిత్‌ ఆశా కమల్‌, అశోక్‌, పవన్‌ (హెచ్‌సీయూ), ప్రసాద్‌ (ఓయూ), యశ్‌ (కాకతీయ యూనివర్సిటీ) తదితరులు మాట్లాడారు. తెలంగాణలో సుమారు 22 వేల ప్రభుత్వ పాఠశాలలు మూతపడటం ఆందోళనకరమన్నారు. దేశంలో లక్షలాది ప్రభుత్వ బడులను మూసివేస్తూ ప్రైవేట్‌ విద్యా సంస్థలను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. దేశంలోని 80 వేల పాఠశాలల్లో విద్యార్థినులకు కనీసం టాయ్‌లెట్‌ సౌకర్యం కూడా లేదని, ‘వికసిత్‌ భారత్‌’ అంటే ఇదేనా అని నిలదీశారు. విద్యార్థులపై లాఠీచార్జి చేయడం దారుణమన్నారు. విద్యా వ్యవస్థపై రాబోయే తరాలకు నమ్మకం పెంచేందుకే తాము ఈ ఉద్యమం ప్రారంభించినట్లు తెలిపారు. విద్యార్థి ఉద్యమాలతో చలించిన మానవతావాదులు ఆహారం అందిస్తే వారిని పాకిస్థాన్‌ వాళ్లంటూ అవమానపరిచారని, ఇది యావత్‌ దేశానికే అవమానకరమన్నారు. ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించేందుకు యువత ఏకమవుతోందని చెప్పారు. ‘ఇది జెన్‌-జీ తరం.. మోసపూరిత విధానాలను చూస్తూ ఊరుకోదు. సీజేపీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాదు. కానీ తెలుగు రాష్ట్రాల్లో, దేశవ్యాప్తంగానూ ప్రభుత్వాల అక్రమాలపై నిరంతరం పోరాడుతుంద’ని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని మియాపూర్‌లో నీట్‌ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంటే తెలంగాణలోని ఏ ఒక్క రాజకీయ పార్టీ నేత కూడా ఆ కుటుంబాన్ని పరామర్శించలేదని సీజేపీ ప్రతినిధులు ప్రశ్నించారు. విద్యావ్యవస్థపై నమ్మకాన్ని, ప్రేమను ఒలకబోసిన తెలంగాణ బీజేపీ నేతలు ఏమయ్యారని, పేద విద్యార్థిని ఆత్మఘోష వారికి వినపడదా అని ప్రశ్నించారు. హెచ్‌సీయూ భూములు, కేబీఆర్‌ పార్కు అడవుల పరిరక్షణ కోసం ఇప్పటికే పోరాటం చేశామని, భవిష్యత్తులోనూ విద్యా, వైద్య రంగాల్లో జరిగే అన్యాయాలపై ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. తమ ఉద్యమంలో భాగస్వాములు కావాలనుకునే వారు 7277773355 నంబరుకు మిస్డ్‌ కాల్‌ ఇవ్వాలన్నారు.

Updated Date - Jul 27 , 2026 | 06:06 AM