శిందే వర్గంలో చేరిన ఆరుగురు ‘ఉద్ధవ్’ ఎంపీలు
ABN , Publish Date - Jun 23 , 2026 | 02:03 AM
మహారాష్ట్రలో ప్రతిపక్షానికి మరో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన(యూబీటీ) నుంచి ఆరుగురు ఎంపీలు సోమవారం ముంబయిలో ...
ముంబయి, జూన్ 22: మహారాష్ట్రలో ప్రతిపక్షానికి మరో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన(యూబీటీ) నుంచి ఆరుగురు ఎంపీలు సోమవారం ముంబయిలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే నేతృత్వంలోని పాలక శివసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా శిందే విలేకరులతో మాట్లాడుతూ... ‘‘ఆపరేషన్ టైగర్ విజయవంతంగా పూర్తయ్యింది... నేడు మాది రాష్ట్రంలో రెండో అతి పెద్ద(ఎంపీల సంఖ్యలో) పార్టీ.’’ అని చెప్పారు. నాలుగేళ్ల క్రితం తాను గట్టి నిర్ణయం తీసుకున్నానని, దాంతో నేడు సిక్సర్ కొట్టానని అన్నారు. పార్టీ మారిన ఎంపీలందరు తమ శివసేన గుర్తుపైనే 2029 ఎన్నికల్లో వారి నియోజకవర్గాల్లో పోటీ చేస్తారని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. శిందే వర్గంలో చేరిన ఎంపీలు.. సంజయ్ దీనా పాటిల్, సంజయ్ దేశ్‌ముఖ్, సంజయ్ జాదవ్, భావ్‌సాహెబ్ వాక్చురే, నగేష్ పాటిల్ అష్టికర్, ఓంప్రకాశ్ రాజె నింబాల్కర్. శివసేన(యూబీటీ)కి ప్రస్తుతం 9మంది ఎంపీలు ఉండగా... ఆరుగురు శిందే వర్గంలో చేరిపోయారు. కాగా తమ ఎంపీల ఫిరాయింపు నేపథ్యంలో పార్టీ కార్యకర్తలను కలుసుకొనేందుకు ఉద్ధవ్ థాకరే ఈ నెల 27 నుంచి రాష్ట్ర వ్యాప్త పర్యటన చేపట్టనున్నారు.