అయోధ్యను విడిచి వెళ్లొద్దు
ABN , Publish Date - Jun 22 , 2026 | 03:54 AM
అయోధ్యలోని శ్రీరామ మందిరానికి అందిన కానుకలు, విరాళాలు దుర్వినియోగమయినట్టు వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది.
రామ మందిర నిర్వాహకులకు ‘సిట్’ ఆదేశం
బంగారం, వెండి, వజ్రాల రికార్డుల్లో తేడాలు
అయోధ్య, జూన్ 21: అయోధ్యలోని శ్రీరామ మందిరానికి అందిన కానుకలు, విరాళాలు దుర్వినియోగమయినట్టు వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ముగ్గురు ఉన్నతాధికారులతో ఏర్పాటయిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) వివిధ కోణాల్లో విచారణ జరుపుతోంది. దర్యాప్తు జరుగుతున్న దృష్ట్యా అయోధ్యను విడిచివెళ్లకూడదని ఆలయ నిర్వహణ వ్యవహారాలను చూస్తున్న బాఽధ్యులను ఆదేశించింది. ఆదివారం లఖ్‌నవూకు తిరిగి వెళ్తూ ఈ ఆదేశాలు ఇచ్చింది. కానుకలుగా వచ్చిన బంగారం, వెండి నగలు, వజ్రాల వంటి విలువైన రాళ్లకు సంబంధించిన రికార్డుల్లో తేడాలు ఉండడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. కొన్నింటిని సక్రమంగా రికార్డుల్లో నమోదు చేయలేదని గుర్తించింది. దీనిపై ఆలయ ట్రస్టులోని పలువురు కార్యనిర్వాహక సభ్యులను ప్రశ్నించగా వారు సక్రమమైన సమాధానాలు ఇవ్వలేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. నగలను సక్రమంగా నమోదు చేసి, భద్రపరచలేదని సిట్ గుర్తించింది. ముఖ్యంగా 2025 జనవరి-ఫిబ్రవరిలో జరిగిన మహా కుంభమేళా సందర్భంగా హుండీల ద్వారా వచ్చిన సొమ్ముకు లెక్కాపత్రం లేకుండా పోయింది. ఆ సమయంలో ప్రతి రోజూ దాదాపు పది లక్షల మంది వరకు భక్తులు వచ్చారు. గుడిలో ఏర్పాటు చేసిన హుండీలు గంటల వ్యవధిలోనే నోట్లతో నిండిపోయేవి. దాదాపు రెండు నెలల పాటు ఇదే పరిస్థితి కొనసాగింది. వీటిపై సరైన పర్యవేక్షణ, తగిన లెక్కలు లేకపోవడంపై సిట్ ఆరా తీస్తోంది. కేవలం 45 రోజుల సీసీటీవీ కెమేరాల ఫుటేజీ మాత్రమే అందుబాటులో ఉండడం సిట్‌కు సవాలుగా మారింది. ఫుటేజీని తారుమారు చేశారని, కొన్నింటిని డిలీట్ చేశారని కూడా గుర్తించింది. వీటిని తిరిగి పొందేందుకు ప్రయత్నాలు చేస్తోంది.