Share News

ఇళ్లకే బీఎల్వోలు

ABN , Publish Date - Sep 27 , 2026 | 05:51 AM

‘సర్‌’ ప్రక్రియపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతున్న తరుణంలో.. ఎన్నికల సంఘం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పాత ‘సర్‌’తో మ్యాపింగ్‌ కాకపోవడం, వయసు, బంధుత్వాల్లో తేడాలు వంటి తార్కిక వ్యత్యాసాలతో..

ఇళ్లకే బీఎల్వోలు

  • ‘సర్‌’ విచారణ కోసం ఓటర్ల వద్దకే అధికారులు

  • నోటీసులొచ్చిన ఓటర్లు ఈఆర్వో ఎదుట

  • హాజరుకావాల్సిన అవసరం లేదు

  • ఆన్‌లైన్‌లోనే విచారణ.. పత్రాల అప్‌లోడ్‌

  • అత్యవసరమైతేనే వ్యక్తిగతంగా హాజరు

  • పేదలు, కార్మికుల కోసం హెల్ప్‌ డెస్క్‌లు

  • సర్‌ నిర్ణయాలన్నీ ఏకగ్రీవంగానే..

  • ఢిల్లీలో భేటీ అనంతరం ఈసీ ప్రకటన

  • భేటీకి హాజరైన సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌, కమిషనర్లు సుఖ్‌బీర్‌ సంధూ, వివేక్‌ జోషి

  • ఈసీది నష్ట నివారణ ప్రయత్నం

  • జ్ఞానేశ్‌కుమార్‌ రాజీనామా చేయాల్సిందే

  • మోదీ, షా కలిసి ఎన్నికలను ‘ఫిక్స్‌’ చేసే బాధ్యత జ్ఞానేశ్‌కు అప్పగించారు: రాహుల్‌

  • 30న ఇండి కూటమి పార్టీల భేటీ

  • రాహుల్‌వి సిగ్గులేని ఆరోపణలు: బీజేపీ

న్యూఢిల్లీ, సెప్టెంబరు 26: ‘సర్‌’ ప్రక్రియపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతున్న తరుణంలో.. ఎన్నికల సంఘం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పాత ‘సర్‌’తో మ్యాపింగ్‌ కాకపోవడం, వయసు, బంధుత్వాల్లో తేడాలు వంటి తార్కిక వ్యత్యాసాలతో నోటీసులు అందుకున్న ఓటర్లు.. ఇకపై ఈఆర్‌వో (ఎలక్టోరల్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫీసర్‌) ఎదుట నేరుగా విచారణకు హాజరుకావాల్సిన అవసరం లేదు. బూత్‌ స్థాయి అధికారులే (బీఎల్వో) ఓటర్ల ఇళ్లకు వచ్చి అవసరమైన పత్రాలు సేకరిస్తారు. ఈఆర్వోలు సాధ్యమైనంత వరకు ఆన్‌లైన్‌లోనే విచారణ నిర్వహిస్తారు. అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే ఓటర్లను వ్యక్తిగతంగా విచారణకు పిలుస్తారు. ఇక ఈసీఐనెట్‌ వ్యవస్థపై పలు సందేహాలు వ్యక్తమైన నేపథ్యంలో.. సీనియర్‌ డిప్యూటీ ఎన్నికల కమిషనర్‌ నేతృత్వంలో పలువురు అధికారులు, ఐఐటీ లేదా ట్రిపుల్‌ ఐటీ స్వతంత్ర నిపుణుడు సభ్యులుగా కమిటీని ఏర్పాటు చేసి, పరిశీలన జరిపించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. అంతేకాకుండా ‘సర్‌’ ప్రక్రియకు సంబంధించి ఎన్నికల సంఘం జారీ చేసిన ఆదేశాలన్నీ ఏకగ్రీవంగా ఆమోదం పొందినవేనని మరోసారి పేర్కొంది. శనివారం మధ్యాహ్నం ఢిల్లీలో ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ) జ్ఞానేశ్‌కుమార్‌, ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్‌ సింగ్‌ సంధూ, వివేక్‌ జోషిలతో కూడి పూర్తి ఎన్నికల సంఘం భేటీ అయి పలు అంశాలపై చర్చించింది. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై ప్రకటన విడుదల చేసింది.


నేరుగా విచారణకు వెళ్లే పనిలేదు

వివరాల్లో వ్యత్యాసాలతో ‘సర్‌’ నోటీసులు అందుకున్న ఓటర్లు ఇకపై ఈఆర్‌వో ఎదుట వ్యక్తిగతంగా హాజరుకావాల్సిన అవసరం లేదు. బీఎల్వోలు ఓటర్ల ఇళ్లకే వచ్చి అవసరమైన పత్రాలు సేకరించి, ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేస్తారు. వాటిని ఈఆర్‌వో పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు. సాధ్యమైనంత వరకు విచారణను ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తారు. కేవలం అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే సదరు ఓటరును వ్యక్తిగతంగా విచారణకు పిలుస్తారు. అవసరమైతే సంబంధిత ఓటరు తన తరఫున తమ కుటుంబంలోని వయోజనులను ఆ విచారణ కోసం పంపవచ్చు. ఇక ఆన్‌లైన్‌లోనే విచారణ చేపట్టేందుకు అవసరమైన సదుపాయాలను మరింతగా సమకూర్చాలని ఎన్నికల సంఘం భేటీలో నిర్ణయించారు.

ఈసీఐనెట్‌ వ్యవస్థపై పరిశీలనకు కమిటీ

ఈఆర్‌వోలు, ఇతర అధికారులకు వారు నిర్వర్తించే విధులకు అనుగుణంగా ఈసీఐనెట్‌ వ్యవస్థలో అవసరమైన మేర యాక్సెస్‌ ఉంటుందని ఎన్నికల సంఘం పేర్కొంది. అయినా చట్టాలు, నిబంధనలకు అనుగుణంగా ఈసీఐనెట్‌ వ్యవస్థ పనిచేస్తుందో లేదో మరోసారి పరిశీలించేందుకు సీనియర్‌ డిప్యూటీ ఎన్నికల కమిషనర్‌ నేతృత్వంలో, అధికారులు, ఐఐటీ/ట్రిపుల్‌ఐటీకి చెందిన ఒక స్వతంత్ర నిపుణుడితో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపింది. ఇకపై పోర్టల్‌లో, ఐటీ మాడ్యూళ్లలో ప్రవేశపెట్టే కొత్త అంశాలు, చేసే మార్పులపై ‘కమిటీ ఆఫ్‌ ఆఫీసర్స్‌ (సీఓఓ)’లో చర్చించాకే తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపింది.


ఢిల్లీ, మహారాష్ట్రలో ‘సర్‌’ గడువు పెంపు

మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాల ఎన్నికల అధికారుల విజ్ఞప్తి మేరకు ‘సర్‌’ ప్రక్రియల గడువులను పొడిగించినట్టు ఎన్నికల సంఘం తెలిపింది. ఢిల్లీలో అభ్యంతరాలకు గడువును అక్టోబర్‌ 30 వరకు, వాటిని పరిశీలించి, పరిష్కరించే గడువును నవంబర్‌ 30వ తేదీ వరకు.. మహారాష్ట్రలో అభ్యంతరాలకు గడువును అక్టోబర్‌ 12 వరకు, వాటిని పరిశీలించి, పరిష్కరించే గడువును నవంబర్‌ 10వ తేదీ వరకు పెంచినట్టు వెల్లడించింది. బిహార్‌, పశ్చిమబెంగాల్‌ సహా 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ‘సర్‌’ ప్రక్రియ పూర్తయిందని.. ఇంకా 12 రాష్ట్రాల్లో కొనసాగుతోందని ఎన్నికల సంఘం తెలిపింది.

ఏకగ్రీవంగానే ‘సర్‌’పై నిర్ణయాలు

‘సర్‌’పై జారీ చేసిన ఆదేశాలన్నీ ముగ్గురు కమిషనర్లు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినవేనని ఎన్నికల సంఘం మరోసారి పేర్కొంది. పూర్తిస్థాయి కమిషన్‌ భేటీకి సంబంధించిన ఎజెండాను ముందుగానే సభ్యులకు పంపుతామని, భేటీ మినిట్స్‌ను కూడా విడుదల చేస్తామని తెలిపింది. ఎన్నికల కమిషనర్లు క్యాబినెట్‌ కార్యదర్శికి రాసిన లేఖ.. ఎన్నికల సంఘం, దాని ఐటీ విభాగానికి సంబంధించిన విధాన నిర్ణయానికి సంబంధించినది కాదని వెల్లడించింది. ఎన్నికల సంఘంలో డిప్యూటేషన్‌పై పనిచేస్తున్న ఒక అధికారి పనితీరుకు సంబంధించిన అంశంపైనే ఆ లేఖ రాశారని వివరించింది. సదరు అధికారి జారీ చేసిన ఆదేశాలు అమల్లోకి రాలేదని తెలిపింది. ఇక ‘సర్‌’ ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో కొత్త ఓటర్ల నమోదు కోసం ఫారం-6కు చేసిన అనుబంధ మార్పును సుప్రీంకోర్టు సమర్థించిందని ఈసీ పేర్కొంది. ‘సర్‌’ ప్రక్రియ లేని సమయంలో కొత్త ఓటర్ల దరఖాస్తులకు 1960నాటి చట్టానికి అనుగుణమైన ఫారాలనే వినియోగిస్తామని వివరించింది. గోవాలో అర్హుల పేర్లను తిరిగి ఓటరు జాబితాలో చేర్చే ప్రక్రియ కొనసాగుతోందని వెల్లడించింది.


ఈ నెల 30న ఇండి కూటమి పార్టీల భేటీ

ఎన్నికల సంఘంలో విభేదాలు, ‘సర్‌’ ప్రక్రియపై వ్యక్తమవుతున్న ఆందోళనలు, ఇతర రాజకీయ అంశాలను చర్చించేందుకు ఇండి కూటమి పార్టీలు ఈ నెల 30న ఢిల్లీలో భేటీకానున్నాయి. కాంగ్రెస్‌ పార్టీలోని అత్యున్నత నిర్ణాయక మండలి ‘సీడబ్ల్యూసీ’ ఈ నెల 29న భేటీ కానుంది. మరోవైపు, ఎన్నికల సంఘంలో విభేదాలు అంటూ ఒక తప్పుడు కథనాన్ని పట్టుకుని రాహుల్‌ గాంధీ, ఇతర ప్రతిపక్షాలు చేస్తున్న సిగ్గులేని నిరాధార ఆరోపణలన్నీ ఎన్నికల సంఘం ప్రకటనతో బయటపడ్డాయని బీజేపీ నేత రవిశంకర్‌ ప్రసాద్‌ పేర్కొన్నారు. ముగ్గురు ఎన్నికల కమిషనర్లు ఏకగ్రీవంగా నిర్ణయాలు తీసుకున్నారని స్పష్టమైందని తెలిపారు.

జ్ఞానేశ్‌.. నాకు బీజేపీ టికెట్‌ ఆఫర్‌ చేశారు: జిజి థామ్సన్‌

తాను 2016లో ఢిల్లీకి వెళ్తున్న సమయంలో ఆనాడు కేంద్ర సర్వీసులో(ప్రస్తుత సీఈసీ) ఉన్న జ్ఞానేశ్‌ కుమార్‌ 2019లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేయాలని అడిగారని కేరళం మాజీ సీఎస్‌ జిజి థామ్సన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఆ ప్రతిపాదనను తిరస్కరించినట్లు వెల్లడించారు. పదవీ విరమణ తర్వాత ఏం చేయాలనుకుంటున్నావని జ్ఞానేశ్‌ తనను అడిగారని థామ్సన్‌ చెప్పారు. పిల్లల కోసం ఓ ప్రాజెక్టుపై పనిచేయాలని భావిస్తున్నట్లు తాను పేర్కొన్నానన్నారు. అయితే దీనికి బదులుగా కేరళంలోని పతనంథిట్ట లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ తరఫున పోటీ చేయాలని జ్ఞానేశ్‌ సూచించారన్నారు. గెలిచాక కేంద్రమంత్రి కూడా కావచ్చని చెప్పారన్నారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ స్పందించారు. ‘ఆనాడు ఐఏఎస్‌గా ఉన్న జ్ఞానేశ్‌ను మొదట అభ్యర్థుల ఎంపిక కోసం ఉపయోగించుకున్నారు. ఆ తర్వాత మోదీ, షా ఆయన్ను అంపైర్‌గా చేసి.. భారత ఎన్నికల మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు ఇన్‌చార్జ్‌గా నియమించారు’ అని మండిపడ్డారు. బీజేపీ అభ్యర్థులను ఎంపిక చేయడానికి జ్ఞానేశ్‌కు ఎవరు అధికారమిచ్చారని.. ఓ ఐఏఎస్‌ అధికారి దీనిపై ఎలా చర్చిస్తారని కేరళ కాంగ్రెస్‌ కూడా ప్రశ్నించింది.

Updated Date - Sep 27 , 2026 | 05:53 AM