పట్టువీడని విపక్షం.. పట్టుకోసం కేంద్రం!
ABN , Publish Date - Oct 05 , 2026 | 05:39 AM
దేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) కేంద్రంగా తీవ్ర రాజకీయ తుఫాను చెలరేగింది. జ్ఞానేశ్‌కుమార్ విధానాలు..
సర్‌పై పోరులో ప్రతిపక్షాలకు పెరుగుతున్న మద్దతు
రేపు ఈసీ ప్రధాన కార్యాలయానికి భారీ మార్చ్
విపక్షాల దూకుడుకు అడ్డుకట్ట వేసే వ్యూహాల్లో కేంద్రం
న్యూఢిల్లీ, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): దేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) కేంద్రంగా తీవ్ర రాజకీయ తుఫాను చెలరేగింది. జ్ఞానేశ్‌కుమార్ విధానాలు, సర్ అంశంపై రాజకీయ దుమారం క్రమంగా పెరుగుతోంది. జ్ఞానేశ్‌ను పదవి నుంచి తప్పించాలనే డిమాండ్‌తో ఇండియా కూటమి, కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) పోరాటాలు తీవ్రతరం చేస్తున్నాయి. గతంలో కేంద్ర మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చినట్లుగానే జ్ఞానేశ్ విషయంలోనూ పోరాడాలని ప్రయత్నిస్తున్నాయి. కేంద్రం, ఈసీపై ఒత్తిడి పెంచేందుకు ఇండియా కూటమి స్పష్టమైన కార్యాచరణను ప్రకటించింది. గాంధీ జయంతి రోజైన ఈ నెల 2న విపక్షాలు, సీజేపీ వేర్వేరుగా దేశవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుట్టాయి. ముంబై, ఢిల్లీలో ఈ నిరసనలు పూర్తిగా భిన్నంగా సాగాయి. ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద జరిగిన ఆందోళనల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా, ముంబైలో సీజేపీ ఆధ్వర్యంలో నిరసనలు హోరెత్తాయి. మంగళవారం పార్లమెంటు ఉభయ సభలకు చెందిన విపక్ష ఎంపీలు ఢిల్లీలోని ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయానికి భారీ ప్రదర్శన నిర్వహించనున్నారు. నవంబరు 1న ఢిల్లీ వేదికగా పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. సుప్రీంకోర్టులో జ్ఞానేశ్‌కు వ్యతిరేకంగా పిటిషన్లు దాఖలు కావడంతో కేంద్రంపై ఒత్తిడి పెరిగింది. విపక్షాల దూకుడును అడ్డుకొనేందుకు కేంద్రం వ్యూహాలు రచిస్తోంది. రాజ్యాంగ వ్యవస్థల విశ్వసనీయతను దెబ్బతీసేందుకే విపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయని ప్రజలకు వివరించాలని భావిస్తోంది.